
జాతీయ రహదారిపై దగ్ధమవుతున్న కారు
సాక్షి,జడ్చర్ల: జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారు బుధవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా దగ్ధమైంది. బాధితుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని బడంగ్‌పేటకు చెందిన భరత్, దివ్య భార్యాభర్తలు కలిసి ఓ అద్దె కారులో మంత్రాలయం వెళ్లి స్వామి వారిని దర్శించుకుని బుధవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మండలంలోని మల్లెబోయిన్‌పల్లి స్టేజీ సమీపంలో కారు డ్రైవర్ శ్రీకాంత్ మూత్ర విసర్జన కోసం ఇంజన్ ఆఫ్ చేయగా.. ముందుభాగం నుంచి పొగలు వచ్చాయి.
దీంతో ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ శ్రీకాంత్ వెంటనే కారులో ఉన్న భార్యాభర్తలను వారి లగేజీని కిందకు దింపగానే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు మొత్తం కాలిపోయింది. వెంటనే డ్రైవర్ శ్రీకాంత్ 100 నంబర్‌కు డయల్ చేసి పోలీసులు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను ఆర్పారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా కారులో మంటలు చెలరేగి ఉండవచ్చని డ్రైవర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలరాజుయాదవ్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment