
కీవ్ : ఉక్రెయిన్‌లో ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ఓ మైనర్ సహా ఆరుగురు మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన యువతిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. మూడు రోజుల కస్టడీలో నిందితురాలు ఉన్నట్లు సమాచారం. దోషిగా తెలితే యువతికి దాదాపు పదేళ్ల జైలుశిక్ష పడుతుందని పోలీసులు భావిస్తున్నారు.
ఆ వివరాలిలా.. ఉక్రెయిన్‌లో ధనవంతుల్లో వాసిలీ జైస్టేవ్ ఒకరు. వాసిలీకి కూతురు అల్‌యోనా జైస్టేవ్(20) ఉంది. అయితే స్థానిక కార్కివ్ వీధుల్లో అత్యంత విలాసవంతమైన కార్లలో ఆమె షికార్లు కొట్టేది. ఈ క్రమంలో ఇటీవల కార్కివ్ రోడ్లపై వెళ్తుండగా రెడ్ సిగ్నల్ పడింది. ఇదేమీ పట్టించుకోకుండా అల్‌యోనా తన కారును రయ్ మంటూ ముందుకు పోనిచ్చింది. ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారేమోనని వేగంగా కారు నడిపింది. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న పాదచారులపైకి ఆమె కారు దూసుకెళ్లడంతో ఆరుగురు మృతిచెందారు. వీరిలో ఓ మైనర్ ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు తీవ్ర ఆవేశంతో కారుపై దాడికి పాల్పడి ధ్వంసం చేశారు. అయితే ఆమె వెనుక వాహనంలో వస్తున్న బాడీగార్డులు అల్‌యోనాను ప్రాణాపాయం నుంచి తప్పించారు. కానీ చేసిన తప్పిదానికి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో అల్‌యోనా మద్యం సేవించి లేదని విచారణలో తేలింది. ఆరుగురి మృతికి కారకురాలు కావడంతో పాటు ఓ ఏడు నెలల గర్భిణిని తీవ్ర గాయాలపాలు చేసిన నిందితురాలికి పదేళ్ల జైలుశిక్ష పడే ఛాన్స్ ఉందని ఓ సీనియర్ పోలీసు తెలిపారు. డబ్బుందన్న పొగరుతో అల్‌యోనా నిర్లక్ష్యంగా వాహనం నడిపిందని బాధితుల బంధువులు, స్థానికులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment