ఎంవీపీ పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 కార్లను లీజు పేరిట తీసుకున్న ఒక ఘరానా దొంగ వాటిని తాకట్టు పెట్టేశాడు. దీంతో బాధితులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కార్ల కేసులకు సంబంధించి ఇప్పటికే ఎంవీపీ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసుని కూడా టేకప్ చేసింది. కానీ నిందితుడిని రెండుసార్లు విచారణకు పిలిచిన పోలీసులు అరెస్టు చేయకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఫలితంగా సదరు నిందితుడు కొద్దిరోజులుగా పరారీలో ఉంటూ, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో పోలీసులకు ఏం చేయాలో తోచని అయోమయ దుస్థితి నెలకొంది. వివరాలిలా వున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన అడపా ప్రసాద్ (28) ఆరిలోవ టీఐసీ పాయింట్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇతను సెవెన్‌హిల్స్ ఆస్పత్రి దరి రాక్‌డేల్ లే అవుట్ ప్రాంతంలో 369 కేబ్స్ పేరిట ట్రావెల్స్ నడుపుతున్నాడు. కొందరు కార్ల యజమానులు, ట్రావెల్స్ నుంచి 200 వరకు కార్లు లీజుకి తీసుకున్నాడు. మొదట్లో ఐదు నెలల వరకు లీజు మొత్తం చెల్లించాడు. తరువాత అద్దె చెల్లించకపోవడంతో బాధితులు ఎంవీపీ, త్రీటౌన్, ఆరిలోవ, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లలో గత ఏడాది డిసెంబర్‌లో ఫిర్యాదు చేశారు.
కొంప ముంచిన అరెస్టులో జాప్యం
నిందితుడిని రెండుసార్లు విచారణకు పిలిపించిన ఎంవీపీ సిట్ పోలీసులు అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదన్నది ప్రశ్నగా మారింది. మద్దిలపాలెం భానునగర్‌కి చెందిన బల్లా గౌరి, శ్రీహరిపురం ప్రాంతాలకు చెందిన ఎస్.సునీల్‌కుమార్ ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు ప్రసాద్‌ని విచారించిన ఎంవీపీ పోలీసులు అతన్ని అరెస్టు చేయకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజులుగా నిందితుడు పరారీలో ఉన్నాడు. పైగా అతని మొబైల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఎంవీపీ సిట్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఎంఆర్‌పేట ఎస్‌ఐ గణపతి, ఎంవీపీ ఎస్‌ఐ సూర్యనారాయణ సిట్ కింద ఈ కార్ల కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడి కోసం గాలింపు
ఈ సందర్భంగా ఎంవీపీ స్టేషన్ ఎస్‌ఐ సూర్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ నిందితుడు అడపా ప్రసాద్ కోసం గాలిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 71 కార్లు రికవరీ చేశామన్నారు. మిగిలిన కార్ల కోసం గాలిస్తున్నామన్నారు. గతంలో సిట్ పోలీసులు ఒడిశాకి చెందిన ఒక కార్ల దొంగను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించిన సంగతి తెలిసిందే. ఇతను కూడా యజమానుల నుంచి తీసుకున్న కార్లను అనపర్తి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఫైనాన్సియర్లకు తాకట్టు పెట్టేశాడు. ట్రావెల్స్ యజమానులు కార్లు అద్దె లేదా లీజుకి ఇచ్చేముందు తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అద్దెలు చెల్లించలేక తాకట్టు
కార్లు లీజుకి తీసుకున్న అడపా ప్రసాద్ బేరాలు లేని కారణంగా కొన్నాళ్లుగా అద్దెలు చెల్లించలేకపోయాడు. అయితే నిబంధనల ప్రకారం కార్ల యజమానులకు అద్దె విధిగా చెల్లించాల్సి ఉంది. పలువురు కార్ల యజమానులు డబ్బు కోసం ప్రసాద్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఒత్తిళ్లు తట్టుకోలేక ప్రసాద్ ఈ కార్లను తన స్నేహితులు శ్రీనివాస్, సుదర్శన్ ద్వారా అనకాపల్లి, అనపర్తి, రాజమండ్రి, కాకినాడ, జగ్గంపేట ప్రాంతాలకు చెందిన ఫైనాన్సియర్లకు తాకట్టు పెట్టేశాడు. కార్ల ఖరీదు ఆధారంగా రూ.3 లక్షల నుంచి రూ.7లక్షల వరకు తాకట్టు పెట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సిట్ పోలీసులు ఇప్పటి వరకు 71 కార్లు రికవరీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment