మంత్రి ఇలాకాలో జోరుగా పేకాట | Cards Clubs In yeluru West Godavari | Sakshi
Sakshi News home page

మంత్రి ఇలాకాలో జోరుగా పేకాట

Published Wed, Oct 24 2018 1:03 PM | Last Updated on Wed, Oct 24 2018 1:03 PM

Cards Clubs In yeluru West Godavari - Sakshi

క్లబ్‌లో జోరుగా సాగుతున్న పేకాట

సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: పేకాట... కోతాట.. ఎక్కడ ఈ ఆటలు ఆడినా క్షణాల్లో పోలీసులు వాలిపోతారు. వీటిని నిర్వహించే వారితో పాటుగా ఈ జూదాలు ఆడే వారిని అరెస్టు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అసలు అరెస్టులే ఉండవు. కొవ్వూరు పట్టణం నడిబొడ్డులో జూదక్రీడ సాగుతున్నా అటువైపు పోలీసులు కన్నెత్తి చూడరు. ఎందుకు అనుకుంటున్నారా. అసలే మంత్రి గారి ఇలాకా... పైగా లక్షల్లో మామూళ్లు అందించి మరీ నిర్వహిస్తున్నారు. అసలే రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఈ జూదశాలకు బారులు తీరుతున్నారు. కొవ్వూరు మున్సిపాలిటీ కేంద్రం, డివిజన్‌ ప్రధాన పట్టణం. కొవ్వూరు పట్టణం నడిమధ్యలో ఈ జూదక్రీడ సాగుతోంది. వాస్తవానికి లిటరరీ క్లబ్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఈ క్లబ్‌లో మొదట్లో ఉన్నతస్థాయి ఉద్యోగులతో ఎంతో ఆదర్శంగా నడిచేది. జడ్జీలు, ఆర్డీవో స్థాయి అధికారులు సభ్యులుగాఉండేవారు. రానురాను కొంత మంది రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లింది. క్లబ్‌కి వచ్చిన ఆదాయంతో కల్యాణ మండపం, జిమ్‌ వంటి వసతులు ఏర్పాటు చేశారు. క్లబ్‌ సభ్యత్వం కలిగిన వారి కుటుంబాలు కూడా ఇక్కడ వివిధ వేడుకలు నిర్వహించుకునేవారు. కళ్యాణ మండపం సభ్యులకు నామమాత్రపు రుసుముతోను ఇతరులకు నిర్దేశిత ధరలకు ఇస్తున్నారు. క్లబ్‌ జిమ్‌కు పరిమితమైంది.

ఇక క్లబ్‌గా మార్పు
గత సంవత్సర కాలంగా లిటరరీక్లబ్‌ పేకాటక్లబ్‌గా మారిపోయింది. నిర్దేశిత సమయంలో క్లబ్‌ సభ్యులు కొన్నిరకాలైన పేకాట ఆడుకోవచ్చునన్న కోర్టు తీర్పుని సాకుగా చూపిస్తూ క్లబ్‌ నడుపుతున్నారు. ఇక్కడకు 400 మీటర్ల దూరంలో ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ కార్యాలయం ఉంది. అంతే కాకుండా 500 మీటర్ల పరిధిలో శాంతిభద్రతల డీఎస్పీ కార్యాలయం, డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ అయిన ఆర్డీవో కార్యాలయం ఉన్నాయి. అర కిలోమీటరు దూరంలో టౌన్‌ పోలీస్‌స్టేషన్, రూరల్‌ పోలీస్‌స్టేషన్, సీఐ కార్యాలయం ఉంది. అయినప్పటికీ పేకాట రాయుళ్లు తమ జూదక్రీడను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే పట్టణ ప్రజలు నిరంతరం తిరుగుతూ ఉండే ప్రదేశం.. పైగా రైల్వే స్టేషన్‌ పక్కనే ఉన్నప్పటికీ ఈ జూదాన్ని నియంత్రించే నాథుడే లేకుండా పోయాడు. నిబంధనలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి వరకూ పేకాట నడుస్తోంది.

కాసులే కీలకం
ఈ క్లబ్‌లో గతంలో రూ.25 వేలు ఉండే సభ్యత్వాన్ని ఇప్పుడు రూ.లక్షకు పెంచారు. పెద్ద మొత్తంలో పోలీసులకు కాసులు ఇస్తూ వీరి పనికానిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి తోడు రాష్ట్ర మంత్రికి కూడా పెద్ద ఎత్తున ముడుపులు ఇస్తున్నట్లు చెబుతున్నారు. డివిజన్‌స్థాయి పోలీసులకు, స్థానిక నేతలకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. క్లబ్‌ నిర్వాహకులకు రూ.50 లక్షలకు పైగా నెలవారీ ఆదాయం వస్తున్నట్లు అంచనా. మంత్రి ప్రోద్భలంతోనే ఈ జూద ప్రక్రియను ప్రోత్సహిస్తున్నారని బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు సేవా కార్యక్రమాల పేరుతో కొంత సొమ్ము వెచ్చించి,  క్లబ్‌ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు బయటికి ప్రచారం చేసుకుంటున్నారు.

1100 అపరిష్కార వేదిక
ఎటువంటి అవినీతి జరిగినా పరిష్కరించేందుకు 1100 ఎంతో దోహద పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు బాహాటంగానే ప్రకటించుకుంటున్నా ఈ లిటరరీ క్లబ్‌ బాగోతంపై ఫిర్యాదులు చేసినా కనీసం స్పందించిన పాపాన పోవడం లేదు. ఇది కేవలం ప్రకటనలకు మాత్రమే అనేది స్పష్టం అవుతోంది. ఇక 100 ఫోన్‌ చేసినా స్థానికంగా పోలీసులు స్పందించిన పాపాన పోవడం లేదు. పైగా ఈ క్లబ్‌లో పేకాట నిర్వహించుకునేందుకు అనుమతులు ఉన్నాయంటూ పోలీస్‌బాసులే సమాధానం చెబుతూ వెనకేసుకురావడం కొసమెరుపు. వాస్తవానికి అనుమతులు ఉంటే క్లబ్‌ మెంబర్లే ఉండాలి. అంతే కాకుండా కనీస నిబంధనలు అయిన సీసీ కెమేరాల పర్యవేక్షణలో నిర్వహించుకోవాలి. అటువంటి నిబంధనలే లేకుండా ఎక్కడివారైనా ఇక్కడ మాత్రం యథేశ్ఛగా పేకాట, జూదం ఆడుకునేందుకు కొవ్వూరు లిటరసీ క్లబ్‌ వేదికగా మారుతోంది.   

మళ్లీ తెరుచుకున్న జంగారెడ్డిగూడెం క్లబ్‌
జంగారెడ్డిగూడెం క్లబ్‌ మళ్లీ తెరుచుకుంది. సాక్షి కథనాలతో కొంతకాలం మూతపడిన క్లబ్‌లు మళ్లీ తెరుచుకుం టున్నాయి. ఉంగుటూరు నియోజకవర్గంలోని పేకాట క్లబ్‌లను మళ్లీ తెరిపించేందుకు ప్రజాప్రతినిధులు జిల్లా పోలీసు అధికారులపై వత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. తణుకు వేల్పూరులో ఐదు ప్రాంతాల్లో పేకాట క్లబ్‌లు నడుస్తుండగా, తాడేపల్లిగూడెం బ్రహ్మయ్యతోటలో పేకాట స్థావరం నడుస్తున్నట్లు సమాచారం. జిల్లాలో పేకాట క్లబ్‌లు, స్థావరాలు యథేశ్చగా సాగుతున్నా స్పెషల్‌ బ్రాంచి అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేకాట క్లబ్‌లను ఉక్కుపాదంతో అణిచివేయాలని భావిస్తున్న జిల్లా ఎస్పీకి సరైన సమాచారం అందడం లేదని తెలుస్తోంది.

రమ్మీగేమ్‌కి అనుమతి ఉంది
లిటరరీ క్లబ్‌ రిజిస్ట్రార్‌ క్లబ్‌. రమ్మీ గేమ్‌ ఆడుకోవడానికి అనుమతి ఉంది. క్లబ్‌లో 250 మంది వరకు సభ్యులున్నారు. రెగ్యులర్‌ రమ్మీ ఆడుతున్నారు. రమ్మీ అనేది స్కిల్‌ గేమ్‌. దీన్ని అడ్డుకునే అర్హత పోలీసులకు లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పేకాడుతున్నారనేది ఆవాస్తవం. ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు క్లబ్‌ని తనిఖీ చేశారు. నిర్దేశిత సమయాల్లో క్లబ్‌ సభ్యులు రమ్మీ ఆడుకునే అవకాశం ఉంది.
–ఎస్‌.వెంకటేశ్వరరావు, డీఎస్పీ, కొవ్వూరు

లీజుకి ఇచ్చి మరీ పేకాడిస్తున్నారు
లిటరరీక్లబ్‌లో పేకాట సాగుతున్నా పట్టించుకునే నాథుల్లేరు. క్లబ్‌ కమిటీ పేకాట నిర్వహణకు లీజుకు ఇచ్చారు. ఆ సొమ్ము లీజుదారుడు క్లబ్‌కి చెల్లించే  ఓప్పందం చేసుకున్నారు. సభ్యులు మాత్రమే రమ్మీ ఆడుకోవాలి. అయితే తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పేకాట కోసం తరలివస్తున్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. పేకాటకి వచ్చిన కార్లు  పార్కింగ్‌తో జనం సైతం ఇబ్బందులు పడుతున్నారు.– పరిమి రాధాకృష్ణ, క్లబ్‌ మాజీ కార్యదర్శి, కొవ్వూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement