yeluru
-
వివాహేతర సంబంధం: నమ్మించి లాడ్జికి తీసుకువెళ్లి..
సాక్షి, ఏలూరు టౌన్( పశ్చిమ గోదావరి): అనుమానం పెనుభూతంలా మారడంతో వివాహితను ఆమె ప్రియుడు గొంతు బిగించి హతమార్చాడు. మృతదేహాన్ని గోనె సంచులో చుట్టి కాలువ గట్టుపై పడేశాడు. ఈనెల 13న జరిగిన హత్య ఘటనలో నిందితుడిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ దిలీప్‌కిరణ్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడెంకు చెందిన పులిపాకల శిరీష భర్త మరణించడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు పెదవేగి మండలం నాగన్నగూడెంకు చెందిన జిజ్జువరపు సుబ్బారావుతో పరిచయమైంది. సుబ్బారావు కొబ్బరితోటల్లో కూలీగా పనిచేస్తూ ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఆమె వేరే వ్యక్తితో మాట్లాడుతున్నట్టు తెలుసుకున్న సుబ్బా రావు అనుమానం పెంచుకున్నాడు. రెండు నెలల క్రితం వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఆమెను హతమార్చాలని పథకం రచించాడు. ఈ క్రమంలో ఈనెల 13న ఆమెను మోటారు సైకిల్ ఎక్కించుకుని జంగారెడ్డిగూడెంలో ఓ లాడ్జికి తీసుకువెళ్లాడు. వెనుక నుంచి ఒక్కసారిగా ఆమె మెడను తువాలుతో బిగించి చంపేశాడు. గోనె సంచిలో మృతదేహాన్ని కట్టి పెదవేగి మండలం లక్ష్మీపురం శివారు పోలవరం కుడికాలువ గట్టు మట్టి దిబ్బలపై పడేసి ఉడాయించాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పెదవేగి ఎస్సై టి.సుధీర్‌కుమార్ దర్యాప్తు ప్రారంభించారు. ఏలూ రు రూరల్ ఇన్చార్జి సీఐ డీవీ రమణ ఆధ్వర్యంలో కేసును చేధించి నిందితుడు సుబ్బారావును అరెస్ట్ చేశారు. చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ ఎస్సై ఎన్. లక్ష్మణబాబు, పెదవేగి సిబ్బంది బి.ఏసోబు, సీహెచ్.సుధీర్, రామచంద్రరావు, వెంకటేశ్వరరావును డీఎస్పీ అభినందించారు. చదవండి: మృత్యుంజయడు.. ఆరు గంటల పాటు వరద ఉధృతిలో,చుట్టూ పాములు.. -
అన్న క్యాంటీన్ అవినీతిపై దర్యాప్తు
సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : గత ప్రభుత్వ హయాంలో పేదలకు భోజనం పెట్టే పేరుతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో దోచేశారని, జిల్లాలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయాలంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ జేసీ ఎం.వేణుగోపాలరెడ్డిని కోరారు. దీనిపై స్థానిక కలెక్టరేట్లో గురువారం ఆయన జేసీకి వినతిపత్రం అందజేశారు. టీడీపీ హయాంలో జిల్లాలో మొత్తం 16 అన్న క్యాంటీన్లను నిర్మించారన్నారు. వీటి కొరకు ప్రభుత్వం నుంచి రూ.36 లక్షలు, స్థానిక మున్సిపాలిటీల నుండి రూ.6 లక్షలు చొప్పున మొత్తం రూ.42 లక్షలు ఖర్చు చేశారన్నారు. ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టాలంటే స్థలం కొని దాని నిర్మాణం చేస్తే స్థలం, నిర్మాణము కలిపి ఒక చదరపు అడుగుకి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకూ ఖర్చవుతుందన్నారు. అయితే అన్న క్యాంటీన్లు కట్టడానికి స్థలాలు మున్సిపాలిటీ, ప్రభుత్వ స్థలాలు కావడం వల్ల నిర్మాణానికి ఒక చదరపు అడుక్కి రూ.1,500 చొప్పున మాత్రమే ఖర్చవుతుందన్నారు. అయితే గత పాలకులు ఒక చదరపు అడుక్కి రూ.5,532 చొప్పున వసూలు చేశారన్నారు. ఒక్కో అన్న క్యాంటీన్లో రూ.30 లక్షల వరకూ అవినీతి చోటు చేసుకుందని ఆయన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ లెక్కన జిల్లాలోని 16 అన్న క్యాంటీన్లలో సుమారు రూ.4.80 కోట్లు అవినీతి చోటు చేసుకుందని తెలిపారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ నిర్వహించి ప్రజాధనాన్ని కాపాడాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చినమిల్లి గణపతిరావు, రేలంగి శ్రీనివాసరావు, కాపిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రేషన్ షాపుల వద్దే ఈ–కేవైసీ
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఈ–కేవైసీ నమోదు చేయించుకోవాలన్ననిబంధనపై ప్రతిపక్షాలు, మీడియా తప్పుడు ప్రచారానికి దిగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడువు అయిపొతుందన్న పుకార్లతో ఆధార్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. అయితే 15 ఏళ్లు దాటిన వారికి వచ్చేనెల ఐదు వరకూ, 15ఏళ్ల లోపు పిల్లలకు వచ్చేనెల 15 వరకూ గడువు ఉందని ప్రభుత్వం ప్రకటించింది. సాక్షి, తూర్పుగోదావరి(ఏలూరు) : ఈ–కేవైసీ అనేది ఆయా రేషన్ షాపుల్లో డీలర్ల వద్ద వేలిముద్ర ద్వారా చేసుకునే కార్యక్రమం మాత్రమే. ఇంటింటికీ రేషన్ సరఫరా సమయంలో ఆయా కుటుంబాల్లో వేలిముద్రలు లేనివారు ఉంటే వారికి ఇబ్బందులు తలెత్తుతాయని, కుటుంబ యజమాని వచ్చేంత వరకూ వేచి చూడాల్సి వస్తుందన్న ఉద్దేశ్యంతో ఆ రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. రేషన్ షాపుల వద్దే ఈ–కేవైసీ మన జిల్లా విషయానికి వస్తే నాలుగు లక్షల 85 వేల మంది ఈ–కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంది. ఆయా రేషన్ షాపుల వద్దే ఈపాస్ మిషన్ ద్వారా దీన్ని నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఈ–కేవైసీ లేకపోయినా ఎవరి రేషన్ కట్ చేయడం జరగదు. అయితే కొత్త రేషన్ కార్డు కావాలన్నా, డ్వాక్రా గ్రూపు సభ్యులుగా నమోదు అవ్వాలన్నా, అమ్మ ఒడి, పింఛన్లు, ఇలా ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలన్నా ఈ–కేవైసీతోపాటు ప్రజాసాధికార సర్వేలో నమోదు కావాలని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆందోళనకు గురవుతున్న ప్రజలు పనులు మానుకుని, పిల్లలను స్కూల్ ఎగ్గొట్టించి మరీ మీ సేవ, ఆధార్ కేంద్రాలకు తిప్పుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గతంలో నిర్వహించిన సాధికార సర్వేలో నమోదు కానివారు ఇంకా 1.75 లక్షల మంది వరకూ ఉన్నారు. వీరందరి దగ్గరకు ఆయా గ్రామాలు, పట్టణాల్లోని సర్వే బృందం వచ్చి వివరాలను నమోదు చేసుకుంటుంది. ఇలా నమోదు చేసుకోవచ్చు.. ఆధార్ కార్డు ఉండి బయోమెట్రిక్ లేదా ఓటీపీ ఆధారంగా ఈ–కేవైసీ నమోదు చేసుకోవచ్చు. ఈకేవైసీ నమోదు సమయంలో 101 ఎర్రర్ అని వస్తే వారు తప్పని సరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లి తమ వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాలి. రేషన్ షాపులో ప్రతినెలా వేలి ముద్రలు వేసి రేషన్ తీసుకునే వారు వివిధ, పింఛన్లు పథకాల్లో బయోమెట్రిక్ పడే వాళ్ళకు ఈ–కేవైసీ వెంటనే పూర్తవుతుంది. ప్రస్తుతం రేషన్ డీలర్లకు డిపో పరిధిలో ఉన్న కార్డుదారులలో ఈకేవైసీ నమోదు చేసుకోని వారి పేర్ల జాబితాను డీలర్లకు ఇచ్చారు. ఈ జాబితాల్లో పేర్లు ఉన్న వాళ్ళు ముందుగా వెళ్లి రేషన్ డీలర్ వద్దకు వెళ్లి వేలి ముద్రను వేసి ఈ–కేవైసీని ఉచితంగా చేసుకోవచ్చు. అయితే డీలర్లు ఈకేవైసీ చేయకుండా అందరినీ ఆధార్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలకు పంపుతుండటంతో సమస్య మొదలైంది. దీంతో సర్వర్లు పనిచేయడం లేదని ఆధార్, మీసేవ కేంద్రాల నిర్వాహకులు తిప్పుకుంటున్నారు. ఆధార్ సెంట ర్లో ఆధార్ నమోదుకు రూ.50, ఈకేవైసీ నమోదుకు రూ.15 చెల్లిస్తే సరి. అయితే ప్రజల నుంచి నిర్వాహ కులు భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో 8,913 మంది ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. -
కొల్లేరు కట్టుబాట్లకు చెల్లుచీటి పలకండి
కైకలూరు: ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటి ఓటు హక్కును కొల్లేరు గ్రామాల్లో కట్టుబాట్లు చిదిమేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటు సభ్యుడు కోటగిరి శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా కైకలూరు ట్రావెలర్స్ బంగ్లాలో గురువారం జరిగిన కొల్లేరు గ్రామాల ఆత్మీయ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)తో కలసి ఆయన పాల్గొన్నారు. కృష్ణాజిల్లాకు చెందిన 110 మంది కొల్లేరు గ్రామాల పెద్దలు ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. మరో 15 గ్రామాల ప్రజలు పార్టీలో చేరాలని తీర్మానం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో కుల కట్టుబాట్ల కారణంగా ఒకే పార్టీకి చెందిన వ్యక్తికి ఓట్లు వేయడం మంచి పద్ధతి కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనైనా కొల్లేరు ప్రజలు కట్టుబాట్లు కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో కొల్లేరులో రెగ్యులేటర్ నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని భూములు రీ సర్వే జరుగుతుందని, కొల్లేరు భూములు ఇందులో ఉంటాయని తెలిపారు. వైఎస్సార్ సీసీ నాయకులు ముంగర నరసింహారావు, కొండలరావు, బొడ్డు నోబుల్, వాసిపల్లి యోనా, పంజా రామారావు, కొల్లేరు పెద్దలు సైత సత్యనారాయణ, ఘంటసాల వెంకటేశ్వరరావు, నబిగారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
లేడీస్ హాస్టల్‌కి వెళ్లి ఆ తర్వాత...
సాక్షి, పశ్చిమగోదావరి : పట్టణంలో మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించిన గోశాల ప్రసాద్ అనే యువకుడిని గురువారం అరెస్ట్ చేసినట్లు పట్టణ ఎస్సై కె.కేశవరావు తెలిపారు. యువతి తల్లి జూలై 29న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. నిందితుడిని కోర్టుకి హాజరుపరచనున్నట్టు పేర్కొన్నారు. ఇద్దరు యువకులపై కేసు.. ఏలూరు టౌన్: లేడీస్ హాస్టల్లోకి అక్రమంగా ప్రవేశించి కిటికీలోంచి వీడియోలు తీస్తున్న ఇద్దరు యువకులపై ఏలూరు త్రీటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు కట్టా సుబ్బారావుతోటలోని ఎంఆర్సీ వీధిలోని మనస్వి లేడీస్ హాస్టల్ వద్దకు రోజూ రాత్రివేళల్లో ఇద్దరు యువకులు గోడలు దూకి వస్తున్నట్టుగా గుర్తించారు. వారిద్దరూ గోడదూకి ప్రాంగణంలోకి వచ్చి కిటికీలోనుంచి వీడియోలు, ఫొటోలు తీస్తుండగా హాస్టల్ నిర్వాహకురాలు పెనుగొండ రేణుకా దేవి చూసి కేకలు వేశారు. ఒక యువకుడిని పట్టుకున్నారు. వారిద్దరూ ఏలూరు విద్యానగర్‌కు చెందిన ఏలూరి అనిల్ ఆశ, మరో యువకుడు చైతన్యగా గుర్తించారు. నిర్వహకురాలు ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి ఆదేశాల మేరకు ఎస్ఐ రామకోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శాసనసభా స్థానాల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు వీరే
ఆచంట - చెరుకువాడ శ్రీరంగనాథరాజు అభ్యర్థి పేరు: చెరుకువాడ శ్రీరంగనాథరాజు వయసు : 69, కులం : క్షత్రియ ఆచంట: శ్రీరంగనాథరాజు రైస్ మిల్లర్‌గా పేర్గాంచారు. 24 ఏళ్లుగా జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్నారు. మొదటి సారి 2004లో అత్తిలి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఉద్దండుడైన దండు శివరామరాజు మీద విజయం సాధించారు. భారతీయ విద్యా భవన్స్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బాధ్యతలు కూడా నిర్వరిస్తున్నారు. పలు సమాజ సేవా కార్యక్రమాలు చేస్తునారు. కొవ్వూరు - తానేటి వనిత అభ్యర్థి పేరు : తానేటి వనిత వయసు : 45 ఏళ్లు, కులం : మాదిగ (ఎస్సీ) వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు గోపాలపురం నుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తల్లి రిటైర్డ్ ఉపాధ్యాయిని. భర్త శ్రీనివాసరావు వైద్యుడు (ఎండీ జనరల్). తాడేపల్లిగూడెంలో ఆస్పత్రి నిర్వíßహిæస్తున్నారు. వనిత 2009లో గోపాలపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012 నవంబర్ 4న వైఎస్సార్ సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నరసాపురం - ముదునూరి ప్రసాదరాజు అభ్యర్ధి పేరు : ముదునూరి ప్రసాదరాజు వయసు : 45 ఏళ్లు, కులం : క్షత్రియ తన 29 ఏళ్ల వయసులో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. 2009 కాంగ్రెస్ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుపొందారు. వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు ఎమ్మెల్యే పదవి వదులుకున్నారు. ఈ కారణంగా 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ఆచంటలో పోటీచేసి అతితక్కువ ఓట్ల తేడాతో ఓటమి చెందారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యునిగా ఉన్నారు. నిడదవోలు - జి.శ్రీనివాసనాయుడు అభ్యర్థి : జి.శ్రీనివాసనాయుడు వయసు : 51 ఏళ్లు, కులం : కాపు శ్రీనివాసనాయుడుది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఈయన తండ్రి జీఎస్ రావు పీసీపీ అధ్యక్షునిగా, కొవ్వూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. శ్రీనివాసనాయుడు ఉన్నత విద్యావంతుడు, పారిశ్రామికవేత్త. బిఈ (మెకానికల్), ఎంబీఏ (అమెరికా) చదివారు. 1994 నుంచి 2004 వరకు కొవ్వూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తండ్రికి సహాయం పడ్డారు. మొదటి సారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశాసి స్వల్ప తేడాతో ఒటమి చెందారు. ఉంగుటూరు - పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) అభ్యర్థి : పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) వయసు : 51ఏళ్లు, కులం : కాపు వాసుబాబు స్వగ్రామం నిడమర్రు మండలం బువ్వనపల్లి. ఆయన గ్రామ సర్పంచ్‌గా చేశారు. తండ్రి ఏసుబాబు 1981లో గణపవరం సమితి అధ్యక్ష ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. వాసుబాబు 2006లో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2004లో ప్రజారాజ్యంలో చేరారు. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వైఎస్సార్ సీసీ ఆవిర్భావంతో పార్టీలో చేరారు. చింతలపూడి - వీఆర్ ఎలీజ అభ్యర్థి : వీఆర్ ఎలీజ వయసు: 58 ఏళ్లు , కులం : మాల ఐఆర్ఎస్ కేడర్‌కు చెందిన ఎలీజా అడిషనల్ కమీషనర్ (జీఎస్టీ)గా పనిచేస్తూ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1990లో సివిల్ సర్వీసెస్‌లో ఐఆర్ఎస్ కు ఎంపికయ్యారు. భారత ప్రభుత్వం తరుఫున పలు దేశాల్లో శిక్షణ కూడా పొందారు. రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించారు. స్వస్థలం చింతలపూడి. భార్య ఝాన్సీలక్ష్మీబాయి. పెద్ద కుమారుడు డాక్టర్ కమల్ దీప్. ద్వితీయ కుమారుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తాడేపల్లిగూడెం - కొట్టు సత్యనారాయణ అభ్యర్థి : కొట్టు సత్యనారాయణ వయసు : 64 ఏళ్లు, కులం : కాపు సత్యనారాయణ 1994లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1994, 1999 కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఆయన పదవీ కాలంలో నియోజకవర్గ రూపురేఖలను మార్చారు. ఆయన హయాంలో నియోజకవర్గంలో రూ. 650 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. 2009లో కాంగ్రెస్ నుంచి, 2014 లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గోపాలపురం - తలారి వెంకట్రావు అభ్యర్థి: తలారి వెంకట్రావు వయసు : 50 ఏళ్లు, కులం : మాల (ఎస్సీ) తలారి వెంకట్రావు గతంలో లిడ్ క్యాప్ డైరెక్టర్‌గా, భారత టెలికాం బోర్డు సభ్యులు, రైల్వే బోర్డు సభ్యుడుగా పదవులు నిర్వహించారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ఆశించారు. 20014లో గోపాలపురం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా చేసిన తరువాత బీఎస్సీ డిగ్రీ కూడా చేశారు. వ్యవసాయం చేస్తారు. పౌల్ట్రీ ఫాంలు ఉన్నాయి. భ్యార్య పరంజ్యోతి, ముగ్గురు కుమార్తెలున్నారు. తణుకు - కారుమూరి వెంకటనాగేశ్వరరావు అభ్యర్థి: కారుమూరి వెంకటనాగేశ్వరరావు వయసు : 55 ఏళ్లు, కులం : యాదవ (బీసీ–డి) కారుమూరి నాగేశ్వరరావు 1990లో కాంగ్రెస్‌లో చేరారు. 2006లో ద్వారకాతిరుమల జెడ్పీటీసీ సభ్యునిగా విజయం సాధించి జెడ్పీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. అనంతరం తణుకు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించడంతో జెడ్పీ చైర్మన్ పదవికి 2009లో రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. 2014లో వైఎస్సార్ సీపీలో చేరిన ఆయన దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఏలూరు - ఆళ్ళ కాళీకృష్ణశ్రీనివాస్ (నాని) అభ్యర్థి : ఆళ్ళ కాళీకృష్ణశ్రీనివాస్ (నాని) వయసు : 48 ఏళ్లు, కులం : కాపు ఆళ్ల నానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనుంగ శిష్యుడిగా పేరుంది. 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏలూరు నుంచి పోటీ చేశారు. 1999లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004, 2009లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికై రికార్డు సృష్టించారు. 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఈయన వ్యాపారం చేస్తారు. భార్య ఫణిరేఖ, కుమార్తె మణిచంద్ర, కుమారుడు ఆశిష్ ఉన్నారు. పాలకొల్లు - డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి (బాబ్జి) అభ్యర్థి: డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి (బాబ్జి) వయసు : 77 ఏళ్లు, కులం : కాపు పాలకొల్లుకు చెందిన డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి మంచి హస్తవాసి గల వైద్యుడిగా పేర్గాంచారు. 1972లో పాలకొల్లులో శ్రీవెంకటేశ్వర నర్సింగ్ హోమ్‌ను ప్రారంభించారు. 2004లో రాజకీయ అరంగేట్రం చేసి అదే ఏడాది టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009టీడీపీ అభ్యర్థిగా, 2014లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. భార్య లక్ష్మీ చిట్టి కామరాజమ్మ కుమార్తె డాక్టర్ సబిత (లేటు), డా.అంజన్. పోలవరం - తెల్లం బాలరాజు అభ్యర్థి : తెల్లం బాలరాజు వయసు : 44 ఏళ్లు, కులం : కోయ (ఎస్టీ) బాలరాజు రాజకీయ ప్రస్థానం 2004లో ప్రారంభమైంది. వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం చేస్తున్న బాలరాజుకు వెఎస్ 2004లో పోలవరం టికెట్ ఇచ్చారు. అఖండ విజ యం సాధించారు. 2009లో మరోసారి గెలిచారు. 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. స్వస్థలం బుట్టాయగూడెం మండలం, దుద్దుకూరు. భార్య రాజ్యలక్ష్మి, ఇద్దరు కుమారులున్నారు. దెందులూరు - కొఠారు అబ్బయ్యచౌదరి అభ్యర్థి : కొఠారు అబ్బయ్యచౌదరి వయసు : 37 ఏళ్లు, కులం : కమ్మ లండన్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్న అబ్బయ్య చౌదరి అది వదులుకుని రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన తండ్రి రామచంద్రరావుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్సార్ సీపీలో చేరారు. తండ్రిని అనుసరిస్తూ అబ్బయ్య చౌదరి రాజకీయాల్లోకి ఇటీవలే ప్రవేశించారు. స్వస్థలం పెదవేగి మండలం రాయన్నపాలెం. భార్య అనురాధ లండన్‌లోని లాయిట్ బ్యాంక్ మేనేజర్‌గా ఉన్నారు. ఆకివీడు - పీవీఎల్ నరసింహరాజు (పీవీఎల్) అభ్యర్థి : పీవీఎల్ నరసింహరాజు (పీవీఎల్) వయసు : 58 ఏళ్లు, కులం : క్షత్రియ ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన పీవీఎల్ నరసింహరాజు సహకార రంగం ద్వారా 20 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. పీవీఎల్ తిమ్మరాజు కుమారుడైన ఆయన డిగ్రీ చదివారు. అనంతరం వ్యవసాయం చేస్తూనే పారిశ్రామిక వేత్తగా కూడా ఎదిగారు. యండగండి కో–ఆపరేటివ్ సొసైటీ చైర్మన్‌గా సుదీర్ఘకాలం పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఎన్సీబీసీ ఎక్సెలెంట్ అవార్డును రెండుసార్లు అందుకున్నారు. భీమవరం - గ్రంధి శ్రీనివాస్ అభ్యర్ధి : గ్రంధి శ్రీనివాస్ వయసు : 56 ఏళ్లు, కులం : కాపు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా గత ఏడాది మే 27న భీమవరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోనే శ్రీనివాస్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. శ్రీనివాస్ భీమవరం అర్బన్‌బ్యాంకు చైర్మన్‌గా పనిచేస్తుండగా 2004లో జరిగిన సాధరణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిచెందారు. -
సమరానికి సై..
ఎన్నికల సమరానికి వైఎస్సార్ సీపీ సై అంది. జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఒకే విడతలో ప్రకటించింది. అనుభవానికి, నమ్మకానికి వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారు. అన్ని సామాజిక వర్గాలకు సమతూకంగా పార్టీ అభ్యర్థులను ఎంపిక చేశారు. అభ్యర్థుల్లో ఎక్కువమంది ఉన్నత చదువులు చదివిన వారు, యువతే కావడం విశేషం. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంపై వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు : వచ్చే నెల 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సై అంది. ఒకే విడతలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పూర్తి జాబితాను అ«ధినేత జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ రెండు విడతల్లో 12 సీట్లు ప్రకటించగా, జనసేన మూడు, బీజేపీ 10 సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించగలిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగేలా జాబితాను ప్రకటించింది. ఏలూరు ఎంపీని వెలమ సామాజికవర్గానికి చెందిన కోటగిరి శ్రీధర్‌కు, నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కనుమూరి రఘురామ కృష్ణంరాజుకు, రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని ముందుగానే ప్రకటించిన విధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మార్గాని భరత్‌ను ఎంపిక చేశారు. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో కూడా దాదాపుగా అనుభవం ఉన్నవారికే పెద్దపీట వేసింది. తొమ్మిది మంది మాజీ ఎమ్మెల్యేలు బరిలోకి దిగనున్నారు. అందులో ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆళ్ల నాని కూడా ఏలూరు నుంచి బరిలోకి దిగుతున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అన్నివర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థులను ప్రకటించారు. పాదయాత్రలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్న్ మాట్లాడుతూ రాజమండ్రి లోక్‌సభ స్థానాన్ని బీసీలకు కేటాయిస్తానని గతంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే రాజమండ్రి స్థానాన్ని బీసీ సామాజికవర్గానికి చెందిన మార్గాని భరత్‌కు కేటాయించారు. జిల్లాలోని అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనలో కాపు, క్షత్రియ సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారు. జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలను కాపు సామాజిక వర్గానికి, మూడు స్థానాలతో పాటు నరసాపురం లోక్‌సభ స్థానాన్ని క్షత్రియ సామాజిక వర్గానికి కేటాయించారు. కమ్మ, బీసీ సామాజిక వర్గాలకు ఒక్కో అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ ఆరంభం నుంచి తన వెంటే ఉన్న ముదునూరి ప్రసాదరాజు, తెల్లం బాలరాజులకు మరోసారి అవకాశం కల్పించారు. ఇప్పటివరకు చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల్లో సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. పశ్చిమలో ఇప్పటికే నాలుగు సీట్లను కమ్మ సామాజిక వర్గానికి కేటాయించిన తెలుగుదేశం పార్టీ నిడదవోలు అసెంబ్లీ స్థానానికి కూడా అదే వర్గానికి కేటాయించనుంది. డెల్టాలో ఎక్కువ ప్రభావం చూపే క్షత్రియ సామాజిక వర్గానికి కేవలం ఒక్క సీటు మాత్రమే కేటాయించారు. వైఎస్సార్ సీపీ బీసీలకు రాజమండ్రి ఎంపీ, తణుకు అసెంబ్లీ సీటు కేటాయించగా, తెలుగుదేశం పార్టీ ఒక్క ఆచంట మాత్రమే బీసీలకు కేటాయించింది. కాపులకు మూడు స్థానాలు మాత్రమే ఇచ్చింది. మొత్తం 15 మందిలో వైఎస్సార్ సీపీ యువతకు ప్రాధాన్యం ఇచ్చింది. 60 ఏళ్లు దాటిన వారు ముగ్గురు మాత్రమే ఉన్నారు. చింతలపూడి అభ్యర్థి ఎలీజా ఐఆర్ఎస్ కాగా, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కోటగిరి శ్రీధర్, దెందులూరు అభ్యర్థి కొటారు అబ్బయ్యచౌదరి, కొవ్వూరు అభ్యర్థి తానేటి వనిత, నిడదవోలు అభ్యర్థి జీఎస్ నాయుడు ఉన్నత చదువులు చదివిన వారే. పాలకొల్లులో డాక్టర్‌కు టిక్కెట్ ఇచ్చింది. అన్ని వర్గాలకు సమన్యాయం చేయడంతో జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. -
మంత్రి ఇలాకాలో జోరుగా పేకాట
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: పేకాట... కోతాట.. ఎక్కడ ఈ ఆటలు ఆడినా క్షణాల్లో పోలీసులు వాలిపోతారు. వీటిని నిర్వహించే వారితో పాటుగా ఈ జూదాలు ఆడే వారిని అరెస్టు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అసలు అరెస్టులే ఉండవు. కొవ్వూరు పట్టణం నడిబొడ్డులో జూదక్రీడ సాగుతున్నా అటువైపు పోలీసులు కన్నెత్తి చూడరు. ఎందుకు అనుకుంటున్నారా. అసలే మంత్రి గారి ఇలాకా... పైగా లక్షల్లో మామూళ్లు అందించి మరీ నిర్వహిస్తున్నారు. అసలే రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఈ జూదశాలకు బారులు తీరుతున్నారు. కొవ్వూరు మున్సిపాలిటీ కేంద్రం, డివిజన్ ప్రధాన పట్టణం. కొవ్వూరు పట్టణం నడిమధ్యలో ఈ జూదక్రీడ సాగుతోంది. వాస్తవానికి లిటరరీ క్లబ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ క్లబ్లో మొదట్లో ఉన్నతస్థాయి ఉద్యోగులతో ఎంతో ఆదర్శంగా నడిచేది. జడ్జీలు, ఆర్డీవో స్థాయి అధికారులు సభ్యులుగాఉండేవారు. రానురాను కొంత మంది రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లింది. క్లబ్‌కి వచ్చిన ఆదాయంతో కల్యాణ మండపం, జిమ్ వంటి వసతులు ఏర్పాటు చేశారు. క్లబ్ సభ్యత్వం కలిగిన వారి కుటుంబాలు కూడా ఇక్కడ వివిధ వేడుకలు నిర్వహించుకునేవారు. కళ్యాణ మండపం సభ్యులకు నామమాత్రపు రుసుముతోను ఇతరులకు నిర్దేశిత ధరలకు ఇస్తున్నారు. క్లబ్ జిమ్‌కు పరిమితమైంది. ఇక క్లబ్‌గా మార్పు గత సంవత్సర కాలంగా లిటరరీక్లబ్ పేకాటక్లబ్‌గా మారిపోయింది. నిర్దేశిత సమయంలో క్లబ్ సభ్యులు కొన్నిరకాలైన పేకాట ఆడుకోవచ్చునన్న కోర్టు తీర్పుని సాకుగా చూపిస్తూ క్లబ్ నడుపుతున్నారు. ఇక్కడకు 400 మీటర్ల దూరంలో ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ కార్యాలయం ఉంది. అంతే కాకుండా 500 మీటర్ల పరిధిలో శాంతిభద్రతల డీఎస్పీ కార్యాలయం, డివిజనల్ మేజిస్ట్రేట్ అయిన ఆర్డీవో కార్యాలయం ఉన్నాయి. అర కిలోమీటరు దూరంలో టౌన్ పోలీస్‌స్టేషన్, రూరల్ పోలీస్‌స్టేషన్, సీఐ కార్యాలయం ఉంది. అయినప్పటికీ పేకాట రాయుళ్లు తమ జూదక్రీడను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే పట్టణ ప్రజలు నిరంతరం తిరుగుతూ ఉండే ప్రదేశం.. పైగా రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నప్పటికీ ఈ జూదాన్ని నియంత్రించే నాథుడే లేకుండా పోయాడు. నిబంధనలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి వరకూ పేకాట నడుస్తోంది. కాసులే కీలకం ఈ క్లబ్లో గతంలో రూ.25 వేలు ఉండే సభ్యత్వాన్ని ఇప్పుడు రూ.లక్షకు పెంచారు. పెద్ద మొత్తంలో పోలీసులకు కాసులు ఇస్తూ వీరి పనికానిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి తోడు రాష్ట్ర మంత్రికి కూడా పెద్ద ఎత్తున ముడుపులు ఇస్తున్నట్లు చెబుతున్నారు. డివిజన్‌స్థాయి పోలీసులకు, స్థానిక నేతలకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. క్లబ్ నిర్వాహకులకు రూ.50 లక్షలకు పైగా నెలవారీ ఆదాయం వస్తున్నట్లు అంచనా. మంత్రి ప్రోద్భలంతోనే ఈ జూద ప్రక్రియను ప్రోత్సహిస్తున్నారని బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు సేవా కార్యక్రమాల పేరుతో కొంత సొమ్ము వెచ్చించి, క్లబ్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు బయటికి ప్రచారం చేసుకుంటున్నారు. 1100 అపరిష్కార వేదిక ఎటువంటి అవినీతి జరిగినా పరిష్కరించేందుకు 1100 ఎంతో దోహద పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు బాహాటంగానే ప్రకటించుకుంటున్నా ఈ లిటరరీ క్లబ్ బాగోతంపై ఫిర్యాదులు చేసినా కనీసం స్పందించిన పాపాన పోవడం లేదు. ఇది కేవలం ప్రకటనలకు మాత్రమే అనేది స్పష్టం అవుతోంది. ఇక 100 ఫోన్ చేసినా స్థానికంగా పోలీసులు స్పందించిన పాపాన పోవడం లేదు. పైగా ఈ క్లబ్లో పేకాట నిర్వహించుకునేందుకు అనుమతులు ఉన్నాయంటూ పోలీస్బాసులే సమాధానం చెబుతూ వెనకేసుకురావడం కొసమెరుపు. వాస్తవానికి అనుమతులు ఉంటే క్లబ్ మెంబర్లే ఉండాలి. అంతే కాకుండా కనీస నిబంధనలు అయిన సీసీ కెమేరాల పర్యవేక్షణలో నిర్వహించుకోవాలి. అటువంటి నిబంధనలే లేకుండా ఎక్కడివారైనా ఇక్కడ మాత్రం యథేశ్ఛగా పేకాట, జూదం ఆడుకునేందుకు కొవ్వూరు లిటరసీ క్లబ్ వేదికగా మారుతోంది. మళ్లీ తెరుచుకున్న జంగారెడ్డిగూడెం క్లబ్ జంగారెడ్డిగూడెం క్లబ్ మళ్లీ తెరుచుకుంది. సాక్షి కథనాలతో కొంతకాలం మూతపడిన క్లబ్‌లు మళ్లీ తెరుచుకుం టున్నాయి. ఉంగుటూరు నియోజకవర్గంలోని పేకాట క్లబ్‌లను మళ్లీ తెరిపించేందుకు ప్రజాప్రతినిధులు జిల్లా పోలీసు అధికారులపై వత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. తణుకు వేల్పూరులో ఐదు ప్రాంతాల్లో పేకాట క్లబ్‌లు నడుస్తుండగా, తాడేపల్లిగూడెం బ్రహ్మయ్యతోటలో పేకాట స్థావరం నడుస్తున్నట్లు సమాచారం. జిల్లాలో పేకాట క్లబ్‌లు, స్థావరాలు యథేశ్చగా సాగుతున్నా స్పెషల్ బ్రాంచి అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేకాట క్లబ్‌లను ఉక్కుపాదంతో అణిచివేయాలని భావిస్తున్న జిల్లా ఎస్పీకి సరైన సమాచారం అందడం లేదని తెలుస్తోంది. రమ్మీగేమ్కి అనుమతి ఉంది లిటరరీ క్లబ్ రిజిస్ట్రార్ క్లబ్. రమ్మీ గేమ్ ఆడుకోవడానికి అనుమతి ఉంది. క్లబ్లో 250 మంది వరకు సభ్యులున్నారు. రెగ్యులర్ రమ్మీ ఆడుతున్నారు. రమ్మీ అనేది స్కిల్ గేమ్. దీన్ని అడ్డుకునే అర్హత పోలీసులకు లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పేకాడుతున్నారనేది ఆవాస్తవం. ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు క్లబ్‌ని తనిఖీ చేశారు. నిర్దేశిత సమయాల్లో క్లబ్ సభ్యులు రమ్మీ ఆడుకునే అవకాశం ఉంది. –ఎస్.వెంకటేశ్వరరావు, డీఎస్పీ, కొవ్వూరు లీజుకి ఇచ్చి మరీ పేకాడిస్తున్నారు లిటరరీక్లబ్లో పేకాట సాగుతున్నా పట్టించుకునే నాథుల్లేరు. క్లబ్ కమిటీ పేకాట నిర్వహణకు లీజుకు ఇచ్చారు. ఆ సొమ్ము లీజుదారుడు క్లబ్‌కి చెల్లించే ఓప్పందం చేసుకున్నారు. సభ్యులు మాత్రమే రమ్మీ ఆడుకోవాలి. అయితే తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పేకాట కోసం తరలివస్తున్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. పేకాటకి వచ్చిన కార్లు పార్కింగ్తో జనం సైతం ఇబ్బందులు పడుతున్నారు.– పరిమి రాధాకృష్ణ, క్లబ్ మాజీ కార్యదర్శి, కొవ్వూరు -
‘సినిమాల్లో మితిమీరుతున్న అశ్లీలం’
సాక్షి, అమరావతి : సినిమాల్లో అశ్లీల సన్నివేశాలు మితిమీరుతున్నాయని ఏపీ మహిళ కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ అన్నారు. పశ్చిమ గోదావరిలోని ఏలూరులో శుక్రవారం ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా కుమారి మాట్లాడుతూ.. టీవీ సీరియల్స్‌లో మహిళలను చాలా దారుణమైన క్యారెక్టర్లుగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. టీవీ సీరియల్స్ నుంచి అశ్లీల సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రతి విషయంలో సామాజిక బాధ్యత వహించాలని, శాంతి భద్రతల కొరకు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలందరూ చట్టాలపై అవగహన పెంచుకోవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని, ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి పార్లమెంట్లో ఎంపీ గల్లా జయదేవ్ అద్భుతంగా మాట్లాడారని కొనియాడారు. గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లే మహిళలకు అవగాహన కల్పించి స్థానికంగా ఉపాధి పొందేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
వేధింపులకు పాల్పడుతోన్న టీడీపీ నేత అరెస్ట్
పశ్చిమ గోదావరి జిల్లా : యువతిని వేధింపులకు గురిచేస్తోన్న టీడీపీ నేత ముసునూరి రామకృష్ణను ఏలూరులో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. స్థానికంగా నివాసముంటున్న ఓ యువతిని ఫోన్లో బ్లాక్మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడు. ఈ వేధింపులకు తాళలేక ఆ యువతి, బంధువుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వేధింపులకు పాల్పడుతున్న టీడీపీ నేత ముసునూరి రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. 354డీ, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎంపీ మాగంటి బాబుకు అస్వస్థత
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఏంపీ, టీడీపీ నేత మాగంటి బాబు అస్వస్థతకు గురయ్యారు. ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఉదయం చింతలపూడిలో టీడీపీ నిర్వహించిన సైకిల్ యాత్రలో ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు. సైకిల్ యాత్ర పూర్తయ్యాక ఆయన ఇంటికి చేరుకున్నారు. కానీ ఎండలో సైకిల్ తొక్కడం వల్ల ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలుస్తోంది. కుటుంబసభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం ఏలూరులోని ఆస్పత్రికి తరలించారు. మాగంటిని పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించినట్లు సమాచారం. -
అప్పుచేసినా ఆవేదనే మిగిలింది
ఏలూరు: హార్ట్ సర్జరీ కోసం రూ.2 లక్షలను అప్పు తీసుకొచ్చి ఇంట్లో పెట్టగా ఓ దొంగ ఆ సొత్తును కాజేసి బాధితులకు వేదనను మిగిల్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని పెన్షన్‌లైన్‌లో నివసించే అబ్దుల్ జావీద్ భార్య గుండెజబ్జుతో బాధపడుతోంది. ఆమెకు సర్జరీ చేయించేందుకు జావీద్ శనివారం తాడేపల్లిగూడెంలోని తన సోదరుడి దగ్గర నుంచి రూ.2 లక్షలు అప్పు తీసుకుని వచ్చి ఇంట్లోని అల్మారాలో ఉంచాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో కిటికీ తెరచి ఉండడంతో ఓ దొంగ లోపలికి చేయి పెట్టి తలుపు గడియ తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. అల్మారాలో ఉంచిన నగదు, 8 కాసుల బంగారు ఆభరణాలను తీసుకుని వెళుతుండగా జావీద్‌కు మేల్కువ రావడంతో వెంబడించాడు. అయినా ఫలితం లేకపోయింది. దొంగ పరారు కావడంతో బాధితుడు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.