పశువుల దొంగలు ‘అనంత’ను టార్గెట్ చేశారు. రోడ్లపై ఉండే ఆవులు, పశువులను అర్ధరాత్రి వేళ బొలెరో వాహనాల్లో ఎక్కించి జిల్లా దాటించేస్తున్నారు. కర్ణాటకలో పశుమాంసానికి అధికంగా డిమాండ్ ఉండటంతో దొంగలు జిల్లాలోని పశువులను అపహరించి అక్కడకు తరలిస్తున్నారు. ఎక్కువగా నగరంపైనే దృష్టి సారించిన దొంగలు.. ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే ఎంతకైనా తెగిస్తున్నారు. గతంలో పోలీసులపైనే రాళ్లు రువ్విన దుండగులు.. తాజాగా సోమవారం అర్ధరాత్రి రుద్రంపేటలో స్థానికులపైనా దాడి చేశారు. వాహనాలు ధ్వంసం చేసి ఉడాయించారు.
అనంతపురం సెంట్రల్: పశువుల దొంగలు అనంతను అడ్డాగా మార్చుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, పట్టణ ప్రాంతాల్లో ఆవుల పోషణతో జీవిస్తున్న వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. అడ్డొస్తే ఎంతకైనా తెగించేందుకు మారణాయుధాలతో సిద్ధంగా ఉండడంతో ఈ ముఠా పేరు చెబితేనే సామాన్యులు భయపడిపోతున్నారు. రెండేళ్ల క్రితం పశువుల దొంగలు పోలీసులపైనే తిరగబడిన పశువుల దొంగలు తాజాగా మళ్లీ జిల్లాను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి రుద్రపేటలో పశువులను అపహరించేందుకు సిద్ధం కాగా.. స్థానికులు చూడడంతో వారిపై రాళ్లురువ్వి వాహనాలు ధ్వంసం చేశారు. ఆదివారం రాత్రే ఉరవకొండలో రైతులకు చెందిన మూడు ఎద్దులు చోరీకి గురికావడం.. సోమవారం అర్దరాత్రి రుద్రంపేట సర్కిల్‌లో స్థానికులపై దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది.
ఇక్కడ అపహరించి.. కర్ణాటకకు తరలించి
పశువుల దొంగలు.. ఈజీ మనీకి అలవాటు పడ్డారు. కర్ణాటకలో పశువుల మాంసానికి బాగా గిరాకీ ఉండటంతో ఇక్కడ అపహరిస్తున్న పశువులను రాష్ట్రం దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. మన జిల్లా కర్ణాటకకు సమీపంలో ఉండటంతో దుండగులు తరుచూ “అనంత’లోకి ప్రవేశిస్తున్నారు. సదరు నేరస్తులు హర్యానాకు చెందిన ముఠాగా గతంలోనే తేలింది. వీరు ఆవులను తరలించేందుకు తెచ్చుకున్న వాహనాల్లో మారణాయుధాలు.. రాళ్లు సిద్ధంగా ఉంచుకుని దాడులకు పాల్పడతారు. రెండేళ్ల క్రితం పాతూరు ప్రాంతంలోని ఆవులను వాహనంలోకి తరలిస్తుండగా.. సమాచారం అందుకున్న అప్పటి నాల్గో పట్టణ ఎస్‌ఐ శేఖర్ దొంగలను వెంబడించారు. పోలీసులు వస్తున్న సమాచారం తెలుసుకున్న దుండగులు పారిపోవడానికి యత్నించారు. అప్పటికే వాహనంలో సిద్ధంగా ఉన్న రాళ్లతో పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ప్రాణరక్షణలో భాగంగా ఫైర్ చేశారు. అయినప్పటికీ తప్పించుకుకోగా, టెక్నాలజీ ఆధారంగా హర్యానాకు చెందిన ముఠాగా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. ఇందులో ముఖ్యులు అరెస్ట్ కావాల్సి ఉంది. ఆ తర్వాత ఈ ముఠా జిల్లాకు రావడం తగ్గిందని పోలీసులు భావించారు. అయితే మళ్లీ ఆ జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మళ్లీ జిల్లాపై గురి
ఆదివారం రాత్రి ఉరవకొండ మండలం చిన్న ముస్టూరు, పెద్ద ముస్టూరులో ఎద్దులు మాయమయ్యాయి. చిన్నముస్టూరు చెందిన పెన్నయ్య,పెద్ద ముస్టూరుకు చెందిన ఆదినారాయణలకు సంబంధించి ఎద్దులు ఆదివారం తెల్లవారుజామున ఎత్తుకెళ్లారు. బాధిత రైతులు పోలీసులను ఆశ్రయించారు.
రాళ్లతో దాడిచేసి..వాహనాలు ధ్వంసం చేసి
సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు నగరంలో రుద్రంపేట సర్కిల్‌కు సమీపంలో కొందరు దుండగులు మాటు వేశారు. ఆవులను తరలించే బొలెరో గూడ్స్ వాహనం అటుగా వస్తున్న స్థానికులపై దూసుకురావడంతో గట్టిగా కేకలు వేశారు. దీంతో ఎక్కడ పట్టుబడుతామోనని స్థానికులపై రాళ్లతో దాడికి యత్నించారు. భయాందోళనకు గురైన బాధితులు ద్విచక్రవాహనాలను వదిలేసి పరారయ్యారు. దీంతో దుండగులు వారి ద్విచక్రవాహనాలను ధ్వంసం చేయడంతో పాటు తాళాలు, ప్లగ్‌లు తీసుకొని ఉడాయించారు. బాధితులు డయల్ 100కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది ఆవుల దొంగల పనేనని అనుమానం వ్యక్తం చేశారు.
నిఘా తగ్గడంతోనే..
సోమవారం రాత్రి అనంత నాల్గో పట్టణ పోలీసుస్టేషన్ సమీపంలోనే ఘటన జరిగింది. ఎప్పుడూ సీసీ కెమెరాలు లేని ప్రాంతాలనే ఎంచుకుంటున్న చోరులు ఈ సారి అలాగే వ్యవహరించడంతో వాహనాన్ని గుర్తించడం కష్టంగా మారుతోందని సమాచారం. ఇక పోలీసు సిబ్బంది అనుకున్నంత సంఖ్యలో లేకపోవడం.. గస్తీ తగ్గడం వల్లే దొంగల పని ఈజీగా మారింది. శివారు ప్రాంతాల్లో చెక్‌పాయింట్లు లేకపోవడంతో దుండగులు సులువుగా నగరంలోకి ప్రవేశిస్తూ పని చక్కబెడుతున్నారు. ఇక ఆదివారం ఉరవకొండ మండలంలో ఎద్దులను ఎత్తుకెళ్లిన ఘటనతో పోలీసులు అప్రమత్తం కాకపోవడంతో దొంగలు జిల్లాలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. గతంలో హర్యానా ముఠా బళ్లారి వైపే పారిపోయారు. దీన్ని బట్టి చూస్తే ఉరవకొండ, కళ్యాణదుర్గం రహదారుల గుండా నేరస్తులు జిల్లా సరిహద్దు దాటేస్తున్నారు. జిల్లాలో నిఘా పెద్దగా లేకపోవడం దొంగలకు కలిసొస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment