cattle thief
-
దొంగల అడ్డా.. అనంత
పశువుల దొంగలు ‘అనంత’ను టార్గెట్ చేశారు. రోడ్లపై ఉండే ఆవులు, పశువులను అర్ధరాత్రి వేళ బొలెరో వాహనాల్లో ఎక్కించి జిల్లా దాటించేస్తున్నారు. కర్ణాటకలో పశుమాంసానికి అధికంగా డిమాండ్ ఉండటంతో దొంగలు జిల్లాలోని పశువులను అపహరించి అక్కడకు తరలిస్తున్నారు. ఎక్కువగా నగరంపైనే దృష్టి సారించిన దొంగలు.. ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే ఎంతకైనా తెగిస్తున్నారు. గతంలో పోలీసులపైనే రాళ్లు రువ్విన దుండగులు.. తాజాగా సోమవారం అర్ధరాత్రి రుద్రంపేటలో స్థానికులపైనా దాడి చేశారు. వాహనాలు ధ్వంసం చేసి ఉడాయించారు. అనంతపురం సెంట్రల్: పశువుల దొంగలు అనంతను అడ్డాగా మార్చుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, పట్టణ ప్రాంతాల్లో ఆవుల పోషణతో జీవిస్తున్న వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. అడ్డొస్తే ఎంతకైనా తెగించేందుకు మారణాయుధాలతో సిద్ధంగా ఉండడంతో ఈ ముఠా పేరు చెబితేనే సామాన్యులు భయపడిపోతున్నారు. రెండేళ్ల క్రితం పశువుల దొంగలు పోలీసులపైనే తిరగబడిన పశువుల దొంగలు తాజాగా మళ్లీ జిల్లాను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి రుద్రపేటలో పశువులను అపహరించేందుకు సిద్ధం కాగా.. స్థానికులు చూడడంతో వారిపై రాళ్లురువ్వి వాహనాలు ధ్వంసం చేశారు. ఆదివారం రాత్రే ఉరవకొండలో రైతులకు చెందిన మూడు ఎద్దులు చోరీకి గురికావడం.. సోమవారం అర్దరాత్రి రుద్రంపేట సర్కిల్లో స్థానికులపై దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఇక్కడ అపహరించి.. కర్ణాటకకు తరలించి పశువుల దొంగలు.. ఈజీ మనీకి అలవాటు పడ్డారు. కర్ణాటకలో పశువుల మాంసానికి బాగా గిరాకీ ఉండటంతో ఇక్కడ అపహరిస్తున్న పశువులను రాష్ట్రం దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. మన జిల్లా కర్ణాటకకు సమీపంలో ఉండటంతో దుండగులు తరుచూ “అనంత’లోకి ప్రవేశిస్తున్నారు. సదరు నేరస్తులు హర్యానాకు చెందిన ముఠాగా గతంలోనే తేలింది. వీరు ఆవులను తరలించేందుకు తెచ్చుకున్న వాహనాల్లో మారణాయుధాలు.. రాళ్లు సిద్ధంగా ఉంచుకుని దాడులకు పాల్పడతారు. రెండేళ్ల క్రితం పాతూరు ప్రాంతంలోని ఆవులను వాహనంలోకి తరలిస్తుండగా.. సమాచారం అందుకున్న అప్పటి నాల్గో పట్టణ ఎస్ఐ శేఖర్ దొంగలను వెంబడించారు. పోలీసులు వస్తున్న సమాచారం తెలుసుకున్న దుండగులు పారిపోవడానికి యత్నించారు. అప్పటికే వాహనంలో సిద్ధంగా ఉన్న రాళ్లతో పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ప్రాణరక్షణలో భాగంగా ఫైర్ చేశారు. అయినప్పటికీ తప్పించుకుకోగా, టెక్నాలజీ ఆధారంగా హర్యానాకు చెందిన ముఠాగా గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. ఇందులో ముఖ్యులు అరెస్ట్ కావాల్సి ఉంది. ఆ తర్వాత ఈ ముఠా జిల్లాకు రావడం తగ్గిందని పోలీసులు భావించారు. అయితే మళ్లీ ఆ జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మళ్లీ జిల్లాపై గురి ఆదివారం రాత్రి ఉరవకొండ మండలం చిన్న ముస్టూరు, పెద్ద ముస్టూరులో ఎద్దులు మాయమయ్యాయి. చిన్నముస్టూరు చెందిన పెన్నయ్య,పెద్ద ముస్టూరుకు చెందిన ఆదినారాయణలకు సంబంధించి ఎద్దులు ఆదివారం తెల్లవారుజామున ఎత్తుకెళ్లారు. బాధిత రైతులు పోలీసులను ఆశ్రయించారు. రాళ్లతో దాడిచేసి..వాహనాలు ధ్వంసం చేసి సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు నగరంలో రుద్రంపేట సర్కిల్‌కు సమీపంలో కొందరు దుండగులు మాటు వేశారు. ఆవులను తరలించే బొలెరో గూడ్స్ వాహనం అటుగా వస్తున్న స్థానికులపై దూసుకురావడంతో గట్టిగా కేకలు వేశారు. దీంతో ఎక్కడ పట్టుబడుతామోనని స్థానికులపై రాళ్లతో దాడికి యత్నించారు. భయాందోళనకు గురైన బాధితులు ద్విచక్రవాహనాలను వదిలేసి పరారయ్యారు. దీంతో దుండగులు వారి ద్విచక్రవాహనాలను ధ్వంసం చేయడంతో పాటు తాళాలు, ప్లగ్‌లు తీసుకొని ఉడాయించారు. బాధితులు డయల్ 100కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది ఆవుల దొంగల పనేనని అనుమానం వ్యక్తం చేశారు. నిఘా తగ్గడంతోనే.. సోమవారం రాత్రి అనంత నాల్గో పట్టణ పోలీసుస్టేషన్ సమీపంలోనే ఘటన జరిగింది. ఎప్పుడూ సీసీ కెమెరాలు లేని ప్రాంతాలనే ఎంచుకుంటున్న చోరులు ఈ సారి అలాగే వ్యవహరించడంతో వాహనాన్ని గుర్తించడం కష్టంగా మారుతోందని సమాచారం. ఇక పోలీసు సిబ్బంది అనుకున్నంత సంఖ్యలో లేకపోవడం.. గస్తీ తగ్గడం వల్లే దొంగల పని ఈజీగా మారింది. శివారు ప్రాంతాల్లో చెక్పాయింట్లు లేకపోవడంతో దుండగులు సులువుగా నగరంలోకి ప్రవేశిస్తూ పని చక్కబెడుతున్నారు. ఇక ఆదివారం ఉరవకొండ మండలంలో ఎద్దులను ఎత్తుకెళ్లిన ఘటనతో పోలీసులు అప్రమత్తం కాకపోవడంతో దొంగలు జిల్లాలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. గతంలో హర్యానా ముఠా బళ్లారి వైపే పారిపోయారు. దీన్ని బట్టి చూస్తే ఉరవకొండ, కళ్యాణదుర్గం రహదారుల గుండా నేరస్తులు జిల్లా సరిహద్దు దాటేస్తున్నారు. జిల్లాలో నిఘా పెద్దగా లేకపోవడం దొంగలకు కలిసొస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పశువుల దొంగకు దేహశుద్ధి
అశ్వారావుపేట: పశువులను అపహరించి విక్రయిస్తున్న దొంగకు దేహశుద్ధి జరిగింది. మండలంలోని కొత్త గంగారం గ్రామం పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామం. అందరూ రైతులే. మంగళవారం తెల్లవారుజామున ఈ ఊరికి ఆగంతకుడు వచ్చాడు. అతడిని దొంగగా భావించిన గ్రామస్తులు వెంబడించారు. కత్తిని చేబూనిన అతడు తిరగబడ్డాడు. ఎట్టకేలకు అతడిని గ్రామస్తులు పట్టుకుని కట్టేశారు. మండలంలోని జమ్మిగూడెం గ్రామానికి చెందిన అతడి పేరు పెన్నాడ శ్రీను. అదే గ్రామంలో ఇదే పేరుతో ఓ పెద్ద మనిషి కూడా ఉన్నారు. ఆయనేమో రైతు. పట్టుబడ్డ ఇతడేమో పశువుల దొంగ. ఇతడు గతంలో వందకు పైగా పశువులను దొంగిలించి సమీప సంతల్లో విక్రయించినట్టుగా పోలీసులు నిర్థారించారు. ఇతడిని పోలీసులు గతంలో ఓసారి పట్టుకుని జైలుకు పంపారు. విడుదలై వచ్చిన తరువాత కూడా దొంగ బుద్ధి మానలేదు. కొత్తగంగారం గ్రామానికి సోమావారం సాయంత్రమే వచ్చాడు. మంచి పశువులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రాత్రి వరకు చూసుకున్నాడు. వెళ్లిపోయాడు. మినీ ట్రక్, టూవీలర్, తాళ్లు తీసుకుని తన మనుషులతో కలిసి మంగళవారం తెల్లవారుజామున తిరిగొచ్చాడు. పశువులను విప్పి మినీ ట్రక్కులో ఎక్కిస్తున్నాడు. ఆ పశువులు గట్టిగా అరవడంతో గ్రామస్తులు మేల్కొన్నారు. దొంగలొచ్చారని గ్రహించి గట్టిగా కేకలు వేస్తూ గ్రామం మొత్తాన్ని అప్రమత్తం చేశారు. ఇంతలో పెన్నాడ శ్రీనుతోపాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు టూవీలర్‌తో పరారయ్యారు. పెన్నాడ శ్రీను ఒక్కడే మిగిలాడు. తన వద్దనున్న కత్తితో ఆ గ్రామస్తులపై దాడికి యత్నిస్తూ తప్పించుకునేందుకు యత్నించాడు. అతడిని గ్రామస్తులంతా కలిసి పట్టుకుని దేహశుద్ధి చేసి, అతడు తీసుకొచ్చిన ట్రక్కుకు తాళ్లతో కట్టేశారు. కొద్దిసేపటి తరువాత అక్కడకు అశ్వారావుపేటకు చెందిన ఓ మహిళ వచ్చింది. ‘‘ఇది నా వ్యాన్. ఇక్కడికెవరు తెచ్చారు..?’’అంటూ కేకలు వేసింది. ఆమెను కూడా అదే వ్యాన్‌కు గ్రామస్తులు కట్టేశారు. పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ వేల్పుల వెంకటేశ్వరరావు వచ్చారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. పరారైన వారిని రామకృష్ణ, రాంబాబు గా అనుమానిస్తున్నారు.వారికోసం గాలిస్తున్నారు. -
దాష్టీకంపై పోలీసుల క్షమాపణలు
చచ్చిన జంతువులను కూడా ఇలా ఈడ్చుకెళ్లటం బహుశా ఎవరూ చూసి ఉండకపోవచ్చు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తితో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. బహిరంగంగా దొరికిపోవటంతో ఏం చేయాలో పాలుపోని యూపీ పోలీస్ శాఖ ఎట్టకేలకు క్షమాపణలు తెలియజేసింది. లక్నో: ఉత్తర ప్రదేశ్ హపూర్‌లో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. బుధవారం పిలఖువా సమీపంలో ఓ పశువుల కొట్టం దగ్గర బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తూ కిందపడ్డారు. అయితే వారు పశువుల దొంగతనానికే వచ్చారని అనుమానించిన స్థానికులు ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మృతుడ్ని ఖాసిం(45)గా, గాయపడిన మరో వ్యక్తిని ఖాసిం బంధువు సమీయుద్దీన్(65)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల తీరు... సమాచారం అందుకున్న ముగ్గురు అధికారులు ఘటన స్థలానికి వెళ్లి స్థానికులను చెదరగొట్టారు. ఆపై బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో వ్యవహరించిన తీరు తీవ్రవిమర్శలకు దారితీసింది. స్థానికులు ఖాసింపై దాడి చేస్తుంటే.. నీటి కోసం ప్రాధేయపడటం, అయినా వారు అతన్ని చావబాదటం, ఇంతలో పోలీసుల రంగ ప్రవేశం.. బాధితుడ్ని పోలీసుల సమక్షంలోనే చచ్చిన గొడ్డులా ఈడ్చుకెళ్లటం... ఆ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. పోలీసుల తీరును ఆక్షేపిస్తూ ముఖ్యమంత్రి, డీజీపీలకు చర్యలు తీసుకోవాల్సిందిగా వినతుల మీద వినతులు వెలువెత్తాయి. దీంతో యూపీ పోలీస్ శాఖ స్పందించింది. ‘ఆ సమయంలో ఆంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో ఏం చేయాలో తెలీక బాధితులను పోలీస్ వాహనంలోనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనాస్థలం నుంచి వాహనం దాకా అలా తీసుకెళ్లామని అధికారులు వివరణ ఇచ్చారు. కానీ, ఇది చాలా సున్నితమైన అంశం. అధికారులు అలా వ్యవహరించాల్సింది కాదు. ముమ్మాటికీ తప్పే. అందుకు పోలీస్ శాఖ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తోంది. ఆ అధికారులను బదిలీ చేసి, విచారణకు ఆదేశించాం’ అని డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో 25 మందిపై కేసు నమోదు కాగా, ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
కిందపడ్డ వ్యక్తిని దొంగ అనుకొని..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడిన వ్యక్తిని చేరదీయాల్సిందిబోయి.. పశువుల దొంగని కొట్టి చంపారు. ఈ ఘటన యూపీలోని హాపూర్ జిల్లాలో పిలఖువా ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖాసీం(45), అతని స్నేహితుడు సమీయుద్దీన్ ఇద్దరు పశువుల ఉండే చోట ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడి గాయాలపాలయ్యారు. పశువుల పాకలోని గేదె, దూడను దొంగిలించేందుకు వచ్చారనే అనుమానంతో వారిద్దరిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. ఈ ఘటనలో 45 ఏళ్ల ఖాసీం తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతిచెందగా, అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జనమంతా చుట్టుముట్టగా బాధితుడు ఖాసీం తీవ్రగాయాలతో దాహం వేస్తుందని నీళ్లు అడుగుతున్నట్టు కనిపిస్తోంది. కాగా ఆ వీడియో తమకు అందలేదని పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 25 మంది స్థానికులపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. -
రసీదు చూపించలేదని కొట్టి చంపేశారు...
గౌహతి: పశువుల దొంగగా అనుమానించి ఒక వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన అసోంలోని గౌహతిలో చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసు ఉన్నతాధికారులు అందించిన వివరాల ప్రకారం... ఒక ప్రయివేటు వాహనంలో ఆరు పశువులను తోలుకొని వెళుతున్న అలీ అనే వ్యక్తిని గ్రామస్తులు అడ్డుకున్నారు. పశువుల ఎక్కడివని ప్రశ్నించారు. పశువులను కొన్న రశీదులు చూపించమని అడిగారు. ఈ విషయంలో అలీ సరిగా సమాధానం చెప్పలేకపోవడంతో పశువులను ఎత్తుకుపోతున్నవాడిగా అనుమానించి అతడిని తీవ్రంగా కొట్టారు. అతని వాహనాన్ని తగులబెట్టారు. దెబ్బలు తట్టుకోలేక అలీ అక్కడిక్కడే ప్రాణాలొదిలాడు. అనంతరం నేషనల్ హైవేను దిగ్బంధించిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దొంగతో సంబంధం ఉన్న మిగతావారిని కూడా అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులకు నచ్చచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. నిందితుడిని జుంటి అలీగా గుర్తించిన పోలీసులు అనుమానితులపై కేసు నమోదు చేశారు.