పెన్నాడ శ్రీనును, మహిళను కట్టేసిన దృశ్యం
అశ్వారావుపేట: పశువులను అపహరించి విక్రయిస్తున్న దొంగకు దేహశుద్ధి జరిగింది. మండలంలోని కొత్త గంగారం గ్రామం పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామం. అందరూ రైతులే. మంగళవారం తెల్లవారుజామున ఈ ఊరికి ఆగంతకుడు వచ్చాడు. అతడిని దొంగగా భావించిన గ్రామస్తులు వెంబడించారు. కత్తిని చేబూనిన అతడు తిరగబడ్డాడు. ఎట్టకేలకు అతడిని గ్రామస్తులు పట్టుకుని కట్టేశారు.
మండలంలోని జమ్మిగూడెం గ్రామానికి చెందిన అతడి పేరు పెన్నాడ శ్రీను. అదే గ్రామంలో ఇదే పేరుతో ఓ పెద్ద మనిషి కూడా ఉన్నారు. ఆయనేమో రైతు. పట్టుబడ్డ ఇతడేమో పశువుల దొంగ. ఇతడు గతంలో వందకు పైగా పశువులను దొంగిలించి సమీప సంతల్లో విక్రయించినట్టుగా పోలీసులు నిర్థారించారు. ఇతడిని పోలీసులు గతంలో ఓసారి పట్టుకుని జైలుకు పంపారు. విడుదలై వచ్చిన తరువాత కూడా దొంగ బుద్ధి మానలేదు.
కొత్తగంగారం గ్రామానికి సోమావారం సాయంత్రమే వచ్చాడు. మంచి పశువులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రాత్రి వరకు చూసుకున్నాడు. వెళ్లిపోయాడు. మినీ ట్రక్, టూవీలర్, తాళ్లు తీసుకుని తన మనుషులతో కలిసి మంగళవారం తెల్లవారుజామున తిరిగొచ్చాడు. పశువులను విప్పి మినీ ట్రక్కులో ఎక్కిస్తున్నాడు. ఆ పశువులు గట్టిగా అరవడంతో గ్రామస్తులు మేల్కొన్నారు. దొంగలొచ్చారని గ్రహించి గట్టిగా కేకలు వేస్తూ గ్రామం మొత్తాన్ని అప్రమత్తం చేశారు. ఇంతలో పెన్నాడ శ్రీనుతోపాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు టూవీలర్‌తో పరారయ్యారు.
పెన్నాడ శ్రీను ఒక్కడే మిగిలాడు. తన వద్దనున్న కత్తితో ఆ గ్రామస్తులపై దాడికి యత్నిస్తూ తప్పించుకునేందుకు యత్నించాడు. అతడిని గ్రామస్తులంతా కలిసి పట్టుకుని దేహశుద్ధి చేసి, అతడు తీసుకొచ్చిన ట్రక్కుకు తాళ్లతో కట్టేశారు. కొద్దిసేపటి తరువాత అక్కడకు అశ్వారావుపేటకు చెందిన ఓ మహిళ వచ్చింది. ‘‘ఇది నా వ్యాన్. ఇక్కడికెవరు తెచ్చారు..?’’అంటూ కేకలు వేసింది. ఆమెను కూడా అదే వ్యాన్‌కు గ్రామస్తులు కట్టేశారు. పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ వేల్పుల వెంకటేశ్వరరావు వచ్చారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. పరారైన వారిని రామకృష్ణ, రాంబాబు గా అనుమానిస్తున్నారు.వారికోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment