మీడియాలో చక్కర్లు కొట్టిన ఫోటో ఇదే
చచ్చిన జంతువులను కూడా ఇలా ఈడ్చుకెళ్లటం బహుశా ఎవరూ చూసి ఉండకపోవచ్చు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తితో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. బహిరంగంగా దొరికిపోవటంతో ఏం చేయాలో పాలుపోని యూపీ పోలీస్ శాఖ ఎట్టకేలకు క్షమాపణలు తెలియజేసింది.
లక్నో: ఉత్తర ప్రదేశ్ హపూర్‌లో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. బుధవారం పిలఖువా సమీపంలో ఓ పశువుల కొట్టం దగ్గర బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తూ కిందపడ్డారు. అయితే వారు పశువుల దొంగతనానికే వచ్చారని అనుమానించిన స్థానికులు ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఓ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మృతుడ్ని ఖాసిం(45)గా, గాయపడిన మరో వ్యక్తిని ఖాసిం బంధువు సమీయుద్దీన్(65)గా పోలీసులు గుర్తించారు.
పోలీసుల తీరు... సమాచారం అందుకున్న ముగ్గురు అధికారులు ఘటన స్థలానికి వెళ్లి స్థానికులను చెదరగొట్టారు. ఆపై బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో వ్యవహరించిన తీరు తీవ్రవిమర్శలకు దారితీసింది. స్థానికులు ఖాసింపై దాడి చేస్తుంటే.. నీటి కోసం ప్రాధేయపడటం, అయినా వారు అతన్ని చావబాదటం, ఇంతలో పోలీసుల రంగ ప్రవేశం.. బాధితుడ్ని పోలీసుల సమక్షంలోనే చచ్చిన గొడ్డులా ఈడ్చుకెళ్లటం... ఆ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. పోలీసుల తీరును ఆక్షేపిస్తూ ముఖ్యమంత్రి, డీజీపీలకు చర్యలు తీసుకోవాల్సిందిగా వినతుల మీద వినతులు వెలువెత్తాయి. దీంతో యూపీ పోలీస్ శాఖ స్పందించింది.
‘ఆ సమయంలో ఆంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో ఏం చేయాలో తెలీక బాధితులను పోలీస్ వాహనంలోనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనాస్థలం నుంచి వాహనం దాకా అలా తీసుకెళ్లామని అధికారులు వివరణ ఇచ్చారు. కానీ, ఇది చాలా సున్నితమైన అంశం. అధికారులు అలా వ్యవహరించాల్సింది కాదు. ముమ్మాటికీ తప్పే. అందుకు పోలీస్ శాఖ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తోంది. ఆ అధికారులను బదిలీ చేసి, విచారణకు ఆదేశించాం’ అని డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో 25 మందిపై కేసు నమోదు కాగా, ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment