రసీదు చూపించలేదని కొట్టి చంపేశారు...
గౌహతి: పశువుల దొంగగా అనుమానించి ఒక వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన అసోంలోని గౌహతిలో చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసు ఉన్నతాధికారులు అందించిన వివరాల ప్రకారం... ఒక ప్రయివేటు వాహనంలో ఆరు పశువులను తోలుకొని వెళుతున్న అలీ అనే వ్యక్తిని గ్రామస్తులు అడ్డుకున్నారు. పశువుల ఎక్కడివని ప్రశ్నించారు. పశువులను కొన్న రశీదులు చూపించమని అడిగారు.
ఈ విషయంలో అలీ సరిగా సమాధానం చెప్పలేకపోవడంతో పశువులను ఎత్తుకుపోతున్నవాడిగా అనుమానించి అతడిని తీవ్రంగా కొట్టారు. అతని వాహనాన్ని తగులబెట్టారు. దెబ్బలు తట్టుకోలేక అలీ అక్కడిక్కడే ప్రాణాలొదిలాడు. అనంతరం నేషనల్ హైవేను దిగ్బంధించిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దొంగతో సంబంధం ఉన్న మిగతావారిని కూడా అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులకు నచ్చచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. నిందితుడిని జుంటి అలీగా గుర్తించిన పోలీసులు అనుమానితులపై కేసు నమోదు చేశారు.