
సాక్షి, చెన్నై: డీఎంకే నేత, మాజీ మంత్రి కేఎన్ నెహ్రూ సోదరుడు, పారిశ్రామిక వేత్త రామజయం హత్య కేసు విచారణకు సీబీఐ రంగంలోకి దిగింది. ఐదేళ్ల అనంతరం ఈ కేసు సీబీఐకు చేరడంతో విచారణలో పురోగతి లభిస్తుందన్న ఆశాభావం ఆ కుటుంబంలో నెలకొంది. డీఎంకే మాజీ మంత్రిగా, తిరుచ్చిలో కీలక నేతగా ఉన్న కేఎన్ నెహ్రూ సోదరుడు రామజయం 2012 మార్చి 29న హత్యకు గురయ్యారు. వాకింగ్‌కు వెళ్లిన ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చడం అప్పట్లో సంచలనం సృష్టించింది. రాజకీయ కారణాలతో ఈ హత్య జరిగినట్టుగా ఆరోపణలు వచ్చినా, ఇంత వరకు ఆధారాలు ఏ మాత్రం చిక్కలేదు. స్థానిక పోలీసులు చేతులెత్తేయడంతో విచారణ సీబసీఐడీకి అప్పగించారు. ఐదేళ్లుగా సీబీసీఐడీ కాలం నెట్టుకొచ్చినా, ఫలితం శూన్యం. ఇంతవరకు ఈ కేసులో ఏ ఒక్కర్నీ అరెస్టు చేయలేదు.
ఇంకా చెప్పాలంటే, కేసులో పురోగతి శూన్యం. పలు కోణాల్లో తాము విచారిస్తున్నామని సీబీసీఐడీ పేర్కొంటూ వచ్చారు. కేఎన్ నెహ్రూ రాజకీయ వ్యవహారాల్లో రామజయం కీలకం కావడంతో పథకం ప్రకారం ఈహత్య జరిగి ఉండొచ్చన్న సంకేతాలు బయలుదేరాయి. అధికార పక్షం ప్రమేయంతో ఈ పథకం సాగి ఉండొచ్చన్న అనుమానాలు సాగాయి. 2014లో రామజయం సతీమణి లత మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంను ఆశ్రయించక తప్పలేదు. కేసులో పురోగతి శూన్యం అని, విచారణ సీబీఐకు అప్పగించాలని విన్నవించారు. మూడేళ్లుగా సీబీసీఐడీ వర్గాలు వాయిదాల పర్వంతో విచారణను సాగించారు. చివరకు సీబీసీఐడీ చర్యలు కోర్టుకే ఆగ్రహాన్ని తెప్పించాయి. సీబీసీఐడీ అసమర్థతపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు విచారణను సీబీఐకు అప్పగిస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది. దీంతో సీబీఐ వర్గాలు కేసును తమ గుప్పెట్లోకి తీసుకున్నాయి.
నివేదిక అప్పగింత : కోర్టు ఆదేశాలతో సీబీసీఐడీ వర్గాలు కేసును సీబీఐకు అప్పగించక తప్పలేదు. ఐదేళ్లుగా తాము సాగించిన విచారణలో వెలుగు చూసిన అంశాలు, సేకరించిన సమాచారాలు, పలువురి వద్ద వాంగ్మూలాలు వాటితో కూడిన పది వేల పేజీలతో కూడిన నివేదికను, సీడీలు తదితర వాటిని రెండు రోజుల క్రితం చెన్నైలోని సీబీఐ కార్యాలయంలో అప్పగించారు. దీంతో కేసు విచారణ నిమిత్తం సీబీఐ ఇన్‌స్పెక్టర్ రామచంద్రన్ నియమితులయ్యారు. ఆ కేసు వివరాలను తన గుప్పెట్లోకి తీసుకున్న రామచంద్రన్ పరిశీలించే పనిలో పడ్డారు. గురువారం రాత్రి తిరుచ్చి చేరుకున్న ఆయన శుక్రవారం నుంచి విచారణ మొదలెట్టారు. సీబీసీఐడీ అప్పగించిన వివరాల పరిశీలన ఓ వైపు సాగిస్తూనే, మరో వైపు రామజయం హత్యకు గురైన ప్రదేశం, పరిసరాల్లో ఆయన అక్కడికి వెళ్లి ఆరా తీశారు. అక్కడున్న వారితో ఆయన మాట్లాడారు. అయితే, ఐదేళ్ల క్రితం అక్కడ నిర్మానుష్య ప్రదేశంగా ఉన్న ప్రాంతం, ప్రస్తుతం నిర్మాణాలతో నిండి ఉండడం గమనార్హం. ఇక, విచారణను పలు కోణాల్లో వేగవంతం చేసి, త్వరితగతిన ముగిస్తామన్న ధీమాను రామచంద్రన్ బృందం వ్యక్తం చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment