
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన గుట్కా స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు బుధవారం దాదాపు 40 ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ దాడుల్లో 150 మంది అధికారులు పాల్గొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సి విజయభాస్కర్‌తోపాటు, డీజీపీ రాజేంద్రన్, మాజీ డీజీపీ జార్జ్ ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా పలువురు పోలీసు అధికారులు, వ్యాపార వేత్తలు నివాసాల్లో కూడా తనిఖీలు చేపట్టారు.
కాగా 2017లో తమిళనాడు ఆదాయపన్ను శాఖ అధికారులు నిషేధిత గుట్కా తయారీ కేంద్రాలపై వరుస దాడులు నిర్వహించడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. గుట్కా వ్యాపారుల నుంచి మంత్రి విజయభాస్కర్‌తో పాటు డీజీపీ ర్యాంకు అధికారులకు, కిందిస్థాయిలో పనిచేస్తున్న పలుశాఖలకు చెందిన అధికారులకు దాదాపు 40 కోట్ల వరకు ముడుపులు అందినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు 2018 మే 30వ తేదీన తమిళనాడు ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ అధికారులు, రాష్ట్ర ఫుడ్ సెప్టీ అధికారులతో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. 2013 నుంచి తమిళనాడులో క్యాన్సర్ కారకాలైన గుట్కా, పొగాకు ఉత్పత్తులపై నిషేధం కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment