పొల్లాచ్చి నిందితులు
సాక్షి, చెన్నై: పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసును సీబీఐ తన గుప్పెట్లోకి తీసుకుంది. సీబీఐ ఐజీ విపుల్‌కుమార్, ఏఎస్పీ కలైమణి నేతృత్వంలోని బృందం విచారణకు సిద్ధమైంది. తమ వద్ద ఉన్న వివరాలు, ఆధారాలను ఆ బృందానికి ఎస్పీ నిషా పార్థిబన్ నేతృత్వంలోని సీబీసీఐడీ బృందం అప్పగించింది. ఈ కేసులో ఓ అనుమానితుడిగా ఉన్న బార్ నాగరాజ్ ఓ యువతికి బెదిరింపులు ఇస్తున్న ఆడియో ఆదివారం చర్చకు దారి తీసింది.
పొల్లాచ్చిలో స్నేహం ముసుగులో యువతులు, మహిళలను లొంగదీసుకుని లైంగికవేధింపులకు పాల్పడడం, ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించి బెదిరింపులు ఇస్తూ వచ్చిన ముఠా గుట్టు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈకేసులో ఐదుగురు అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలో అధికార పక్షానికి చెందిన నాయకుల పిల్లల హస్తం కూడా ఉన్నట్టుగా వచ్చిన ప్రచారం, ఆరోపణలతో కేసును సీబీఐకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత సీబీఐ నుంచి స్పందన లేనప్పటికి, శనివారం రాత్రి ఎట్టకేలకుఆ విభాగం వర్గాలు స్పందించారు. కేసును తాము విచారించబోతున్నట్టుగా ప్రకటించారు. తమకు లభించిన ప్రాథమిక సమాచారం మేరకు ఐదు రకాల సెక్షన్లతో రెండు కేసుల్ని నమోదు చేశారు. ఇక, కేసును పూర్తిగా తమ పరిధిలోకి తీసుకుని విచారించేందుకు ప్రత్యేక అధికారిగా సీబీఐ ఐజీ విపుల్ కుమార్, ఏఎస్పీ కలైమణిలను రంగంలోకి దించారు. వీరితో పాటు మరో పదిమంది కేసు విచారణకు సిద్ధం అయ్యారు.
అప్పగింత ..
సీబీసీఐడీ ఎస్పీ నిషా పార్థిబన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ కేసును ఓ సవాల్‌గా తీసుకుని విచారిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ బృందంపై నమ్మకాలు సన్నగిల్లడంతో వ్యవహారం కోర్టు వరకు చేరింది. నిందితుల్ని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, బాధితులకు రక్షణ లేని దృష్ట్యా, మహిళా ఉన్నతా«ధికారులతో ప్రత్యేక సిట్‌కు పట్టుబట్టే వాళ్లు పెరిగారు. ఈ పరిస్థితుల్లో కేసు సీబీఐ గుప్పెట్లోకి చేరడంతో విచారణ ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్న ఎదురుచూపులు పెరిగాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను, ఆధారాలు, రికార్డులు తమ గుప్పెట్లోకి తీసుకునేందుకుగాను సీబీఐ ప్రత్యేక బృందం ఆదివారం సాయంత్రం కోయంబత్తూరుకు చేరుకున్నట్టు సమాచారం. సీబీసీఐడీ ఎస్పీ నిషా పార్థిబన్ నేతృత్వంలోని బృందం సీబీఐ వర్గాలతో సంప్రదింపులు సాగించినట్టు, తమ వద్ద ఉన్న అన్ని వివరాలను ఆ బృందానికి అప్పగించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమ గుప్పెట్లోకి అన్ని వివరాలు రావడంతో, ఎక్కడి నుంచి విచారణ మొదలెట్టాలో అన్న దిశగా సీబీఐ కసరత్తుల్లో ఉన్నట్టు తెలిసింది. సీబీసీఐడీ విచారణపై వస్తున్న అనుమానాలకు బలం చేకూరే రీతిలో ఓ ఆడియో తాజాగా వైరల్ అయింది. ఈ కేసులో అరెస్టుయిన నిందితుల మిత్రుడిగా ఉన్న బార్ నాగరాజ్ ఓ యువతికి బెదిరింపులు ఇవ్వడం అందులో ఉంది. కేసు వెనక్కి తీసుకోవాలని, వీడియో, ఆడియోలు డెలిట్ చేయాలని లేని పక్షంలో కుటుంబం అంతా తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ యువతికి బార్‌నాగరాజ్ బెదిరింపులు ఇవ్వడం గమనార్హం.
టీ.నగర్: పొల్లాచ్చి వీడియో డెలిట్ చెయ్ అంటూ బార్ నాగరాజ్ ఓ మహిళను బెదిరిస్తున్నట్లు గత రెండు రోజులుగా సోషల్‌మీడియాలో ఆడియో వైరల్ అవుతోంది. పొల్లాచ్చిలో విద్యార్థినులపై లైంగిక దాడుల కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పొల్లాచ్చికి చెందిన తిరునావుక్కరసు సహా ఐదుగురు అరెస్టయ్యారు. అంతేకాకుండా బాధిత విద్యార్థిని సోదరుడిపై దాడి చేసినట్లు అన్నాడీఎంకే నేత బార్ నాగరాజ్ సహ ఐదుగురు అరెస్టయ్యారు. ఈ లైంగిక దాడి గురించి సీబీసీఐడీ పోలీసులు విచారణ జరుపుతూ వచ్చారు. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ విచారణకు మారింది. ఇదిలాఉండగా ఫిర్యాదు చేసిన విద్యార్థిని సోదరుడిపై దాడి చేసిన కేసులో అరెస్టయిన బార్ నాగరాజ్ ఒక మహిళతో సెల్‌ఫోన్‌లో కేసు వాపసు తీసుకోమని బెదిరింపులు చేస్తున్న ఆడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో హల్‌చల్ చేస్తోంది. అందులో నాగరాజ్ సదరు మహిళతో వీడియోను డెలిట్ చేయమని, కేసు వాపసు తీసుకోమని బెదిరిస్తున్నట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment