వివరాలు వెల్లడిస్తున్న సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి
ఖైరతాబాద్: బస్సుల్లో ప్రయాణికుల దృష్టిమరల్చి మెడలోని బంగారు ఆభరణాలను క్షణాల్లో మాయం చేస్తున్న ముఠా సభ్యులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆదివారం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి వివరాలు వెల్లడించారు.. నాంపల్లి మాన్‌గార్ బస్తీకి చెందిన శ్యాంసుందర్, దశరథ్, లక్కీ, సాయికుమార్, అరుణ్‌రాజ్ లతో పాటు మరో నలుగురు యువకులు శ్యాంసుందర్ నేతృత్వంలో ముఠాగా ఏర్పడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పురుషులను టార్గెట్ చేసుకుని వారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేసేవారు.
గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐదు, నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు, నారాయణగూడలో ఒక చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సైఫాబాద్ డీఐ బి.నర్సింహులు నేతృత్వంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు శనివారం సాయంత్రం లక్డీకాపూల్ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వారు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. బస్సును ఆపి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల్లో మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరి నుంచి 7తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ చింతల సైదిరెడ్డి, డిఎస్‌ఐ ఎం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మాసబ్ ట్యాంక్ అడ్డాగా ..
శ్యాంసుందర్ గ్యాంగ్ మాసబ్‌ట్యాంక్ అడ్డాగా చేసుకొని చోరీలకు పాల్పడుతోంది. రద్దీగా ఉన్న బస్సులో ఎంపిక చేసుకున్న వ్యక్తికి ముందు ముగ్గురు, వెనుక ముగ్గురు, ఫుట్‌బోర్డుపై మరో ముగ్గురు నిలుచుంటారు. టార్గెట్ చేసిన వ్యక్తి ముందు ఉన్న వ్యక్తి తన మోచేతులతో వ్యక్తి మెడముందు భాగం నుంచి పైకి లేపుతాడు. అదే సమయంలో వెనుక ఉండే మరొకరు బాధితుడి మెడలోని బంగారు ఆభరణాలను నోటితో కట్ చేస్తాడు. అనంతరం చోరీ చేసిన సొత్తును మరొకరికి అందజేస్తాడు. పని ముగిసిన తర్వాత ఒకొక్కరు ఒక్కో స్టాప్‌లో బస్సు దిగిపోతారు. చివరగా మాసబ్‌ట్యాంక్‌లో కలుసుకొని అక్కడినుంచి మాన్‌గార్ బస్తీకి చేరుకుంటారు. ముఠా నాయకుడు శ్యాంసుందర్‌గౌడ్ గతంలో మలక్‌పేట పరిధిలో పీడీ యాక్ట్ కింద అరెస్టై జైలుకు వెళ్లినట్లు తెలిపారు. ఆభరణాలను నోటితో కొరికి తెంపడంలో అతను సిద్ధహస్తుడని ఏసీపీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment