
సాక్షి, సిటీబ్యూరో: ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులకు చిక్కకుండా ఉండాలనే ఉద్దేశంతో సిటీలో స్నాచింగ్స్ చేసే సయ్యద్ అస్లాం జహీరాబాద్ అడవుల్లో మకాం వేస్తాడు. కేవలం నేరాలు చేయడానికి మాత్రమే తన అనుచరుడితో కలిసి బయటకు వస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు నేరం చేసినా ఇతగాడిని పట్టుకోవడానికి పోలీసులు కనీసం నెల రోజులు కష్టపడాల్సిందే. ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మాత్రం ఈసారి కేవలం నాలుగు రోజుల్లోనే అతడిని పట్టుకోగలిగారు. సైదాబాద్‌లో గురువారం చోటు చేసుకున్న కేసులో పట్టుబడగా, మరో రెండు నేరాలు వెలుగులోకి వచ్చాయని, చిక్కే సందర్భంలో ఇంకో నేరం చేశాడని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చైతన్యకుమార్‌లతో కలిసి సోమవారం వివరాలు వెల్లడించారు.
ఎనిమిదేళ్లుగా నేరాలు..
జహీరాబాద్‌కు చెందిన సయ్యద్ అస్లం నగరంలోని ఓల్డ్ మలక్‌పేటలో స్థిరపడ్డాడు. కేవలం ఏడో తరగతి మాత్రమే చదివిన అతను కొన్నాళ్లపాటు వెల్డింగ్ పని చేశాడు. ఇలా వస్తున్న ఆదాయం జల్సాలకు సరిపోకపోవడంతో చైన్‌స్నాచర్‌గా మారాడు. 2010 నుంచి నేరాలు ప్రారంభించిన ఇతను ప్రతి సందర్భంలోనూ ఓ ‘కొత్త తోడు’ వెతుక్కుంటాడు. అతడితో కలిసే బైక్‌పై తిరుగుతూ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇలా ఇప్పటి వరకు మూడు కమిషనరేట్ల పరిధిలో 47 నేరాలు చేశాడు. గతంలో సంతోష్‌నగర్, చంద్రాయణగుట్ట, మీర్‌చౌక్, పంజగుట్ట, మీర్‌పేట్, మైలార్‌దేవ్‌పల్లి, కంచన్‌బాగ్, బోయిన్‌పల్లి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇతడి నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న సిటీ పోలీసులు 2015లో పీడీ యాక్ట్ ప్రయోగించారు. దీంతో ఏడాది కాలం జైల్లో గడిపినా అతడి పంథాలో మార్పు రాలేదు. బోయిన్‌పల్లి పరిధిలో నేరాలు చేసి గత ఏడాది ఫిబ్రవరిలో పోలీసులకు చిక్కాడు. ఈ నెల 12 వరకు జైల్లోనే గడిపిన ఇతను బయటకు వచ్చాడు.
పోలీసు దర్యాప్తుపై పట్టుండటంతో....
ఇప్పటికే అనేకసార్లు జైలుకు వెళ్లిన అస్లంకు పోలీసుల దర్యాప్తు తీరుతెన్నులపై మంచి పట్టుంది. ఈ నేపథ్యంలోనే నేరం చేసిన ప్రతిసారీ ఆ సొత్తును సొమ్ముగా మార్చుకుని అనుచరుడితో సహా జహీరాబాద్ అడవుల్లోకి పారిపోతాడు. కేవలం మరో నేరం చేయడానికి మాత్రమే బయటకు వస్తాడు. ఆహారాన్ని సైతం రహస్యంగా తీసుకుని వెళ్తుంటాడు. ఎవరైనా అతికష్టమ్మీద ఇతడి ఉనికి గుర్తించి ఆ అడవుల్లోకి వెళ్లినా పోలీసుల కదలికలను గుర్తించి పారిపోతాడు. ఈ నేపథ్యంలోనే ఇతడిని పట్టుకోవడానికి పోలీసులు కనీసం నెల రోజుల పాటు కష్టపడాల్సి ఉంటుంది. జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత మాత్రం మరో నేరం చేసే వరకు ఓల్డ్‌మలక్‌పేటలో ఉంటాడు. ఇతడి స్వస్థలం జహీరాబాద్ కావడంతో ఆ ప్రాంతంపై ఇతడికి పూర్తి పట్టుంది.
వలపన్ని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్...
ఈసారి కారాగారంలోనే పరిచయమైన ఓ నేరగాడి సమీప బంధువు, పాత నేరస్తుడు మహ్మద్ అమీర్‌తో కలిసి అస్లం రంగంలోకి దిగాడు. బైక్‌పై తిరుగుతూ గురువారం సైదాబాద్ ప్రాంతంలో పంజా విసిరి 2 తులాల బంగారు గొలుసు స్నాచింగ్ చేసుకుపోయాడు. ఈ కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా శుక్రవారమే నిందితుడు అస్లంగా గుర్తించింది. సైదాబాద్ ఇన్‌స్పెక్టర్ ఎన్.మోహన్‌కుమార్‌తో కలిసి సోమవారం సైదాబాద్ ప్రాంతంలో వాహన తనిఖీలు చేస్తుండగా బైక్‌పై వస్తున్న అస్లం, అమీర్‌లను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో అతను కత్తితో దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించగా ఒడిసిపట్టుకున్నారు తొలుత ఉన్న స్నాచింగ్ కేసుతో పాటు ఈ ఉదంతంతో ఈ ద్వయంపై దాడి కేసు నమోదైంది. వారు ప్రయాణిస్తున్న బండి విషయం ఆరాతీ యగా తాండూరులో చోరీ చేసిందని తేలింది.వారి వద్ద లభించిన ఓ బ్యాగ్‌పై నిందుతులను విచారించగా అది సంతోష్‌నగర్ పరిధిలో స్నాచింగ్ చేసిందిగా వెల్లడైంది. దీంతో వీరు ఈ రెండు నేరాలు కూడా చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment