భవానీ భక్తుల ముసుగులో... | Chain Snatchers Arrest in Visakhapatnam | Sakshi
Sakshi News home page

రెండు కేసుల్లో ఐదుగురి అరెస్ట్‌

Published Mon, Jan 28 2019 7:20 AM | Last Updated on Mon, Jan 28 2019 7:20 AM

Chain Snatchers Arrest in Visakhapatnam - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న నగర క్రైం డీసీపీ ఎ.ఆర్‌.దామోదర్‌

అల్లిపురం(విశాఖ దక్షిణం): ఇటీవల నగర పరిధిలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులతోపాటు, ఇంటి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను నగర పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి సుమారు రూ.8లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నగర పోలీస్‌ కమిషనరేట్‌ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ ఎ.ఆర్‌.దామోదర్‌ వివరాలు వెల్లడించారు.

భవానీ భక్తుల ముసుగులో...
పెందుర్తి మండలం, నరవ గ్రామంలో గత ఏడాది డిసెంబర్‌ 28న ఉదయం 6గంటల సమయంలో ఒక మహిళ మెడలోని పుస్తెల తాడు తెంపుకుపోయిన కేసులో ముగ్గురు వ్యక్తులను నగర క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.87,900ల విలువ గల బంగారు పుస్తెలు, గొలుసు స్వాధీనం చేసుకొన్నారు. వారు ఉపయోగించిన ఆటో, బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన పెద్దిశెట్టి రూపేష్, దంగుడుబొయిన వెంకటేష్, పోలిపిల్లి మహేష్‌ స్నేహితులు. వీరు ముగ్గురూ భవానీ మాల ధరిం చారు. ఆటోలో అక్కయ్యపాలెం నుంచి రెక్కీ చేసుకుంటూ గోపాలపట్నం, నరవ వైపు ప్రయాణం చేసి... డిసెంబర్‌ 28న ఉదయం 6గంటల సమయంలో నరవ దగ్గర ఒంటరిగా నడుచుకుని వెళ్తున్న మహిళ మెడలోని పుస్తెల తాడు తెంపుకుని ఆటోలోనే పరారయ్యారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురుని పెందుర్తి క్రైం ఇన్‌స్పెక్టర్‌ టి.నవీన్‌కుమార్, ఎస్‌ఐ జీడీ బాబు, కానిస్టేబుల్‌ వై.చిన్నారావు, కె.అప్పలరాజు అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు రికవరీ చేశారు. నిందితుల్లో పెద్దిశెట్టి రూపేష్‌పై ఫోర్తుటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సస్పెట్‌ సీటు ఉంది. ఇతనిపై రెండు రోబరీ కేసులు, రెండు చైన్‌ స్నాచింగ్‌లు, రెండు ఆటో టైర్లు దొంగతనం కేసులు ఉన్నాయి. వీటిలో అరెస్ట్‌ అయి జైలు శిక్ష కూడా అనుభవించాడు. రెండో నిందితుడు దంగుడుబోయిన వెంకటేష్‌పై కూడా చైన్‌ స్నాచింగ్‌ కేసులు ఉన్నాయి.

ఈ ఏడాది తగ్గిన నేరాలు : ఏటా పండగ రోజుల్లో దొంగతనాలు ఎక్కువుగా జరిగేవని, ఈ ఏడాది తీసుకున్న జాగ్రత్తల వల్ల తగ్గుముఖం పట్టాయని నగర క్రైం డీసీపీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు. ఈ ఏడాది రద్దీగా గల దుకాణాలులో, ఇంటి దొంగతనాలు తక్కువుగా నమోదయ్యాయన్నారు. దొంగతనం కేసుల్లో స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్లు కీలకంగా మారుతున్నారని క్రైం డీసీపీ దామోదర్‌ తెలిపారు. పెందుర్తి చైన్‌ స్నాచింగ్‌ కేసులో నిందితులను పట్టుకోవటంతో తమకు సహకరించిన ఇ.మణికంఠను ఆయన ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డు అందజేశారు. అదేవిధంగా నిందితులను పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన పోలీస్‌ సిబ్బందికి నగదు రివార్డులు అందజేసి అభినందించారు.

ఇంటి తాళం పగులగొట్టి..
రాత్రి పూట ఇంటికి వేసి ఉన్న తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన వ్యక్తితో పాటు, దొంగ సొత్తును కలిగి ఉన్న వ్యక్తులను ఆరిలోవ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.3.60లక్షల నగదు, రూ.7.28లక్షల విలువ గల 122.91 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

విశాలాక్షినగర్‌ ప్రాంతానికి చెందిన చింతపల్లి వెంకటరావు ఈ నెల 16వ తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా బయటకు వెళ్లారు. అదే రోజు ఆర్కేబీచ్‌లో మూరి మిక్చర్‌ అమ్ముకునే దంగేటి సతీష్, అతని స్నేహితుడు మేడిశెట్టి వరప్రసాద్‌ మద్యం సేవించారు. తరువాత దంగేటి సతీష్‌ తన అత్తగారింటికి వెళ్తూ విశాలాక్షినగర్‌  రామాలయం వీధిలో గల మూడో అంతస్తుపైన గల ఇంటికి తాళం వేసి ఉన్న సంగతి గమనించాడు. సతీష్‌ తన దగ్గర గల గుణపంతో తాళం విరగ్గొట్టి ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలో గల బంగారం, నగదు దొంగిలించాడు.

తరువాత వంట గదిలోని కారం, పసుపు ఇంట్లో జల్లి తన వేలి ముద్రలు పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. తరువాత దొంగలించిన సొత్తును తన స్నేహితుడు మేడిశెట్టి వరప్రసాద్‌కు అప్పగించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఆరిలోవ పోలీసులు ద్వారకా సబ్‌డివిజన్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాసరావు, ఆరిలోవ క్రైం ఎస్‌ఐ పి.విజయకుమార్, ఎస్‌ఐ డి.సూరి తమ సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు. తాజాగా హనుమంతువాక వద్ద దంగేటి సతీష్‌ని, మేడిశెట్టి వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యసనాలకు బానిసైన దంగేటి సతీష్‌పై వన్‌టౌప్‌ పోలీస్‌ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎనిమిది నెలల శిక్ష కూడా అనుభవించాడు. త్రీటౌన్‌లో ఒక కేసులో మూడు నెలల జైలు శిక్ష పడింది. రెండో నిందితుడు మేడిశెట్టి వరప్రసాద్‌పై రౌడీషీట్‌ ఉంది. చనిపోయిన రౌడీ షీటర్‌ కాశీంకు సన్నిహితుడు కూడా. ఇతనిపై ఒక హత్యకేసు, ఒక రోబరీ కేసు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement