సీరియల్ స్నాచర్లు వాడిన వాహనం ఇదే
సాక్షి, సిటీబ్యూరో: రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల వ్యవధిలో 9 స్నాచింగ్స్, మరో యత్నానికి పాల్పడిన దుండగులు వినియోగించిన ద్విచక్ర వాహనం ఆచూకీని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కనిపెట్టారు. భవానీనగర్ ఠాణా పరిధిలోని ఓ వ్యక్తి దీన్ని ఆ చోరులకు అద్దెకు ఇచ్చినట్లు తేల్చారు. సీసీ కెమెరాల్లో లభించిన ఫీడ్ ఆధారంగా స్నాచర్లు వాడిన కేటీఎం వాహనంనెంబర్ ‘టీఎస్ 08 ఈపీ 4005’గా గుర్తించిన పోలీసులు దీని ద్వారా ముందుకు వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు దక్షిణ మండలంలోని భవానీనగర్ ఠాణాలకు తరలించారు. దీని యజమానితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. స్నాచర్లను పట్టుకోవడానికి సిటీ, రాచకొండలకు చెందిన టీమ్స్ బీహార్, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లో గాలిస్తున్నాయి.
విమానంలో వచ్చి ఉంటారా?
ఉత్తరాదికి చెందిన అనేక వ్యవస్థీకృత ముఠాలు కొన్నేళ్లుగా సిటీని టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్నాయి. కొన్ని ముఠాలు వాహనాలను తీసుకుని వస్తుండగా... మరికొన్ని సిటీలో, చుట్టు పక్కల జిల్లాల్లో చోరీ చేసినవి వినియోగించాయి. తాజాగా పంజా విసిరిన ముఠాను ఉత్తరప్రదేశ్‌కు చెందినదిగా అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఉంటుందని భావిస్తున్నారు. బుధవారం నాటి ఉదంతాల నేపథ్యంలో రికార్డు అయిన సీసీ కెమెరా ఫుటేజ్‌లో వెనుక కూర్చున్న స్నాచర్ ఓ ట్రావెల్ బ్యాగ్‌ను వెనుక వేసుకున్నట్లు కనిపి స్తోంది. ఈ నేపథ్యంలోనే బయట నుంచి వచ్చిన దుండగులే ఈ పని చేశారని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. శుక్రవారం వారు వినియోగించిన వాహనం దొరకడంతో ఈ అనుమానాలకు బలమైన ఆధారాలు సైతం లభించాయి.
వాహనం అద్దెకు తీసుకుని...
ఇద్దరు స్నాచర్లు వాహనాన్ని పాతబస్తీలో అద్దెకు తీసుకున్నారు. వారు వినియోగించిన కేటీఎం వాహనం మహేశ్వర్‌రెడ్డి పేరుతో ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా దాని నెంబర్ గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండేళ్ల క్రితం దాన్ని పాతబస్తీకి చెందిన మహ్మద్ ముఘాయిజ్‌కు విక్రయించినట్లు తేలింది. ఇతడి అనుచరుడైన సూఫియాన్ ఆ వాహనాన్ని కొన్నాళ్లుగా అద్దె కు ఇస్తున్నాడు. సూఫియాన్ వద్దే ఉత్తరాది స్నాచ ర్లు బుధవారం ఉదయం వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు సాయంత్రం వరకు రెక్కీలు చేసి గంట వ్యవధిలో మీర్‌పేట, వనస్థలిపురం, హయత్‌నగర్, ఎల్బీనగర్‌ల్లో ఐదు చోట్ల పంజా విసిరారు. అక్కడ నుంచి నల్లగొండ చౌరస్తా మీదుగా మలక్‌పేట వరకు వచ్చిన వీళ్లు మళ్లీ వెనక్కు వెళ్లి చైతన్యపురి ప్రాంతంలో అదృశ్యమయ్యారు.
గూగుల్ మ్యాప్ సాయంతో పరార్..?
ఆ రాత్రి చైతన్యపురి–నాగోల్ మధ్య ఓ ప్రాంతంలో తలదాచుకున్న ఈ ద్వయం గురువారం ఉదయం మళ్లీ పంజా విసిరింది. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో నాగోల్‌లో ఓ స్నాచింగ్‌కు యత్నించింది. ఆపై 7 గంటలకు చైతన్యపురిలో మొదలెట్టి 40 నిమిషాల్లో వనస్థలిపురం, హయత్‌నగర్‌ల్లో నాలుగు స్నాచింగ్స్ చేసింది. హయత్‌నగర్ నుంచి తిరిగి ఎల్బీనగర్ మీదు గా నాగార్జునసాగర్ రోడ్డు వరకు వెళ్లి అదృశ్యమైంది. దీన్ని బట్టి ఈ దుండగులు ట్రాఫిక్ లేని మార్గాలను, తాము చేరాల్సిన గమ్యాలను గుర్తించడం కోసం గూగుల్ మ్యాప్స్ సహాయం తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం ఉదయం వీరు వినియోగించిన బైక్ భవానీనగర్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఉండటాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకుని స్థానిక ఠాణాకు తరలించారు.
ఐడీ లేకుండా అద్దెకు ఎలా..?
వాహనం నెంబర్ ఆధారంగా మహేశ్వర్‌రెడ్డిని, ముఘాయిజ్‌ను, సూఫియాన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే దాన్ని సూఫియాన్ ఆ ఇద్దరు స్నాచర్లకు అద్దెకు ఇచ్చినట్లు తేలింది. సాధారణంగా ఇలా వాహనాలు అద్దెకు ఇచ్చే వాళ్లు అవతలి వారి గుర్తింపుకార్డులు తీసుకుంటారు. తాను మాత్రం అలా చేయలేదని సూఫియాన్ పోలీసులకు చెప్పాడు. దీంతో ఇతడి వ్యవహారాన్నీ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. తనకు పరిచయస్తుడైన ఓ వ్యక్తి చెప్పడంతో వాహనం ఇచ్చానని సూఫియాన్ చెప్పడంతో అతడినీ అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో స్నాచర్లకు స్థానికులు సహకరించారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. స్నాచింగ్ చేసిన తర్వాత దుండగులు తమ వద్ద ఉన్న దాదాపు 30 తులాల బంగారం గొలుసులతో విమానంలో వెళ్లారని పోలీసులు అంటున్నారు. దీంతో బస్సు లేదా రైలులో నగరం దాటడమో, ఒకరు సొత్తుతో వెళ్లిపోగా.. వేరే వారు విమానంలో వెళ్లడమో జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ వాహనంపై 2017ఏప్రిల్ 3 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 27 వరకు మూడు పోలీసు కమిషనరేట్లకు సంబంధించిన 12 ఈ–చలాన్ల మొత్తం రూ.2785 పెండింగ్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment