తస్మాత్‌ జాగ్రత్త..! ఇలా వచ్చి అలా తెంచుకెళ్తారు | Chain Snatchers Hulchal In LB Nagar | Sakshi
Sakshi News home page

రాచకొండలో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్లు  

Published Fri, Dec 28 2018 8:41 AM | Last Updated on Fri, Dec 28 2018 8:59 AM

Chain Snatchers Hulchal In LB Nagar - Sakshi

హయత్‌నగర్‌లో స్నాచింగ్‌ చేశాక.. టెలిఫోన్‌నగర్‌లో మరో స్నాచింగ్‌కు పాల్పడుతూ.. 

సాక్షినెట్‌వర్క్‌, హైదరాబాద్‌ : చైన్‌ స్నాచర్లు చెలరేగిపోయారు. బుధవారం సాయంత్రం ఎల్‌బీనగర్‌ జోన్‌లో వరుసగా చేసిన ఐదు చోరీలతో పోలీసులు అప్రమత్తమైనా గురువారం తెల్లవారుజామున కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠాగా భావిస్తున్న ఇద్దరు దొంగలు మరో నాలుగు గొలుసు దొంగతనాలు చేయడం నిఘా డొల్లతనాన్ని బయటపెడుతోంది. ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ రంగంలోకి దిగి అన్ని ఠాణాల ఎస్‌హెచ్‌ఓలను అప్రమత్తం చేసినా దొంగలను మాత్రం పట్టుకోలేకపోయారు. కేటీఎం బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు దాదాపు 15 గంటల వ్యవధిలో తొమ్మిది చైన్‌ స్నాచింగ్‌లు చేసి పోలీసులకు సవాల్‌ విసరడం చర్చనీయాంశమైంది. ఈ వరుస చోరీలతో మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారు.  వరుస చోరీలను సవాల్‌గా తీసుకున్న రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ప్రత్యేకంగా ఎనిమిది బృందాలను రంగంలోకి దింపారు. ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. నంబర్‌ ప్లేట్‌ లేని బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. నిందితులున్న సీసీటీవీ ఫుటేజీలను ఇతర రాష్ట్రాల పోలీసులకు పంపించగా వారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇరానీ గ్యాంగ్‌లోని వ్యక్తులుగా గుర్తించారు. వీరు విమానాల్లో నగరానికి వచ్చి చోరీలకు తెగబడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శివార్లలోని అన్ని ప్రాంతాల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఈ ఇద్దరు చైన్‌ స్నాచర్ల కోసం వెతుకుతున్నారు. బుధవారం సాయంత్రం గంట వ్యవధిలో ఐదు చైన్‌స్నాచింగ్‌లు చేసిన ఈ ముఠా.. చివరగా అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద కనిపించిందని, అక్కడే బస చేసి మళ్లీ గురువారం తెల్లవారుజామున చైన్‌ స్నాచింగ్‌లు చేసి ఉంటారన్న అనుమానిస్తున్నారు. వరుస చైన్‌ స్నాచింగ్‌లతో సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని పోలీసులు కూడా అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు.
 
15 గంటల్లో 32 తులాలు చోరీ 
వనస్థలిపురం, ఎల్బీనగర్, మీర్‌పేట, హయత్‌నగర్‌ ఠాణాల పరిధుల్లో గొలుసు దొంగలు ఐదు చోట్ల 19 తులాలకు పైగా బంగారు నగలు అపహరించుకపోయిన  స్నాచర్లు గురువారం ఉదయం 7 నుంచి 7.40 లోపు చైతన్యపురి, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో నాలుగు చోరీలకు పాల్పడ్డారు. ఇందులో 13 తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. బుధ, గురువారాల్లో మొత్తం 32 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.
 
అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి చైతన్యపురికి గురువారం ఉదయం 6.45 గంటలకు చేరుకున్న చైన్‌స్నాచర్లు టెలిఫోన్‌కాలనీ రోడ్‌ నెం.3లో ఉదయం 7 గంటలకు ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఈశ్వరి(40) మెడలోని ఐదు తులాల పుస్తెలతాడును తెంపబోతుండగా ప్రతిఘటించింది. దీంతో చేతికి వచ్చిన సగం గొలుసుతో స్నాచర్లు పరారయ్యారు. వెంటనే వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ సహారారోడ్డులోని ఇందిరానగర్‌ కాలనీ వాసి ధనలక్ష్మి(46)  ఉదయం మార్నింగ్‌ వాక్‌కు వెళ్లి వస్తుండగా ఎంఈ రెడ్డి ఫంక్షన్‌హాల్‌ వద్ద ఆమె మెడలోని నాలుగు తులాల పుస్తెల తాడును తెంచుకుని పారిపోయారు.
 


లెక్చరర్స్‌ కాలనీలో బాదితురాలు లక్ష్మమ్మ, కుంట్లూర్‌ రోడ్డులో బాధితురాలు నిర్మల   
 
హయత్‌నగర్‌లో పది నిమిషాల వ్యవధిలో ఇద్దరు మహిళల మెడ లోనుంచి ఆరున్నర తులాల బంగారు గొలుసులను లాక్కుపోయారు. నల్లగొండకు చెందిన కుంభం లక్ష్మమ్మ(52) బందువుల ఇంట్లో పెళ్లి కోసమని వారం క్రితం హయత్‌నగర్‌లోని లెక్చరర్స్‌ కాలనీకి వచ్చింది. గురువారం పెళ్లి ఉదయం 7.30కి ఇంటి ముందు నిలబడగా నల్లటి బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని పారిపోయారు.  

అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన దోనూరు నిర్మల(37) కుంట్లూర్‌లో తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు బస్సులో హయత్‌నగర్‌ వరకు వచ్చి కుంట్లూర్‌ రోడ్డులోని ఎస్సార్‌ పెట్రోల్‌ బంకు సమీపంలో ఆటో కోసం నిలబడింది. వేగంగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నిర్మల మెడలోని 2.5 తులాల బంగారు గొలుసును తెంచుకుపోయారు. అయితే, లెక్చరర్స్‌ కాలనీలో లక్ష్మమ్మ చైన్‌ను లాక్కున్న దుండగులు పది నిమిషాల వ్యవధిలో కుంట్లూర్‌ రోడ్డు వైపు వెళ్లి నిర్మల గొలుసును లాక్కున్నట్టు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. విజయవాడ జాతీయ రహదారి వెంట చైన్‌స్నాచర్లు పారిపోయే అవకాశం ఉండడంతో పోలీసు బృందాలు తనిఖీలు చేపట్టాయి.  

రంగంలోకి యాంటీ చైన్‌ స్నాచింగ్‌ టీమ్స్‌? 
చైన్‌ స్నాచింగ్‌ ముఠా ఒకప్పుడు నడుచుకుంటు వేళ్లే మహిళలనే టార్గెట్‌ చేసేవారు. అయితే, గత కొద్దికాలంగా జరుగుతున్న గొలుసు దొంగతనాలను చూస్తే, రోడ్డు పై నుంచి ఏకంగా ఇళ్లల్లోకే వచ్చేస్తున్నారు. స్నాచింగ్‌ సమయంలో మహిళలను తీవ్రంగా గాయపరుస్తున్నారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే స్థితికి తీసుకొస్తున్నారు. చైన్‌ స్నాచర్ల ఆగడాలను ఆటకట్టించేందుకు అప్పటి ఉమ్మడి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రత్యేక ‘యాంటీ చైన్‌ స్నాచింగ్‌ టీమ్‌’ రంగంలోకి దిగింది. కానిస్టేబుల్‌గా విధి నిర్వహణలో సమర్థులైన 110 మందిని ఎంపిక చేసి ప్రత్యేక తర్పీదునిచ్చారు. ఒక్కో బృందంలో ఇద్దరేసి సభ్యులతో 55 టీమ్‌లను ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ సమకూర్చిన బైక్‌లతో సాధారణ పౌరుడిగా నగరంలో 24 గంటల పాటు పహారా కాయడమే వీరి విధి. మానసికంగా, శారీరకంగా వీరిని సంసిద్ధులను చేసేందుకు మోటివేనల్‌ క్లాసులు, షార్ట్‌ వెపన్‌ హ్యండిల్‌ చేయడం, బైక్‌లపై వేగంగా వెళ్లడంలో అనుభవజ్ఞులతో శిక్షణను ఇచ్చారు. ఈ జట్లు రంగంలోకి దిగినకొత్తలో కొంత మంది చైన్‌ స్నాచర్లను ప్రత్యక్షంగా పట్టుకొని దొంగల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. ఆత్మరక్షణ కోసం ఎల్‌బీనగర్‌లో చైన్‌స్నాచర్లపైకి గాల్లోకి కాల్పులు జరిపిన ఉదంతం సంచలనం సృష్టించింది. ఈ టీమ్‌ల రాకతో అంతర్రాష్ట్ర చైన్‌ స్నాచర్‌ గ్యాంగ్‌లు ఇటువైపు చూడడమే మానేశాయి. అయితే సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లుగా విడిపోయాక యాంటీ చైన్‌ స్నాచింగ్‌ టీమ్‌ ప్రాధాన్యత తగ్గింది. ఈ బృందాలను రంగంలోకి దింపితే ఊహించని రీతిలో జరిగే చైన్‌ స్నాచింగ్‌లను నిలువరించే అవకాశం ఉందనే వాదన పోలీసు శాఖలోనే వినబడుతోంది.  

సిటీలోనూ అప్రమత్తం 
రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో బుధవారం నుంచి జరుగుతున్న వరుస చైన్‌ స్నాచింగ్‌ల నేపథ్యంలో సిటీ పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. స్నాచర్ల కదలికలు, ఆచూకీ కనిపెట్టడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రహదారుల వెంట  తనిఖీలు ముమ్మరం చేశాం. స్నాచర్లు బస చేశారనే అనుమానంతో లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు చేస్తున్నాం. నగరం మొత్తం అలర్ట్‌ ప్రకటించాం.     – అంజనీకుమార్, నగర పోలీస్‌ కమిషనర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement