
గొలుసు తెంపుకుని పోతున్న దుండగుల ఫొటో (సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా)
అల్లిపురం(విశాఖ దక్షిణ): నగరంలో చైన్‌స్నాచర్లు మరోసారి చెలరేగిపోయారు. డాబా గార్డెన్స్, మురళీనగర్ ప్రాంతాల్లో ఇద్దరు మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలు తెంపుకునిపోయి పోలీసులకు సవాల్ విసిరారు. ముఖ్యంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు, నగర పోలీస్ కమిషనరేట్‌కు మధ్యన చైన్‌స్నాచర్లు గురువారం ఉదయం అలజడి సృష్టించడం అందరినీ విస్మయపరిచింది. నిత్యం రద్దీగా ఉండే డాబాగార్డెన్స్ ప్రాంతంలో ఈ ఘటన జరగడం నగర ప్రజలను ఆందోళనకు గురిచేసింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... కంచరపాలెం, బర్మాక్యాంపునకు చెందిన ఉండ్రాజనవరపు అన్నపూర్ణ డాబాగార్డెన్స్‌లో గల ఎం.ఎన్.ఆర్ స్కూల్‌లో గత 12 సంవత్సరాలుగా టీచరుగా ఉద్యోగం చేస్తున్నారు. గురువారం ఉదయం 8.10గంటల సమయంలో ఆమె ఆటోలో స్కూలుకి బయలుదేరారు. డాబాగార్డెన్స్‌లో గల ఎం.ఎఫ్.ఖాన్ షాపు వద్ద ఆటో దిగి రోడ్డు దాటి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వీధిలో నుంచి ఎం.ఎన్.ఆర్ స్కూలుకు వెళ్తున్నారు.
ఆ సమయంలో ఆమె అదే వీధిలో గల పయనీర్ షూ షాప్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎదురుగా వచ్చి ఆమె మెడలో గల తులమున్నర చైన్ తెంపుకుని పరారయ్యారు. ఈ హఠాత్ పరిణామంతో ఆమె తేరుకునేలోపు దుండగులు ఆర్కే ఫ్యామిలీ షాపు వైపు వెళ్లిపోయారు. వారిలో వాహనం నడుపుతున్న వ్యక్తి తలకు హెల్మెట్ ధరించి ఉండగా, వెనుక కూర్చున్న మరొక వ్యక్తి సాధారణంగా ఉన్నాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు మేరకు క్రైం ఏడీసీపీ వి.సురేష్‌బాబు, ఈస్ట్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, ఈస్ట్ క్రైం సీఐ కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సమీపంలోని పయనీర్ చెప్పుల దుకాణం, ఇతర ఫర్నీచర్ షాపుల్లో గల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. దుకాణదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దుండుగులు ప్రయాణిస్తున్న వాహనం వివరాలు సేకరించారు. బాధతురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గతంలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినవారే.!
గత నెలలో సుజాతనగర్, గోపాలపట్నం, బాలయ్యశాస్త్రి లే అవుట్ ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన వారే ప్రస్తుతం మహిళల మెడలోని చైన్‌లు తెంపుకుపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వాహనం నంబరు సీసీ కెమెరా దృశ్యాల్లో అస్పష్టంగా ఉందని తెలిపారు. దుండుగులు వాడిన వాహనం హోండా యూనికార్న్‌గా గుర్తించారు. వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆలయానికి వచ్చి వెళ్తుండగా...
ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): మురళీనగర్ వైభవ వేంకటేశ్వరస్వామి గుడి సమీపంలో ఓ మహిళ మెడలో నుంచి రెండు తులాల పుస్తెలతాడును దుండగులు తెంపుకునిపోయారు. మురళీనగర్‌కు చెందిన లక్ష్మీ కొండమ్మ(45) గురువారం ఉదయం 10 గంటల సమయంలో స్థానిక వైభవ వేంకటేవ్వర స్వామి ఆలయానికి వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆలయానికి సమీపంలోనే గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని రెండు తులాల పుస్తెల తాడు తెంపుకునిపోయారు. జరిగిన ఘటనపై కంచరపాలెం నేర విభాగం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. వెంటనే ఎస్‌ఐ కుమార్, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment