స్వప్న వారం కిందటే ఖరీదైన నెక్లెస్ కొనుక్కుంది. దానిని ధరించి ముస్తాబై స్నేహితురాలికి చూపిద్దామని స్కూటీపై బయల్దేరింది. కొంతదూరం వెళ్లగానే ఇద్దరు యువకులు బైక్‌పై వేగంగా వచ్చి గొలుసును లాక్కెళ్లారు. ఈ సంఘటనతో స్వప్న తీవ్ర షాక్‌కు గురైంది. పగలూ రాత్రి అదే చేదు ఘటన గుర్తుకొచ్చేది. తేరుకోవడానికి నెలరోజులు పైగా పట్టింది. నగరంలో పోలీసులు ఎంత గస్తీ తిరుగుతున్నా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.
బనశంకరి: సిలికాన్ సిటీలో రోజురోజుకు చైన్‌స్నాచర్లు పెట్రేగిపోతున్నారు. పోలీసులు ఇరానీగ్యాంగ్‌లను కష్టపడి అరెస్ట్ చేస్తున్నప్పటికీ గొలుసు చోరీలు ఆగడం లేదు. కొత్త కొత్త గ్యాంగ్‌లు రంగంలోకి దిగుతుండడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. సోమ, మంగళవారాల్లో రెండురోజుల్లో నగరంలో ఏడుచోట్ల దుండగులు చైన్‌స్నాచింగ్‌లకు తెగబడ్డారు. జ్ఞానభారతి, జ్ఞానజ్యోతి నగర, హనుమంతనగర, కొడిగేహళ్లి, తిలక్‌నగర, జేపీ.నగర, జీవన బీమానగర, న్యూ తిప్పసంద్రలో మహిళల గొలుసులు దొంగల పాలయ్యాయి. జీవనబీమానగర నివాసి 48 గ్రాముల బంగారుచైన్, కాడుగోడిలో 30 గ్రాముల చైన్ లాక్కెళ్లారు.
బ్లాక్ బైక్‌పై హల్‌చల్
బ్లాక్ హెల్మెట్, బ్లాక్ లెదర్ జాకెట్ దరించిన దుండగులు నలుపురంగు పల్సర్ బైకులో సంచరిస్తూ నగరంలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. అడ్రస్ అడిగే నెపంతో మహిళలతో మాటలు కలిపి మెడల్లో బంగారుచైన్ లాక్కెళుతున్నారు. అంతేగాక వాకింగ్ ముగించుకుని ఇంటికి వెనుతిరుగుతున్న మహిళల మెడల్లో మాంగల్యం చైన్, బంగారుగొలుసులు అఫహరిస్తున్నారు.
వెంటనే ఫిర్యాదు చేయండి
బెంగళూరునగరంలో జనవరి నుంచి జూన్ వరకు 138 చైన్ స్నాచింగ్ కేసులు నమోదుకాగా రాష్ట్రవ్యాప్తంగా 347 జరిగాయి. చైన్‌స్నాచింగ్‌కు ఎవరైనా పాల్పడిన వెంటనే ఏ వాహనంలో పారిపోయారు, వీలైతే నంబర్‌ను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఘటనపై వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ 100 ఫోన్ చేస్తే దొంగలు త్వరగా దొరికే అవకాశం ఉంది. ఇక చోరీ జరిగితే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఎప్పుడైనా దొంగసొత్తు స్వాధీనమైతే తిరిగి దక్కే చాన్సుంది.
కనీస జాగ్రత్తలు పాటించడం మేలు
♦ మహిళలు బయటకు వచ్చినప్పడు జాగ్రత్తగా ఉండాలి. చుట్టుపక్కల ఎవరున్నారు అనేది గమనిస్తుండాలి. అపరిచితులు కనిపిస్తే అప్రమత్తం కావాలి.
♦ ఆభరణాలు ధరించినట్లయితే బయటకు కనిపించకుండా చీర కొంగు, స్కార్ఫ్‌తో కప్పుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
♦ నిర్జన ప్రదేశాల వైపు వెళ్లకుండా జనసమ్మర్ధం ఉండే ప్రాంతాల్లోనేసంచరించడం ఉత్తమం.
♦ వాకింగ్‌కు వెళ్లే మహిళలు రోడ్లపైకి వెళ్లకుండా ఉద్యానవనాల్లోనే వాకింగ్ చేయాలి.
♦ యువకులు, పురుషులు అడ్రస్ అడిగే నెపంతో మాట్లాడాలని ప్రయత్నిస్తే దూరంగా ఉండి మాట్లాడడం, లేదా తెలియదని చెప్పేయాలి.
Comments
Please login to add a commentAdd a comment