కుమార్తె దావత్‌ కోసం చైన్‌స్నాచింగ్‌ | Chain Snatching Gang Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

కుమార్తె దావత్‌ కోసం చైన్‌స్నాచింగ్‌

Published Fri, Nov 8 2019 10:47 AM | Last Updated on Fri, Nov 8 2019 10:47 AM

Chain Snatching Gang Arrest in Hyderabad - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీఐ బాలగంగిరెడ్డి (ముసుగులో నిందితులు)

చిలకలగూడ : ఓ వ్యక్తి అప్పు చేసి కుమార్తె పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాడు. అప్పు తీర్చేందుకు ఇద్దరు మిత్రులతో కలిసి అదే రోజు చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులకు చిక్కి కటకటాల పాలైన సంఘటన చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం వెలుగులోకి వచ్చింది.   సీఐ బాలగంగిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన గోవింద్‌ తండ్రి రాజేందర్‌ అస్వస్థతకు గురై వారాసిగూడలోని శ్రీదేవి నర్సింగ్‌హోంలో చికిత్స పొందుతున్నాడు. గతనెల 30న రాత్రి గోవింద్‌ మందులు తీసుకుని వారాసిగూడ మీదుగా ఆస్పత్రికి వెళుతుండగా శివాజీ విగ్రహం సమీపంలో ఎదురుగా బైక్‌పై వచ్చిన ముగ్గురు అగంతకులు అతడిపై దాడిచేసి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు.  బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సీసీ పుటేజీ ఆధారంగా పట్టివేత
తార్నాక, మాణికేశ్వరీనగర్‌కు చెందిన గండికోట ప్రభు ప్యారడైజ్‌లోని సన్‌షైన్‌ ఆస్పత్రిలో ట్రాన్స్‌పోర్ట్‌ బాయ్‌గా పని చేసేవాడు. గత నెల 30న తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా సన్నిహితుల వద్ద అప్పు చేసి బంధువులకు విందు ఇచ్చాడు. అదే రోజు రాత్రి స్నేహితుడి బైక్‌పై తన మిత్రులు వెంకటేష్, సందీప్‌తో కలిసి వారాసిగూడలో మద్యం తాగారు. అనంతరం ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌ తదితర ప్రాంతాల్లో తిరిగి  చిలకలగూడ మీదుగా ఇంటికి వస్తుండగా ఒంటరిగా నడిచి వెళుతున్న గోవింద్‌ కనిపించాడు. వెంకటేష్‌ బైక్‌ నడుపుతుండగా, ప్రభు, సందీప్‌ వెనుక కూర్చున్నారు.  గోవింద్‌ వద్దకు రాగానే సందీప్‌ గట్టిగా కేక వేసి అతడిని ఉలిక్కిపడేలా చేయగా, ప్రభు అతని మెడలోని  బంగారు గొలుసు లాక్కున్నాడు. ముగ్గురు క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. 

నాలుగు నంబర్లతో ఆచూకీ...  
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. 5838 నంబర్‌ ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు బైక్‌ నంబర్‌ ఏపీ 10ఏకే 5838 గా గుర్తించి వాహన యజమానిని అదుపులోకి తీసుకుని విచారించారు. గండికోట ప్రభు  తన వాహనాన్ని తీసుకువెళ్లాడని, ఇంతవరకు తిరిగి ఇవ్వలేదని అతను చెప్పాడు. దీంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు బుధవారం రాత్రి వారాసిగూడ చౌరస్తాలో నిందితుడు ప్రభును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా  నేరం అంగీకరించాడు. 

ఆరు ఠాణాలు.. ఎనిమిది కేసులు...
ప్రధాన నిందితుడు గండికోట ప్రభు అలియాస్‌ బన్నీపై ఉస్మానియా యూనివర్సిటీ, చిలకలగూడ, ఉప్పల్, గోపాలపురం, అంబర్‌పేట, కరీంనగర్‌జిల్లా పెద్దపల్లి ఠాణాల్లో ఎనిమిది కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 8 గ్రాముల బంగారు గొలుసు, బైక్, సెల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసును చేధించిన చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, డీఐ సంజయ్‌కుమార్, డీఎస్‌ఐ శ్రీనివాస్, క్రైంటీం చక్రపాణి, మజహర్, వెంకటరమణ, ప్రకాశ్, విజయ్, వసీ, లక్ష్మణ్, నాగేశ్వర్, వెంకటేష్, రాయుడు, పెంచలయ్యలను నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్, గోపాలపురం ఏసీపీ వెంకటరమణ అభినందించి ప్రత్యేక రివార్డులు అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement