మృతి చెందిన ధైర్యనాథన్ ధైర్యనాథన్ మృతి చెందినట్లు సంఘమిత్ర రాసిచ్చిన లెటర్
చిత్తూరు ,గుడిపాల: బతికుండగానే ఓ వ్యక్తిని అధికారులు ముందుగానే చనిపోయినట్లు రికార్డులకు ఎక్కించారు. తీరా అతను చనిపోయిన తరువాత చంద్రన్న బీమా కోసం కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తే.. తమ రికార్డుల్లో అతను ఎన్నడో చనిపోయినట్లు ఉందని చెప్పడంతో కంగుతిన్నారు. వివరాలు.. మొగరాళ్లపల్లె దళితవాడకు చెందిన ధైర్యనాథన్(50) మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా గుండెపోటుకు గురై చనిపోయాడు. కుటుంబ సభ్యులు స్థానిక సంఘమిత్రకు ఫోన్‌లో సమాచారమిచ్చినా ఆమె స్పందించకపోవడంతో చంద్రన్న బీమా కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. ఇతను ఎప్పుడో చనిపోయినట్లు తమ వద్ద రికార్డుల్లో ఉందని చెప్పడంతో వారు అవాక్కయ్యారు. దీనిపై గుడిపాల వెలుగు కార్యాలయంలో సంప్రదించారు. చంద్రన్న బీమా బాండు వచ్చిందని, అయితే ధైర్యనాథన్ చనిపోయినట్లు సంఘమిత్ర రాతపూర్వకంగా చెప్పడంతో చంద్రన్న బీమా నుంచి అతని పేరు తొలగించారన్నారు. బతికి ఉన్న వ్యక్తిని ముందుగానే ఎలా చంపేస్తారని, చంద్రన్నబీమా రాకపోవడం ఏమిటని వారిని ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం కరువైంది.
సంఘమిత్రపై పలు ఆరోపణలు
పేయనపల్లె, మొగరాళ్లపల్లె పంచాయతీలకు సంబంధించి పేయనపల్లె వాసి నాగభూషణం సంఘమిత్రగా వ్యవహరిస్తోంది. సంఘంలోని గ్రూపు సభ్యులకు బ్యాంక్ లోన్ తీసిస్తే మామూళ్లు ఇవ్వాలని, లేకుంటే లోన్‌కూడా తీసివ్వదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో మొగరాళ్లపల్లె పంచాయతీకి కొత్త సంఘమిత్రను ఎంపికచేస్తే ఆమె అధికార బలంతో ఆ పోస్ట్‌ను కూడా తీయించి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తోందనే ఆరోపణ వినిపిస్తోంది. అంతేకాకుండా గతంలో కూడా పసుపు–కుంకుమ డబ్బులను కూడా సభ్యులకు ఇవ్వకుండా స్వాహా చేసిందని డ్వాక్రా మహిళల ఆరోపణ. చంద్రన్న బీమాకు సంబంధించి డబ్బులు స్వాహా చేసి మనిషి బతికుండగానే చనిపోయినట్లు చెప్పి ఇలా చేయడం శోచనీయమని మండిపడుతున్నారు.
విషాదంలో కుటుంబం
ధైర్యనాథన్ మృతితో అతని కుటుంబం వీధిన పడింది. మృతుడికి ప్రియదర్శిని(9వ తరగతి), మాలతి (7వ తరగతి) కుమార్తెలు ఉన్నారు. ధైర్యనాథన్ మృతితో వారి కుటుంబానికి ఆర్థిక సాయంగా చంద్రన్న బీమా కింద రూ.2లక్షలు వస్తుందనుకుంటే సంఘమిత్ర తీరు వలన ఆ కుటుంబ పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment