
రాజోలులో నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచిన సీఐ నాగమోహన్‌రెడ్డి
సాక్షి, కాకినాడ: పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరుకు ఫొటోలు తీయాలని, బంగారు ఆభరణాలు తీసివేసి ఫోటో దిగాలని నమ్మిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మలికిపురం పోలీసులు అరెస్టు చేశారు. రాజోలులో సీఐ నాగమోహనరెడ్డి సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. సఖినేటిపల్లికి చెందిన ఇంజేటి ఆనంద్‌బాబు కొంతకాలంగా పలు చోరీ కేసులలో నిందితుడిగా ఉన్నాడు. మలికిపురం మండలం శంకరగుప్తం, లక్కవరం, విశ్వేశ్వరాయపురం గ్రామాల్లో ఇటీవల పలు చోరీలు జరిగాయి.
ఈ నేపథ్యంలో పోలీసులకు ఆనంద్‌బాబుపై అనుమానం వచ్చింది. గతంలో సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పలు దొంగతనాలకు సంబంధించి అతడు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. తాజా చోరీల నేపథ్యంలో మలికిపురం ఎస్సై కేవీ రామారావు అతడిపై నిఘా పెట్టారు. గుడిమెళ్ళంకలో ఆదివారం ఆనంద్‌బాబు అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఎస్సై అతడిని అరెస్టు చేశారు. అతడి నుంచి సుమారు రూ.2.36 లక్షల విలువైన 65 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
పింఛన్లు, రేషన్ కార్డుల కోసం ఫొటోలు తీయాలని, ఆ సమయంలో శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు తీసివేయాలని, లేకపోతే పింఛన్ పొందేందుకు అర్హత కోల్పోతారని చెబుతూ, వారి నగలను అపహరిస్తున్నాడని సీఐ తెలిపారు. ఒంటరిగా ఉన్న మహిళలకు మాయమాటలు చెప్పి, బంగారు ఆభరణాలు అపహరిస్తున్నట్టు నిందితుడు అంగీకరించాడన్నారు. నిందితుడిని రాజోలు కోర్టుకు తరలిస్తున్నట్టు ఎస్సై చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment