బంజారాహిల్స్: ప్రేమ పేరుతో యువతులకు వలవేసి పెళ్లి చేసుకున్నట్లు మభ్యపెట్టి వారి నుంచి అందినకాడికి దండుకొని మోసాలకు పాల్పడుతున్న యువకుడిపై జూబ్లీహిల్స్‌పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కార్వాన్, మొఘల్‌నగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్ షరీఫ్ అనే యువకుడు ఏడాది క్రితం కావూరిహిల్స్ ఫేజ్–1కు చెందిన యువతిని ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి కూడా చేసుకున్నాడు. అనంతరం ఆమె వద్ద కిలో బంగారం, రూ.10 లక్షల నగదు తీసుకొని జల్సాల కోసం ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. మూడు నెలలుగా ఆమెను వేధించడమేగాక ఇంట్లో నుంచి తరిమివేశాడు. బాధితురాలు అతని వైఖరిపై ఆరా తీయగా అప్పటికే మరో నలుగురు యువతులను ఇదే తరహాలో మోసం చేసి వారి నుంచి బంగారం, నగదు తీసుకున్నట్లు తెలిసింది.
దీంతో ఆమె షరీఫ్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయితే అతను శనివారం రాత్రి బాధితురాలిని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45కు తీసుకువచ్చి కేసు విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. లేని పక్షంలో వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. షరీఫ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment