సాక్షి, చెన్నై: ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ఓటర్లకు తాయిలాల పంపిణీకి వినూత్న మార్గాల్ని అన్వేషించే పనిలో రాజకీయ పక్షాలు ఉన్నట్టుంది. ఇందుకు అద్దం పట్టే రీతిలో కారుడోర్లకు ఉన్న అద్దాల కింది భాగంలో నోట్ల కట్టల్ని ఉంచి మరీ తరలించడం బుధవారం వెలుగు చూసింది. వీసీకే పార్టీకి చెందిన వ్యక్తి కారుగా తేలడం, అందులో రూ. 2.10 కోట్లు పట్టుబడడంతో ఆ నాయకుడిపై ఈసీ గురి పడింది. అలాగే, మదురైలో 47 కేజీల బంగారు, కడలూరులో రూ. ఐదు కోట్లు విలువగల బంగారాన్ని ఎన్నికల వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో హోరెత్తుతోంది. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ఓటర్లకు తాయిలాల పంపిణికీ తగ్గ సరంజామాల్ని సిద్ధం చేసుకునే పనిలో రాజకీయ పక్షాలు ఉన్నాయని చెప్పవచ్చు. వేలూరులో డీఎంకేకు చెందినదిగా భావిస్తున్న కోట్లాది రూపాయలు పట్టుబడిన నేపథ్యంలో ఇతర పార్టీలు జాగ్రత్తల్లో పడ్డట్టున్నాయి.
ఆయా అభ్యర్థులు తమ వద్ద ఉన్న నగదు జాగ్రత్త పరుచుకునేందుకు వినూత్న మార్గాల్ని అన్వేషించే పనిలో పడ్డట్టున్నారు. ఐటీ, ఫ్లయింగ్ స్క్వాడ్‌ల నుంచి తప్పించుకునేందుకు ఎన్ని వ్యూహాలు చేసినా, వినూత్న మార్గాలు అన్వేషించినా, పట్టుబడాలని రాసి పెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు. బుధవారం అరియలూరు మార్గంలో ఓ కారు పయనిస్తుండడంతో ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అనుమానం నెలకొంది. దీంతో ఆ కారును చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఆ కారు ముందు భాగంలో వీసీకే పార్టీ జెండా ఉండడంతో అనుమానాలకు మరింత బలం చేకూరినట్టు అయింది. ఆకారును క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎక్కడ ఒక్క పైసా కూడా చిక్క లేదు.
చివరకు కారు డోర్లకు ఉన్న అద్దాల్ని దించేందుకు ప్రయత్నించగా, అవి కిందికి వెళ్ల లేదు. అద్దాలు జాం అయినట్టుగా అందులో ఉన్న వాళ్లు పేర్కొన్నా, ఫ్లయింగ్ స్క్వాడ్ మాత్రం వదలి పెట్ట లేదు. కావాల్సిన పనిముట్లు తెప్పించి తెరచి చూడగా, అద్దాల కింది భాగంలోకట్టలు కట్టలుగా నోట్లు బయట పడ్డాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం రూ.2.10 కోట్లు పట్టుబడ్టట్టు అధికారులు తేల్చారు. ఈ నగదు తిరుచ్చిలోని వీసీకే పార్టీకి చెందిన ప్రముఖుడిదిగా తేలడంతో ఆ వ్యక్తిని గురి పెట్టారు. ఐటీ వర్గాలు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయి. అరియలూరు వైపుగా ఈ నగదు వెళ్తుండడంతో చిదంబరం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వీసీకే నేత తిరుమావళవన్ కోసమేనా అన్న చర్చ జోరందుకుంది.
మదురైలో బంగారం:
తమకు అందే సమాచారాల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ దూసుకెళ్తోన్నది. బన్రూటిలో జరిపిన తనిఖీల్లో ఓ పంచ లోహ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఓ ఆలయం నుంచి చోరీ చేసి తరలిస్తున్నట్టుగా విచారణలో తేలింది. అలాగే, మదురైలో ఓ వ్యాన్‌లో తనిఖీ చేయగా 47 కేజీల బంగారం బయట పడింది. దీని విలువను లెక్కిస్తున్నారు. కడలూరు సమీపంలోని వేప్పూరులో ఓ వాహనం నుంచి రూ. 5.90 కోట్లు విలువగల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నై పెరంబూరు నియోజకవర్గం పరిధిలోని కొడుంగయూర్ వద్ద ఓ కారులో రూ.4.25 లక్షలు బయట పడింది. అలాగే, పొల్లాచ్చిలో అన్నాడీఎంకే వర్గాలు మహిళలకు నోట్లు పంచేందుకు సిద్ధం చేసిన టోకెన్లను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు.
ఇందుకు తగ్గ ఫిర్యాదుతో కేసు కూడా నమోదు చేశారు. అరంతాంగిలోని డీఎంకే ప్రముఖుడి ఇంట్లో పెద్ద ఎత్తున నగదు ఉన్న సమాచారంతో ఆ ఇంట్లో పోలీసులు , ఫ్లయింగ్ స్క్వాడ్ వర్గాలు తనిఖీలు చేపట్టాయి. చెన్నై థౌజండ్ లైట్స్, అన్నా సాలైలలో జరిపిన తనిఖీల్లో రూ. 75 లక్షలు గల నగలు, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే,రూ. 50 వేలు విలువగల కుంకుమ భరిణలను సైతం స్వాధీనం చేసుకున్న అధికారులు, శ్రీలంకకు చెందిన ఓ యువకుడి వద్ద విచారణ జరుపుతున్నారు.
చెన్నైలో మాత్రం ఇప్పటి వరకు రూ. ఏడు కోట్ల నగదు, 40 కేజీల బంగారం చిక్కినట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, కోయంబత్తూరులో పారిశ్రామిక వేత్తగా ఉన్న జి రమేష్ నేతృత్వంలోని యూనివర్సల్ ట్రేడింగ్ సొల్యూషన్ పేరిట ఉన్న ఓ సంస్థలో ఐటీ వర్గాలు సోదాలు జరిపాయి. ఇక్కడ లెక్కలోకి రాని రూ. 9.83 కోట్లు నగదు బయట పడడం గమనార్హం. పెద్ద ఎత్తున నోట్లు, నగలు బయట పడుతుండడంతో పోలీసులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, ఐటీ వర్గాలు మూకుమ్మడిగా దాడుల్లో దిగడం అభ్యర్థుల్ని బెంబేళెత్తిస్తున్నాయని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment