విజయ భాస్కర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : చెక్‌బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి మల్కాజిగిరి ఫస్ట్ సెషన్స్ కోర్టు కోటి రూపాయల జరిమానా విధించింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో విఫలమవడంతో నిందితుడికి జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. దాంతోపాటు బాధితుడికి అసలు రూ.55 లక్షలు, నష్టపరిహారంగా మరో రూ.20 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. న్యాయవాది టి.నరసింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైనిక్‌పురి నివాసి గూడూరు సంజీవరెడ్డి (సాయి రత్న) వ్యాపార నిమిత్తం సాకేత్ మిథిలాలో నివాసముండే మొగుల్ల విజయభాస్కర్ రెడ్డి (42) కి రూ.55 లక్షలు అప్పుగా ఇచ్చారు. అప్పు తీర్చేందుకు డెక్కన్ గ్రామీణ బ్యాంక్ (ఎస్సార్ నగర్ బ్రాంచ్)కు సంబంధించిన రు.25 లక్షల రూపాయల చెక్కును 2015, నవంబర్ 23న, రూ.30 లక్షల చెక్కును 2015, డిసెంబర్ 1న విజయభాస్కర్ రెడ్డి సంజీవరెడ్డికి ఇచ్చారు. వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయగా ఫెయిల్ అయ్యాయి.
దీంతో సంజీవ రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. పూర్తి విచారణ అనంతరం ఇరువురి వాదనలు విన్న జడ్జి సాంబశివ మంగళవారం తీర్పు వెలువరించారు. నిందితుడు విజయ భాస్కర్ రెడ్డిపై వచ్చిన చెక్‌బౌన్స్ ఆరోపణలు రుజువైనందున రూ.కోటి జరిమానాతోపాటు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, బాధితుడికి అసలు 55 లక్షల రూపాయలతో పాటు 20 లక్షలు నష్టపరిహారం కింద చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు మాసాల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు అనంతరం విజయ భాస్కర్ రెడ్డి ని కుషాయిగూడ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment