అబ్ధుల్ రెహమాన్ (ఫైల్) వివరాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే బలాల
సాక్షి, సిటీబ్యూరో :గోల్కొండ పరిధిలోని కుతుబ్‌షానగర్‌కు చెందిన ఫాతిమా (2) ఇంటి ముందు ఆడుకుంటూ మూతలేని నీటి సంపులో పడి కన్నుమూసింది.
♦ డీడీ కాలనీకి చెందిన చిన్నూ (3) ఆడుకుంటూ బాత్‌రూమ్‌లోకి వెళ్లి నీళ్ల బక్కెట్‌లో పడి చనిపోయింది. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో ఓ ఇంటి వెనుక భాగంలో నిర్మించిన డ్రైనేజ్ గుంతలో పడి రియా (2) అశువులు బాసింది. ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన నిర్లక్ష్యం తాలూకు ఘోరాలు ఇవి.
♦ తాజాగా గురువారం మూసారంబాగ్ డివిజన్ బడా మజీద్ లైన్‌లో షేక్ యాకుబ్ కుమారుడు రెహమాన్›(5) ఆడుకుంటూ సంపులో పడి చనిపోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇలాంటి దుర్ఘటనల్లో కన్ను మూసిన వారంతా లోకం పోడక తెలియని పసిమొగ్గలు... తల్లిదండ్రులు, అధికారుల నిర్లక్ష్యంతో పాటు అనాలోచిత నిర్ణయాల కారణంగా నిత్యం పలువురు మృత్యువాత పడుతున్నారు.
చిన్నారులకు కుతూహలమే...
అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న చిన్నారులకు ప్రతి అంశం పట్ల కుతూహలం, నేర్చుకోవాలని, దగ్గరగా చూడాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయవద్దని పెద్దలు వారిస్తుంటారో... అదే చేసేందుకు వారు ఆసక్తి చూపుతారు. ఇంట్లో ఉన్న వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు నీళ్లు సైతం వీరిని ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. తరచూ వాటి వద్దకు వెళ్లాలని, ఆడుకోవాలని చూస్తుంటారు. వేసవి తాపం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో నీటితొట్టెలు, బక్కెట్లు, సంపులు వీరికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే చిన్నారుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రుల పైనే ఉంది.
దిగువ మధ్య తరగతివారే ఎక్కువ...
ఇటీవల నగరంలో చోటు చేసుకున్న చిన్నారులకు సంబంధించిన అపశృతులను పరిశీలిస్తే ఇలాంటి ఉదంతాలు ఎక్కువగా దిగువ మధ్య తరగతి అంతకంటే కింది స్థాయిలో ఉన్న కుటుంబాల్లోనే జరుగుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. వారిలో విద్యాప్రమాణాలు తక్కువగా ఉండటం, అవసరమైన స్థాయిలో పరిపక్వత లేకపోవడం కూడా పిల్లల పట్ల నిర్లక్ష్యానికి కారణంగా మారుతున్నట్లు చెబుతున్నారు. అలాగని మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లోని చిన్నారులు పూర్తిగా సురక్షితంగా ఉంటున్నారనీ చెప్పలేమని స్పష్టం చేస్తున్నారు. అక్కడే అడపాదడపా అపశృతులు చోటు చేసుకుంటున్నాయని వివరిస్తున్నారు.
మరెన్నో కారణాలు...
‘సంపు’ బాధిత కుటుంబాల్లో అనేకం వలస వచ్చినవే ఉంటున్నాయి. వీరికి స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండకపోవడం, ప్రస్తుతం జరుగుతున్న సంపుల నిర్మాణం, వాటి వల్ల జరిగే ప్రమాదాల తీవ్రత తెలియట్లేదు. ఫలితంగానే చిన్నారుల విషయంలో కాస్త నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీనికితోడు ఇటీవల కాలంలో అన్నీ చిన్న కుటుంబాలే కావడంతో పాకాడే పసి పిల్లల ఆలనాపాలనా, ఇంటి పనులు రెండూ తల్లిదండ్రులే చూసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగానూ పిల్లలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. వీరి కదలికల్ని కనిపెట్టడం, కట్టడి చేయడంలోనూ విఫలం కావడం పూడ్చలేని నష్టాన్ని మిగుల్చుతూ కుటుంబాన్నే దుఃఖసాగరంలో ముంచేస్తోంది. ఇవి చాలవన్నట్లు ప్రభుత్వ యంత్రాంగాల నిర్లక్ష్యమూ చిన్నారుల ఉసురు తీస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో ఉండే గోతులు, సంపులు, నీటి గుంటలు, ఫౌంటేన్లు, ఇంకుడు గుంతల నిర్వహణ, వీటికి సరైన రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక ఓపెన్ నాలాలు, మ్యాన్‌హోళ్ల విషయం వేరే చెప్పాల్సిన పనే లేదు. ఇవన్నీకూడా అపశృతులకు కారణంగా మారుతున్నాయి.
సంపులో పడి బాలుడు మృతి
మలక్‌పేట: సంపులో పడి బాలుడు మృతిచెందిన సంఘటన గురువారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఆయూబ్, శంషాద్ బేగం దంపతులు మూసారంబాగ్ డివిజన్, బడా మజీద్ లైన్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఆయూబ్ అంబర్‌పేటలో తాళాలు రిపేర్ చేస్తు జీవనం సాగిస్తున్నాడు. వారి ఇంటికి ఎదురుగా ఓల్డ్‌మలక్‌పేటకు చెందిన సయ్యద్ అతియా ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో నీటి సంపు ఏర్పాటు చేశాడు. అయితే భవనం చుట్టు ఎలాంటి రక్షణ లేకపోవడంతో సంపుపై మూత బిగించలేదు. ఆయూబ్ కుమారుడు షేక్ అబ్ధుల్ రెహమాన్›(5) గురువారం ఉదయం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సంపులో పడిపోయాడు. అతడి ఆచూకీ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా రహమాన్ ఎదురుగా ఉన్న భవనం నీటి సంపులో తేలియాడుతూ కన్పించాడు. కుటుంబసభ్యులు అతడిని మూసారంబాగ్ చౌరస్తాలోని సేఫ్ చిల్డ్రన్ ఆసుపత్రికి తరలింయగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. దీనిపై సమాచారం అందడంతో ఎమ్మెల్యే అహ్మద్ బలాల, మాజీ కార్పొరేటర్ మహ్మద్ అస్లాం, ఎంఐఎం నాయకులు ఇలియాస్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి సోహేల్, పోలం రవీందర్‌యాదవ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మలక్‌పేటఇన్‌స్పెక్టర్ కేవీ సుబ్బారావు పర్యవేక్షలో ఎస్సై శ్రీనునాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కనీస జాగ్రత్తలు అవసరం
ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా తల్లిదండ్రులు సైతం కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. చిన్నారులు ఇంట్లో, ఇంటి బయట ఆడుకునేప్పుడు వారిపై ఓ కన్నేసి ఉంచాలి. ఎవరికి వారు తమ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు, భవనాలకు సంబంధించిన సంపులు, డ్రైనేజీలు, పిల్లర్ గుంతల విషయంలో జాగ్రత్తగా ఉంటూ అవసరమైతే వాటి యజమానులు, అధికారుల్ని అప్రమత్తం చేయాలి. మూతలేని మ్యాన్‌హోళ్లు, ప్రమాదకరంగా మారిన ఓపెన్ నాలాలు కనిపిస్తేప్రతిఒక్కరూ బాధ్యతగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారమ య్యేలా చూడాలి. – నగర పోలీసు ఉన్నతాధికారి
Comments
Please login to add a commentAdd a comment