ప్రతీకాత్మక చిత్రం
తమిళనాడు, వేలూరు: కాట్పాడికి చెందిన 12 ఏళ్ల ఏడో తరగతి విద్యార్థినికి తల్లిదండ్రులు బలవంతపు పెళ్లి చేశారు. అయితే పెళ్లి ఇష్టం లేని విద్యార్థిని తాళిని తీసి పాఠశాలకు వెళ్లింది. ఈ సంఘటన కాట్పాడిలో చర్చనీయాంశం అయింది. వివరాలు.. విద్యార్థిని అక్కకు సమీప బంధువుతో వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ముందుగా ఇద్దరికి జాతకం చూసేందుకు జ్యోతిష్యుడి వద్దకు వెళ్లారు. పెద్ద కుమార్తె జాతకం బాగాలేదని.. అబ్బాయి జాతకం చిన్న కుమార్తెకు బాగుందని తెలిపారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు చిత్తూరు నుంచి వచ్చిన బంధువుల కుమారుడికి చిన్న కుమార్తెతో వివాహం చేసేందుకు నిర్ణయించారు. తాను చదువుకోవాలని..పెళ్లి ఇష్టం లేదని విద్యార్థిని తెలిపింది.
దీంతో తల్లిదండ్రులు బలవంతంగా చిత్తూరుకు తీసుకెళ్లి ఈ నెల 6న గంగాధరనెల్లూరు మండలం కడపగుంటలో బంధువుల సమక్షంలో పెళ్లి చేశారు. వివాహం అనంతరం ఈ నెల 8న కాట్పాడిలోని బాలిక ఇంటికి వెళ్లారు. విద్యార్థిని తాళిని ఇంటిలో తీసి పెట్టి పాఠశాలకు వెళ్లింది. ఉపాధ్యాయులకు విషయం తెలియడంతో శిశుసంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శిశుసంక్షేమ శాఖ అధికారి దేవేంద్రన్, విరుదంబట్టు పోలీసులు విద్యార్థిని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. బలవంతంగా వివాహం చేసినట్లు తెలియడంతో విద్యార్థినిని కలెక్టర్ షణ్ముగసుందరం ముందు హాజరుపరిచారు. అనంతరం అబ్దుల్లాపురంలోని వసతి గృహంలో చేర్పించారు. బలవంతపు పెళ్లి చేసిన తల్లిదండ్రులు, బంధువులు, పెళ్లి కొడుకుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కలెక్టర్ పోలీసులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment