శిశువును అమ్మకానికి తీసుకొచ్చిన గంగజ్యోతి, ఆమె కూతురు, శిశువు
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో ముక్కుపచ్చలారని పసికందును అమ్మకానికి సిద్ధపడ్డ ఘటన మలుపులు తిరుగుతోంది. శిశువును అమ్మేందుకు తీసుకొచ్చిన మహిళ శిశువు తల్లికాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లా కడెంకు చెందిన పుట్ట గంగజ్యోతికి మహారాష్ట్రకు చెందిన నవీన్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వివాహ అనంతరం వీరు ఆర్మూర్‌లోని బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నారు. నవీన్ స్థానికంగా మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ఒక కూతురు స్నేహ (4) ఉంది. కొన్ని రోజుల క్రితం భర్త నవీన్ గంగజ్యోతిని విడిచి వెళ్లిపోయాడు. దీంతో జ్యోతి యాచిస్తూ జీవనం గడుపుతోంది. ఆదివారం ఉదయం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో నెలరోజులు కూడా నిండని పసికందును రూ.20 వేలకు అమ్మకానికి పెట్టింది. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.
శిశువు జననం గురించి వివరాలు అడిగితే జ్యోతి పొంతనలేని సమాధానాలు చెబుతోంది. శిశువు బహిరంగ ప్రదేశంలో జన్మించిందని ఒకసారి, ఇంట్లోనే జన్మించిందని మరోసారి చెబుతుండటంతో జ్యోతి ఆ శిశువుకు తల్లి కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిశువుకు నెల రోజుల వయస్సు ఉంటుందని జ్యోతి చెబుతుండగా పరీక్షించిన వైద్యులు 11 రోజుల వయస్సుగా నిర్ధారించారు. ఇంతలో ఐసీడీఎస్ అధికారుల ఆధీనంలో ఉన్న శిశువు తమ బిడ్డేనం టూ ఆర్మూర్‌కు చెందిన దంపతులు అధికారులను సం ప్రదించినట్లు తెలిసింది. అధికారులు మాత్రం డీఎన్‌ఏ పరీక్షల అనంతరం శిశువు తల్లిదండ్రుల నిర్ధారణ తర్వాతే వారికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అంత వరకు పసికందును కరీంనగర్‌లోని శిశుగృహ సంరక్షణ కేంద్రానికి, అలాగే జ్యోతి, తన కూతురు స్నేహ(4)ను స్వధార్ కేంద్రానికి తరలించారు. ఐసీడీఎస్ మెట్‌పల్లి సీడీపీవో తిరుమలదేవి, ధర్మపురి సీడీపీవో అరుణ, జిల్లా చైల్డ్ డెవలప్‌మెంట్, ప్రొటెక్షన్ ఆఫీసర్ హరీశ్ ఉన్నారు.
పాప కిడ్నాప్‌పై కేసు
మెట్‌పల్లిలో అమ్మకానికి పెట్టిన పాప కిడ్నాప్‌నకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన గందం సుమలత ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో తన 15 రోజుల పాపను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని సోమవారం ఫిర్యాదు చేసింది. ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. కాగా పాప అమ్మకానికి పెట్టిన గంగజ్యోతి కూడా తనది ఆర్మూర్ అని చెప్పడంతోపాటు ఐసీడీఎస్ అధికారులకు అనుమానాలు కలుగుతున్నాయి. వారి వద్దనున్న పాప, కిడ్నాప్ అయిందన్న పాప ఫొటోలు ఒకేలా ఉండటంతో ఆర్మూర్‌కు చెందిన సుమలత కూతురుగానే భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment