![Child trafficking in East Godavari district Govt Hospitals - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/21/hh.jpg.webp?itok=iEoSSqun)
రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి , నిందితుడు వెంకటసుబ్బారావు
రాజమహేంద్రవరం క్రైం: తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వాస్పత్రులే అడ్డాగా పిల్లల అక్రమ రవాణా సాగుతోందా అంటే.. జరుగుతున్న పరిణామాలు అవుననేలాగానే ఉన్నాయి. ఓ బాలుడి అదృశ్యం వ్యవహారంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి గుత్తుల వెంకటసుబ్బారావు(సుభాష్)ను హైదరాబాద్ చాంద్రాయణగుట్ట (తెలంగాణ) పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనూ కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పసికందు కిడ్నాప్ ఘటన తెలిసిందే.
ఆడుకుంటూనే అదృశ్యం
చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖుబా కాలనీలో నివసిస్తున్న షేక్ ఫజల్‌కు ఇద్దరు కుమారులు. రెండున్నరేళ్ల చిన్న కుమారుడు షేక్ సోఫియన్ మార్చి 25న ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. దీనిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు అదే రోజు కేసు నమోదు చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులు తొలుత రాజమహేంద్రవరం, అక్కడి నుంచి విశాఖపట్నం తిరిగి ఏలూరు ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ సుభాష్‌ను నిందితుల్లో ఒకడిగా గుర్తించారు. ఈ నెల 17న అతడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం హైదరాబాద్ తరలించారు. బాలుడిని అమలాపురంలో రూ.3 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించినట్లు సమాచారం. దీనిపై ఇక్కడి పోలీసులకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు.
ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రి అడ్డాగా పిల్లల అక్రమ రవాణా సాగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో సుభాష్‌కు మరింతమంది ఆస్పత్రి సిబ్బంది సహకరించినట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సుభాష్ పనిచేస్తున్న ల్యాబ్‌లోని కొంతమందిని కూడా పోలీసులు విచారించారు. మరింతమందిని విచారిస్తే పిల్లల అక్రమ రవాణా ముఠాలో ఎంతమంది ఉన్నారో బయటపడే అవకాశాలున్నాయి. గతంలో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పసికందును కిడ్నాప్ చేసిన ఘటన తర్వాత.. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి అడ్డాగా పిల్లల అక్రమ రవాణా సాగుతున్నట్లు వెల్లడి కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
స్థానిక వైద్య సిబ్బంది హస్తం ఉండొచ్చు..
పిల్లల అక్రమ రవాణా వెనుక సుభాష్ ఒక్కడే కాకుండా ఇతర వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంది. మొదటి నుంచీ సుభాష్ వివాదాస్పద వ్యక్తి. ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తూనే గతంలో బయట బ్లడ్ బ్యాంక్ పెట్టి ఇక్కడి రోగులకు రక్త పరీక్షలు బయటే చేసి డబ్బులు తీసుకునేవాడు. దీనిపై ఫిర్యాదు కూడా చేశాం. విచారణ జరిపిన అధికారి అతడికి అనుకూలంగా నివేదిక ఇచ్చారు. దీంతో సుభాష్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రస్తుత ఘటనపై కూడా విచారణ సాగుతోంది.
– డాక్టర్ టి.రమేష్ కిషోర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, తూర్పు గోదావరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment