బీజింగ్: వాడకుండా వదిలేస్తే ఏ వస్తువైనా పనిచేయడం మానేస్తుంది. మనిషి అవయావాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. దీనికి నిదర్శనంగా నిలిచే ఉదంతం చైనాలో జరిగింది. 12 సంవత్సరాల పాటు మూగవాడిగా నటించిన ఓ వ్యక్తి చివరకు నిజంగానే మాట కోల్పోయాడు.
అసలేం జరిగింది...
ఝెజియాంగ్ తూర్పు ప్రావిన్స్‌లోని ఓ గ్రామానికి చెందిన జెంగ్ 33 ఏళ్ల చెంగ్ 2005లో కేవలం 5 వేల రూపాయల అద్దె వివాదంలో తన భార్య తరపు బంధువొకరిని చంపేశాడు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సొంతూరు వదిలిపెట్టి మరో ప్రావిన్స్‌కు పారిపోయాడు. పేరు మార్చుకుని మూగవాడిగా నటిస్తూ ఓ నిర్మాణ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. పెళ్లి చేసుకుని తండ్రి కూడా అయ్యాడు.
ఇలా దొరికాడు..
ఎవరికీ అనుమానం రాకుండా రహస్య జీవితం గడుపుతున్న జెంగ్‌పై పోలీసులు కన్నుపడింది. అతడి దగ్గర ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకపోవడంతో పోలీసుల అనుమానం బలపడింది. దీంతో పోలీసులు గత అక్టోబర్‌లో అతడి రక్త నమూనాలు సేకరించి డీఎన్‌ఏ పరీక్షలకు పంపారు. 12 ఏళ్లుగా పరారీలో ఉన్న ఓ హత్య కేసు నిందితుడి తల్లిదండ్రులతో జెంగ్ డీఎన్‌ఏ సరిపోలింది. బండారం బయటపడటంతో జెంగ్ నేరాన్ని అంగీకరించాడు. 12 ఏళ్లు మూగవాడిగా నటించడంతో మాట కోల్పోయానని అతడు పేపర్‌పై రాసి పోలీసులకు వెల్లడించాడని స్థానిక దినపత్రిక పేర్కొంది. అతడు దోషిగా తేలితే మరణశిక్ష పడే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment