
ఝాంగ్‌పై దాడి చేస్తున్న వాంగ్(సీసీటీవీ దృశ్యాలు)
హాంకాంగ్ : ఐస్ క్రీమ్ తిననివ్వలేదనే మండిపాటు.. లావుగా ఉన్నావంటూ ఎగతాళి చేశాడనే కోపంతో ప్రియుడిపై కత్తెరతో దాడి చేసి చంపిందో యువతి. ఈ సంఘటన చైనాలోని ఝుమాడియాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సెంట్రల్ చైనాలోని ఝుమాడియాన్‌కు చెందిన ఝాంగ్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన వాంగ్ అనే యువతితో 20 రోజుల క్రితం పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి తిరగటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 14వ తేదీన ఇద్దరూ కలిసి షాపింగ్‌కు వెళ్లారు. అక్కడ వాంగ్ తనకు ఐస్ క్రీమ్ కావాలని అడగటంతో ఝాంగ్ ఆమెను ‘‘ అసలే లావుగా ఉన్నావు! నీకు ఐస్ క్రీమ్ అవసరమా?’ అంటూ ఎగతాళి చేశాడు.
దీంతో ఆగ్రహానికి గురైన వాంగ్ దగ్గరలోని షాపులో కత్తెర కొనుగోలు చేసుకుని వచ్చి, దానితో ప్రియుడిపై దాడి చేసింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న ఝాంగ్‌ను గుర్తించిన స్థానికులు అంబులెన్స్‌తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడ్ని ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ ఝాంగ్ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాంగ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment