
పెదవేగి రూరల్, పెదపాడు: మొన్నటి వరకు అధికారదర్పంతో దౌర్జన్యాలకు తెగబడిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా ఎన్నికల్లో తనను ఓడించిన ఓటర్లపై కక్ష తీర్చుకోవడం మొదలుపెట్టాడు. పెదవేగి మండలం జానంపేట వద్ద పోలవరం కుడికాల్వపై రైతులు ఏర్పాటు చేసుకున్న పైపులను చింతమనేని ప్రభాకర్ మాయం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై రైతులు పెదపాడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ పైపులను తన సొంత ఖర్చులతో వేయించానని కొద్దిరోజుల క్రితమే చింతమనేని పట్టుకుపోయే ప్రయత్నం చేయగా రైతులు అడ్డుకున్నారు. సోమవారం రాత్రి తన అనుచరులతో వచ్చి వాటిని తీసుకుపోయారని రైతులు ఆరోపిస్తున్నారు.
మూడేళ్ల క్రితం రైతుల పొలాలకు నీరందించేందుకు పెదవేగి మండలం జానంపేట అక్విడెట్‌కు సమీపంలో పోలవరం కుడికాలువ ఎడమ గట్టు వద్ద పైపులను ఏర్పాటు చేశారు. సుమారు 260 పైపులు ఏర్పాటు చేసి వాటి నుంచి నీటిని దిగువన ఉన్న పొలాలకు వెళ్లే ఏర్పాటు చేశారు. దీని కోసం స్థానిక రైతులు ఎకరానికి వెయ్యి నుంచి రూ.1500ల వరకూ చందాలు వేసుకుని ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో తనను ఓడించారన్న కక్షతో ఈ పైపులను అనుచరులతో తొలగించి తన తోటల్లో వేయించుకున్నారు.
ఈ సమాచారం తెలియడంతో ఆ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అక్కడికి చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు పరిస్థితిని సమీక్షించారు. చింతమనేనిని అరెస్టు చేసి పైపులు రికవరీ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ సీఐ వైవీఎల్ నాయుడు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment