పదిహేనేళ్ల క్రితం మెరైన్ ఇంజినీరింగ్ చదువుకున్న వ్యక్తి జీవితం ఇప్పుడెలా ఉంటుందని అడిగితే విదేశీ కంపెనీల్లో ఉద్యోగం. గగనంలో విహారాలు.. ఆరంకెల జీతం. అని ఠక్కున చెప్పేస్తారు. అదే వ్యక్తి గొడవల్లోకి దిగి ఎవరి కోసమో జీవితం పణంగా పెడితే ఎలా ఉంటుందోనని అడిగితే చిత్తూరుకు చెందిన చింటూను చూపించే పరిస్థితి. హత్య కేసులో జీవిత ఖైదు పడ్డ చింటూ అలియాస్ చంద్రశేఖర్ జీవితం నేటి యువతకు తప్పకుండా ఓ పాఠం నేర్పుతోంది.
విదేశీ ఓడల నుంచి జైలుగోడల వరకు..
చిత్తూరు అర్బన్: చిత్తూరుకు చెందిన చింటూ పదిహేనేళ్ల కిత్రమే మెరైన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యావంతుడు. అప్పటికే షిప్‌యార్డులో ఉద్యోగం రావడంతో ఓడల్లో ఏటా 20కు పైగా దేశాలు తిరుగుతూ చేతినిండా డబ్బులు సంపాదిస్తున్నాడు. 2005లో సొంత మేనమామ కటారి మోహన్‌పై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుని... చివరకు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పై హత్యాయత్నానికి పాల్పడి జైలు పాలయ్యాడు. 2007లో సీకే బాబుపై జరిగిన మందుపాతర దాడి కేసులో రెండో నిందితుడిగా మారిన అత డు.. దాని తరువాత అరెస్టయి బెయిల్‌పై వచ్చి విద్యాసంస్థలు స్థాపించి, యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ... సమాజంలో తనకు ప్రత్యేక గుర్తింపు కావాలనే క్రమంలో రక్త సంబంధీకులతో ఏర్పడ్డ గొడవలు.. అదే రక్తాన్ని కళ్లారా చూడటానికి సైతం వెనుకాడని స్థాయికి చేరుకున్నాయి. ఏ మామ కోసమైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడో ...అదే మామను మట్టుపెట్టాడనే ఆరోపణలపై ఇంకా జైలు జీవితం గడుపతున్నాడు.
నేటితరం మారాలి..
‘రూలింగ్‌లో ఉన్నది మన పార్టీనే. నువ్వు నా వెనుక ఉండు చాలు. నీకేం కావాలో నేను చూసుకుంటా..’ అంటూ పలువురు నాయకులు జిల్లాలోని యువతను పెడదారి పట్టిస్తున్నారు. పొద్దున్నుంచి పొద్దుపోయే వరకు నిరుద్యోగ యువతను వెంట తిప్పుకుని చేతిలో రూ.500 నోటు, ఓ క్వార్టర్ బాటిల్ మందు పెడుతున్నారు. ‘ రేయ్ నువ్వు అన్న దగ్గరకు వచ్చేయ్, అన్న బండిలో పోతుంటే మనం వెనుక స్కూటర్‌లో ఫాలో అవ్వాలి. అన్న కారు దిగితే వెనకే బాడీగార్డుగా ఉండాలి. అన్న చెప్పిన వాడిని తన్నాలి. పోలీసోళ్లే అన్న కాడికి వచ్చి సలాం కొడతారు. మనల్ని ఏమీ చేయరు..’ అనే అధికార పార్టీ నాయకుల మాటలకు నేటితరం యువతలో చాలా మంది బలవుతున్నారు. చింటూ విషయంలో కూడా ఇదే జరిగింది. మాజీ మేయర్ అనురాధ, కటారి దంపతుల హత్య కేసులో చింటూ ఓ పావు మాత్రమే. ఇతన్ని రెచ్చగొట్టి.. పక్కకు తప్పుకున్న టీడీపీ నాయకులు ఎవరనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. తల్లితండ్రుల మాట వినకుండా.. రాజకీయ నాయకుల వద్ద గులాంగిరి చేసి తీరా కేసుల్లో ఇరుక్కున్న తరువాత ఏం జరుగుతుందో చింటూ పయనం నేటితరానికి ఓ గుణపాఠంగా మిగిలింది. చేసిన తప్పుల నుంచి తాత్కాలికంగా నేతలు కాపాడొచ్చు. కానీ అధికారంలోంచి తప్పుకున్న తరువాత నాయకుల వద్ద పనిచేసిన అనుచరులు ఏదో ఒక రోజు ఊచలు లెక్కించక తప్పదు.
రాజకీయం అంటే ఫ్యాక్షనూ కాదు.. ఫ్యాషనూ కాదు
నేటి యువతకు ప్రధానంగా చదువు అవసరం. యువత రాజకీయాల్లోకి కచ్చితంగా రావాల్సిందే. కానీ నాయకుల్ని నమ్ముకుని చట్టవ్యతిరేక పనులు చేయొద్దు. మిమ్మల్ని నిన్న గలీజు పనులకు వాడుకున్నవాడే రేపు నడిరోడ్డులో వదిలేస్తాడని గుర్తుపెట్టుకోండి. రాజకీయం అంటే ఫ్యాక్షన్ కాదు..ఫ్యాషనూ కాదు..తల్లితండ్రులు ఎన్ని కష్టాలుపడి మిమ్మల్ని చదివిస్తున్నారో మరచిపోవద్దు.
– సుబ్బారావు, డీఎస్పీ, చిత్తూరు.
Comments
Please login to add a commentAdd a comment