అనుచరులతో చిట్టిమాము (మధ్యలోని వ్యక్తి) (ఫైల్ ఫొటో)
విశాఖ క్రైం: నగరంలో సంచలనం రేపిన రౌడీషీటర్ ఖాసీం హత్య కేసులో నిందితులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని నగరంలోకి తీసుకొచ్చినట్లు తెలిసింది. హత్యలో ప్రధాన సూత్రధారుడు చిట్టిమాము అని నిర్థారించిన పోలీసులు ఆ ముఠా కదలికలపై దృష్టి సారించారు. ఉభయ గోదావరి, ఖమ్మం జిల్లాల్లో ఉన్నట్లు అనుమానించి 6 బృందాలతో విస్తృతంగా గాలించారు. చివరకు విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆదివారం హత్యలో కీలకమైన ఐదుగురిని అదుపులోకి తీసుకుని నగరానికి తీÜసుకొచ్చినట్లు తెలిసింది. అప్పటి నుంచి వారిని విచారిస్తున్నట్లు సమాచారం.
విశ్వసనీయ సమాచారం మేరకు... హత్యలో మొత్తం 14 మంది పాల్గొన్నట్లు తెలిసింది. వీరిలో ఆరుగురు గురువారం రాత్రి 10.30గంటల సమయంలో ఖాసీంను రోడ్డు మీద కత్తులతో నరికారని, మిగిలిన వారంతా సమీపంలోని తోపుడుబళ్ల వద్ద కాపు కాచారని తెలిసింది. ఆ సమయంలో ఖాసీం తప్పించుకుని ముందుకు వస్తే అక్కడ అంతమొందించేందుకు ముగ్గురు మాటువేశారని, వేరే మార్గంలో తప్పించుకునేందుకు యత్నించినా మట్టుబెట్టేందుకు వీలుగా పక్క రోడ్డులో ముగ్గురు, మరో చోట ఇద్దరు కాపుకాచారని తెలిసింది. చిట్టిమాము సోదరుడితోపాటు అతని ప్రాణ స్నేహితుడు కిరణ్‌ను హతమార్చినప్పటి నుంచి ఖాసీంపై పగ పెంచుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.
కిరణ్ హత్య తర్వాత అతని భార్య చిట్టిమాముకు ఓ ఫిస్టల్ ఇచ్చిందని, ఖాసీం హత్య రోజు కత్తులతో దాడి చేసినప్పటికీ తప్పించుకుంటే ఆ ఫిస్టల్ వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ హత్య వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ హత్యలో కీలకమైన చిట్టిమాముతోపాటు సీతంపేటకు చెందిన వినోద్, రుషికొండకు చెందిన చిట్టి, షణ్ముక, మధుతో కలిపి మొత్తం ఐదుగురు అదుపులో ఉన్నట్లు సమాచారం. వీరందరినీ రెండు రోజుల్లో మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా ఆధ్వర్యంలో డీసీపీ ఫకీరప్ప, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి సారథ్యంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలతో పాటు పలువురు సిబ్బంది నిందితులను పట్టకోవడంలో కీలకపాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment