కరీంనగర్‌లోని భూమయ్య ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ట్రాఫిక్ సీఐ దాసరి భూమయ్య ఏసీబీకి చిక్కారు. గురువారం రంగారెడ్డి జిల్లా తాండూర్‌లో భూమి కొనుగోలుకు వెళ్తుండగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారుల దృష్టికి రావడంతో గత కొన్ని రోజులుగా ఈయనపై నిఘా ఉంచినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆదిలాబాద్ ట్రాఫిక్ సీఐగా ఉన్న ఆయన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఎక్కువగా సెలవులపైనే ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో వివాదాస్పద భూములను కొనుగోలు చేస్తూ వాటిని మళ్లీ విక్రయిస్తూ ఆస్తులు కూడబెడుతున్నట్లు సమాచారం రావడంతోనే ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన భూమయ్య, గతంలో డీసీఆర్‌బీ సీఐగా కూడా పనిచేశారు. ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సరిగా విధులు నిర్వహించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎక్కువగా సంపాదనపైనే దృష్టి సారించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఆయనపై దృష్టిసారించారు. కరీంనగర్‌లోని భూమయ్య ఇంట్లో రాత్రి వరకు సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం పోలీసు వర్గాల్లో కలకలం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment