![CI ramakrishna outrage on elderly - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/3/ci.jpg.webp?itok=4ldAQ3nw)
స్టేషన్ ముందు భైఠాయించిన బా«ధితులతో మాట్లాడుతున్న చిన్నచౌకు సీఐ రామకృష్ణ (ఇన్‌సెట్) బాధితురాలు గౌరమ్మ
కడప అర్బన్ :పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల కఠినంగా వ్యవహరించవద్దని, ప్రజలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అనేక సందర్భాల్లో పోలీసు అధికారులు, సిబ్బందికి సూచిస్తున్నారు. అయితే కొందరు సిబ్బంది తమ తీరును ఏ మాత్రం మార్చుకోనట్లు కనబడుతోంది. కడప చిన్నచౌకు పోలీసుస్టేషన్ సీఐగా పనిచేస్తున్న రామకృష్ణ వైఖరి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో ఓ మైనర్ బాలిక వ్యవహారంలో కూడా సీఐ రామకృష్ణ తమదైన శైలిలో వ్యవహరించడం, మీడియాలో వార్తలకెక్కడం అధికారులనుంచి అక్షింతలు పడడం...తీరు మార్చుకోవాలని హెచ్చరించడం తెలిసిందే.తాజాగా శుక్రవారం జరిగిన సంఘటన ఆయన వ్యవహారశైలికి అద్దం పట్టినట్లుగా తెలుస్తోంది.
♦ ఈ సంఘటనపై బాధితుల కథనం మేరకు... కడప నగరం ప్రకాశ్‌నగర్‌కు చెందిన గౌరమ్మ అనే వృద్ధురాలిపై, కుటుంబ సభ్యులపై స్థల వ్యవహారంలో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో స్థలం వ్యవహారం విషయంలో పోలీసులు జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా తెలిసినప్పటికీ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిని తన చాంబర్‌లో కూర్చోబెట్టుకుని విషయం తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వృద్ధురాలు గౌరమ్మ ప్రకాశ్‌నగర్‌లో నివసిస్తుండగా, ఆమెను, కుటుంబ సభ్యులను సీఐ రామకృష్ణ పిలిపించారు. వచ్చిన వెంటనే ఎలాంటి వివరాలు అడగకుండా వారిని కూర్చోబెట్టకుండా మాట్లాడటంతో అభ్యంతరం తెలిపారు. వృద్ధురాలిని, ఓ మహిళను దుర్బాషలాడి బయటికి వెళ్లిపోవాలని తిట్ల పురాణం అందుకున్నారు. వెంటనే ఆవేదనతో తమను సివిల్ పంచాయతీలో పిలిపించడమే తప్పని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో గౌరమ్మ పెద్దకుమారుడు రమేష్ సీఐ వ్యవహార తీరును ప్రశ్నించగా, అతన్ని కొట్టి చొక్కాను చించి వేసి బయటికి నెట్టివేశారు. దీంతో వారు పూర్తి ఆవేదన చెందారు. సామాన్య ప్రజానీకం వస్తే న్యాయం జరగదా? అని ప్రశ్నించారు. సీఐ క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన వాహనాన్ని కూడా అడ్డుకున్నారు. తమకు ఏమైనా జరిగితే సీఐయే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ సంఘటన వ్యవహారం కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా దృష్టికి వెళ్లింది. వెంటనే కడప నగరంలోని సీఐలు, ఎస్‌ఐలు తమ సిబ్బందితో వెళ్లి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు విధులను నిర్వర్తించారు. ఈ సందర్బంగా బాధితులు గౌరమ్మ, బంధువులు మాట్లాడుతూ సీఐ రామకృష్ణ తమ పట్ల దురుసుగా వ్యవహరించారని, స్థలం వ్యవహారంలో ఏదైనా తప్పు ఉంటే కోర్టులో తేల్చుకుంటామని, మాట్లాడే విధానం తెలియకుండా దుర్బాషలాడటం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకుపోరాటం చేస్తామన్నారు. కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా బాధితులతో, సీఐతో వేర్వేరుగా మాట్లాడి పరిస్థితిని సర్దుమనిపించారు. ఈ సంఘటనపై చిన్నచౌకు సీఐ రామకృష్ణను వివరణ కోరగా తాను వృద్ధురాలినిగానీ, మరెవరినీ గానీ దుర్బాషలాడలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment