సాక్షి, హైదరాబాద్ : ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ, కుమార్‌పల్లికి చెందిన సిద్ధోజు రేవంత్ (32) కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 2013లో అతను మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ షహనాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్లుగా ఇద్దరు శ్రీరాంనగర్ ఏ బ్లాక్‌లో ఉంటున్నారు. ఏడాది క్రితం రేవంత్ భార్యను ఉద్యోగం మన్పించాడు. ప్రతి వారాంతంలో ఎవరి తల్లిదండ్రుల ఇళ్లకు వారు వెళ్లేవారు.
ఈ క్రమంలో శనివారం షహనాజ్ మాదాపూర్‌లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆదివారం రాత్రి తాను ఇంటికి రావడం లేదని భర్తకు మెసేజ్ పెట్టింది. సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా రేవంత్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో ఆమె అత్తమామలు, ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది రేవంత్‌ను పరీక్షించి అతను అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. గచ్చిబౌలి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవని, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment