
హబీబ్ ఉన్నీసా గుర్తింపుకార్డ, శ్రావణి తండ్రి తెగుళ్ల వెంకటేశం, రోదిస్తున్న ఖలీల్ కుటుంబ సభ్యులు
ఇద్దరివీ వేర్వేరు ప్రాంతాలు.. హాస్టల్ గదిలో ఉంటూ చదువుకుంటున్న సందర్భంలో స్నేహం చిగురించింది.. చదువు(క్లాస్)లో హెచ్చుతగ్గులున్నా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వారి మధ్య బంధం గట్టిపడింది. కాలక్రమంలో ఉన్నత చదువు నిమిత్తం దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే తట్టుకోలేకపోయారు.. అయినా ఫోన్‌లో నిత్యం మాట్లాడుకుంటూ ఉపశమనం పొందేవారు. విధి వక్రించడంతో ఓ విద్యార్థినికి అనుకోని ప్రమాదం ఏర్పడితే తట్టుకోలేకపోయింది. ఇక కలిసి ఉండలేమనుకున్నారో.. ఒక్కటిగా చనిపోవాలని నిర్ణయించుకున్నారో.. తెలియదు కానీ.. ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. నల్లగొండలోని పానగల్ చెరువుకట్ట సమీపంలో ఆ ఇద్దరి విద్యార్థినుల వస్తువులు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు చెరువులో గాలించినా వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆ.. ఇద్దరు ఏమయ్యారన్నది మిస్టరీగా మారింది. పోలీసులు, విద్యార్థినుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
నల్లగొండ క్రైం : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామానికి చెందిన తెగుళ్ల వెంకటేశం రెండో కుమార్తె ప్రస్తుతం శ్రావణి(17) హైదరాబాద్‌లోని బీఎన్ రెడ్డి కాలనీలో కృష్ణవేణి ఉమెన్స్ జూనియర్ కళాశాలలో హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్(పాత మహబూబ్‌నగర్ జిల్లా)కు చెందిన చికెన్, రియల్ ఎస్టే ట్, ఆర్‌ఎంపీ వైద్య వృత్తి చేస్తున్న ఎంఏ. ఖలీల్ ప్రథమ కుమార్తె హబీబ్ ఉన్నీసా అదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న సమయంలో ఇద్దరూ కలిసి ఒకే రూంలో ఉండే వారు.
ఒకే కళా శాల కావడం, జూనియర్ శ్రావణి, ఉన్నీసా రూం మెట్స్ కావడంతో ఇద్దరి మధ్య విడదీయలేని స్నేహబంధం ఏర్పడింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక గంటల కొద్దీ ఫోన్ సంభాషణ ఉండేది. ఇద్దరి తల్లిదండ్రులు ఫోన్‌లు ఎక్కువగా మాట్లాడుకోవద్దని, బాగా చదువుకోవాలని నచ్చజెప్పారు. ప్రస్తుతం ఉన్నీసా నల్లగొండలోని వెంకటేశ్వర కళాశాలలో టీటీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. దీంతో ఇద్దరి మధ్య నేరుగా కలుసుకోవడానికి గ్యాప్ ఏర్పడడంతో ఉండలేకపోయారు. నాలుగు నెలల క్రితం ఉన్నీసా కళాశాలకు వెళ్తుండడంతో జారి పడడంతో రక్తనాళాల్లో మెదడు గడ్డకట్టింది. దీంతో మరింత ఆందోళనకు లోనైంది.
అసలేంజరిగిందంటే....
పది రోజుల క్రితం కళాశాల నుంచి చౌటుప్పల్ వచ్చిన శ్రావణి శుక్రవారం కళాశాలలో ల్యాబ్ ఉందని, నెట్ సెంటర్ వద్దకు తీసుకెళ్లాలని తండ్రి వెంకటేశాన్ని కోరడంతో నెట్ సెంటర్ వద్ద శ్రావణిని వదిలి వెళ్లాడు. కొద్దిసేపు నెట్ సెంటర్‌లో ఉన్న శ్రావణి చౌటుప్పల్ బస్టాండ్‌లో బస్ ఎక్కి నల్లగొండకు వచ్చి, చిన్న వెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్ సమీపంలోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న ఉన్నీసా వద్దకు చేరుకుంది. శ్రావణి నల్లగొండకు వచ్చే ముందు ఇంట్లో సూసైడ్ నోట్ రాసిపెట్టింది. ఉన్నీసా లేని జీవితం గడపలేనని అనారోగ్యంగా ఉంటుందని, చదవలేకపోతున్నానంటూ సూసైడ్ నోట్‌లో రాసి ఉంది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వెళ్లిన శ్రావణి తండ్రి వెంకటేశం సూసైడ్ నోట్‌ను చూసి చౌటుప్పల్ పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చాడు.
పోలీసులు సీసీ కెమెరాను పరిశీలించి బస్టాండ్‌లోకి వెళ్తున్న విషయాన్ని గుర్తించి తెలిపారు. వెంటనే శ్రావణితండ్రి వెంకటేశం ఉన్నీసా తండ్రి ఖలీల్‌కు ఫోన్ చేసి సూసైడ్ నోట్ విషయాన్ని తెలిపాడు. ఉన్నీసా ఉంటున్న హాస్టల్‌వద్దకు వెళ్లి శ్రావణి వచ్చిందేమో తెలుసుకోమని మీర్‌బా కాలనీలో ఉంటున్న ఉన్నీసా బంధువులకు ఫోన్ చేసి చెప్పడంతో హస్టల్‌కు వెళ్లి వాకబు చేయగా 12.30 గంటల సమయంలో ఇద్దరూ కలిసి బ్యాగ్ తీసుకొని వెళ్లినట్లు హాస్టల్ వద్ద ఉన్న వారు తెలపడంతో ఖలీల్‌కు విషయం చెప్పారు. ఇద్దరూ కలిసి వెళ్లినట్లు ఖలీల్ శ్రావణి తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో పాటు ఉన్నీసా ఆచూకీని కనుక్కోవాలని నల్లగొండలోని బంధువులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చి నల్లగొండకు చేరుకున్నాడు. రెండు కుటుంబాల వారు నల్లగొండకు వచ్చేలోపే పానగల్ ఉదయ సముద్రం చెరువుకట్ట లోపల బ్యాగ్, ఇద్దరికీ సంబంధించిన చెప్పులు, చున్నీలు ఉండడంతో పాటు ఉన్నీసా కళాశాల ఐడీ కార్డు లభించింది. కీచైన్‌పై ఇద్దరి పేర్లు రాసి ఉండడం వారి ఇద్దరి మధ్య బలమైన స్నేహ సంబం«ధం ఉందని భావిస్తున్నారు.
గాలించిన పోలీసులు... నీటి విడుదల
చెరువు కట్ట లోపల సూసైడ్ నోట్, ఇద్దరి విద్యార్థుల చెప్పులు, దుస్తులు లభించడంతో పోలీసులు చెరువు లోపల ఈతగాళ్లతో గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. తూము సమీపంలోనే నీటిలోకి దూకి ఉంటారని భావించిన పోలీ సులు తూము మధ్యలో చిక్కుకొని ఉంటారని, నీటిని విడుదల చేసినప్పటికీ ప్రయోజనం లేదు. చీకటి పడే వరకు పోలీసులు చేపట్టిన చర్యలేవీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఉన్నీసా వినియోగిస్తున్న ఫోన్ కాల్ డేటాను ఆధారంగా మరో కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇద్దరి మధ్య స్నేహం, విడిగా ఉండలేక అనారోగ్యం.. కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డీఎస్పీ గంగారాం, సీఐ భాషా, ఎస్సై నర్సింహులు ఘటన స్థలంలో విద్యార్థినుల ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శుక్రవారం ఆచూకీ కోసం గజ ఈతగాళ్లను రప్పిస్తామని పోలీసులు తెలిపారు.
ఉన్నీసా సూసైడ్ నోట్‌లో ఇది....
ఉన్నీసా మూడు పేజీల సూసైడ్ నోట్ రాసిం ది. చిన్న ప్రమాదం జరిగిందని, తలలో బ్లడ్ క్లాట్ అయిందని, అందుకు రూ.20లక్షల వైద్య ఖర్చు అవుతుందని, నా బెస్ట్ ఫ్రెండ్ శ్రావణి లేకుండా ఉండలేకపోతున్నానని, సంతోషంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, నా గురించి దిగులు చెందవద్దని, సూసైడ్ నోట్‌లో పేర్కొం ది. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లు రాసి సంతోషంగా ఉండాలని కోరింది.
ఇదే చివరి రోజు....
తన జీవితానికి ఇదే చివరి రోజు అని, ఉన్నీసాతో మాట్లాడడాన్ని కుటుంబ సభ్యులు అనుమానించారని, తల్లి కన్నీరు పెట్టిందని, కులం భావన ఉండకూడదని, నా మృతదేహం దొరకకుండా చనిపోయే విధంగా ఆత్మహత్యకు ప్లాన్ చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. కాలేజీ లోనే చనిపోవాలని భావించినప్పటికీ కుటుంబ సభ్యులందరినీ ఒకసారి చూడాలని ఉందని అందుకే ఈ రోజు చనిపోతున్నట్లు పేర్కొంది. ఆరోగ్యం కూడా బాగుండడం లేదని, కుటుంబానికి తలవంపులు తెచ్చే పని తాను చెయ్యనప్పటికీ ఉన్నీసాతో మాట్లాడే ఫోన్‌ను అనుమానించారని, అందరూ సంతోషంగా ఉండండి అంటూ మూడు పేజీల సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment