కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో అలజడి రేగింది. గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) చీఫ్ బిమల్ గురుంగ్ మద్దతుదారులు జరిపిన కాల్పుల్లో ఒక ఎస్సై చనిపోగా, నలుగురు పోలీసులు గాయపడ్డారు. ఓ అటవీ ప్రాంతంలో గురుంగ్ దాక్కున్నాడన్న సమాచారంతో పోలీసులు శుక్రవారం అక్కడికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. మృతిచెందిన ఎస్సైని అమితవ్ ముల్లిక్‌గా గుర్తించారు. పోలీసుల కాల్పుల్లో తమ మద్దతుదారులు ముగ్గురు చనిపోయారని జీజేఎం ప్రకటించింది.
అదనపు డీజీపీ అనూజ్ శర్మ కోల్‌కతాలో వివరాలు వెల్లడిస్తూ...గురుంగ్ తన అనుచరులతో కలసి పాట్లిబస్ అటవీ ప్రాంతంలో దాక్కున్నాడన్న సమాచారం తమకు అందిందని చెప్పారు. వేకువజామున వారి స్థావరంపై సోదాలకు దిగిన పోలీసులపై గురుంగ్ అనుచరులు కాల్పులు జరిపారని తెలిపారు. సంఘటనా స్థలి నుంచి ఆరు ఏకే–47 తుపాకులు, 500 రౌండ్ల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment