దొడ్డబళ్లాపురం: మూడు వివాహాలు చేసుకుని మహిళలను మోసం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చచర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు డీవైఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేసిన సంఘటన చెన్నపట్టణ పట్టణంలో చోటుచేసుకుంది. చెన్నపట్టణ తాలూకా అంబాడరహళ్లికి చెందిన ఒక వ్యక్తి భార్యలకు తెలియకుండా ఏకంగా మూడు వివాహాలు చేసుకుని మోసం చేశాడు. ఇందుకు సంబంధించి మహిళా సంఘం వారు గత ఏప్రిల్ నెలలో చెన్నపట్టణ గ్రామీణ పోలీస్‌స్టేషన్ లో నిత్య పెళ్లికొడుకుపై ఫిర్యాదు చేసారు.
అయితే అప్పుడు పోలీసులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడం వల్ల కేసు గురించి శ్రద్ధ తీసుకోలేదు. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఎన్నికలు ముగిసాక అనేకసార్లు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో స్వరాజ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో ఉన్న డీవైఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండు చేశారు. పోలీసులు మాత్రం సదరు వ్యక్తి ముగ్గురు భార్యలతో అన్యోన్యంగా సంసారం చేస్తున్నాడని చెబుతున్నారు. మహిళా సంఘం వారు ఇందుకు వివరణ ఇస్తూ మీడియా ముందుకు రావడం ఇష్టంలేక ధర్నాలో పాల్గొనలేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇలా అయితే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment