
ప్రతీకాత్మక చిత్రం
పుత్తూరు: ఒక యువకుడు ఇంటి కిటికీ పక్కన మూత్ర విసర్జన చేయడంతో రేగిన వివాదం ఇరువర్గాల మధ్య దాడులకు దారి తీసింది. దీంతో పుత్తూరు పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్‌ఐ హనుమంతప్ప కథనం మేరకు.. పట్టణంలోని రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్న గాంగ్‌మాన్ వేలాయుధం ఇంటి కిటికీ పక్కన గుర్తు తెలియని యువకుడు గురువారం మధ్యాహ్నం మూత్రవిసర్జన చేశాడు. దీనిపై వేలాయుధం కుటుంబ సభ్యులతోపాటు చుట్టు పక్కల కాపురముంటున్న వారు ఆ యువకుడిని నిలదీశారు. మాటామాటా పెరగడంతో యువకుడికి వేలాయుధం దేహశుద్ధి చేశాడు. కొంత సేపటి తరువాత ఆ యువకుడు పట్టణంలోని దళితవాడకు చెందిన కొందరు వ్యక్తులతో కలిసి వచ్చి వేలాయుధం ఇంటిపై దాడి చేశాడు.
ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు వేలాయుధంతోపాటు ఆయన భార్యపై భౌతిక దాడికి దిగారు. వేలాయుధంకు స్వల్ప గాయాలు కాగా భార్య తీవ్రంగా గాయపడింది. ఆమె తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతోంది. వేలాయుధం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ విషయమై శుక్రవారం ఉదయం వేలాయుధంకు మద్దతుగా రైల్వే సిబ్బంది వచ్చారు. మరో వైపు పుత్తూరు దళితవాడకు చెందిన వ్యక్తులు పోలీస్‌స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment