బంజారాహిల్స్: తనతో పాటు తన భర్తను కిడ్నాప్ చేసి వివిధ ప్రాంతాల్లో తిప్పి చంపేస్తానని బెదిరించి ఆస్తి పత్రాలు రాయించుకోవడానికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు 13 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 8లో హెయిర్ అండ్ సిల్క్ ఫ్యాక్టరీ పేరుతో కొనసాగుతున్న సంస్థకు రామానుజం సత్యవేణి క్లినిక్ మేనేజర్‌గా పని చేసేది. ఆమె భర్త జోనల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించేవాడు. అయతే సదరు కార్యాలయంలో అడుగడుగునా మోసాలు జరుగుతుండటంతో ఆమె తన భర్తతో పాటు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. దీంతో విశాఖజిల్లా, పెందుర్తి మండలం కృష్ణరాయపురంలోని తన స్వగ్రామానికి వెళ్లిన సత్యవేణి, ఆమె భర్తను గత ఏప్రిల్ 15న సదరు సంస్థ ఎండి రాజారాం, షౌకత్, నందకుమార్, అమీర్ బలవంతంగా హైదరాబాద్‌కు తీసుకువచ్చి పలు ప్రాంతాల్లో తిప్పారు. అనంతరం బెంగళూరు తీసుకెళ్లిన వారు ఆమెను బెదిరించి ఆస్తి పత్రాలు రాయించుకోవడానికి యత్నించారు. లేకపోతే హత్య చేసి అవుటర్ రింగ్‌రోడ్డుపై పడేసి సూసైడ్ చేసుకున్నారని నమ్మిస్తామని బెదిరించారు. ఆమె తల్లిదండ్రులను కూడా బెదిరించారు. అక్షత్, సూర్య అనే వ్యక్తులతో పాటు మరో ఏడుగురు తమను హింసించినట్లు తెలిపారు. వారి భారి నుంచి తప్పించుకున్న వీరు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు ఆదివారం బదిలీ చేశారు. ఎస్‌ఐ రామిరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment