
అహ్మద్‌నగర్ : పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహ బంధంతో ఒక్కటైన ఓ జంటకు వారి కుటుంబ సభ్యులు నిప్పుపెట్టిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కాలిన గాయాలతో మహిళ పూణే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, 40 శాతం కాలిన గాయాలతో బాధిత వ్యక్తి మృత్యువుతో పోరాడుతున్నాడని పోలీసులు తెలిపారు. వేర్వేరు కులాలకు చెందిన మంగేష్ చంద్రకాంత్, రుక్మిణిలు పెళ్లి చేసుకోవడంతో ఆగ్రహించిన యువతి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు వారికి నిప్పంటించారు. అహ్మద్‌నగర్ జిల్లా నిగోజ్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెప్పారు.
భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న మంగేష్, రుక్మిణిని గత ఏడాది నవంబర్‌లో ఆమె తల్లితండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాడు. ఏప్రిల్ 28న ఆమె తమ తల్లితండ్రులను కలుసుకునేందుకు నిగోజ్ గ్రామానికి రాగా, మే 1న ఆమెను తీసుకువెళ్లేందుకు మంగేష్ అక్కడికి చేరుకున్నారు. దీంతో యువతి తండ్రి రమా భారతీయ, ఆమె మేనమామ ఘన్‌శ్యామ్ ఇతర కుటుంబ సభ్యులు వారిని ఓ గదిలో బంధించి నిప్పుపెట్టారు. వారి అరుపులు విన్న స్ధానికులు వారిని ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment