ఎస్‌ఐ వేధింపులు తట్టుకోలేక ఆత్యహత్యకు పాల్పడిన నాగలక్ష్మి
వినుకొండ రూరల్: ఎస్‌ఐ వేధింపులు తట్టుకోలేక భార్యభర్తలు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం గుంటూరు జిల్లా మదమంచిపాడులో జరిగింది. బాధితుల కథనం మేరకు.. శావల్యాపురం మండలం మతుకుమల్లికి చెందిన రామిశెట్టి శ్రీనివాసరావు కొద్దికాలం కిందట అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో గొడవ పడ్డాడు. దీంతో అతను శ్రీనివాసరావుపై శావల్యాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట శ్రీనివాసరావును ఎస్‌ఐ సురేశ్ స్టేషన్‌కు పిలిపించాడు.
అతనిపై చేయి చేసుకొని, దుర్భాషలాడారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు సోమవారం ఉదయం భార్య నాగలక్ష్మిని తీసుకొని కారులో వినుకొండకు వెళ్లాడు. అక్కడి ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పిల్లలను చూసుకున్న అనంతరం కారులో మదమంచిపాడుకు వెళ్లారు. అక్కడి ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో దంపతులిద్దరూ పురుగు మందు తాగారు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే వారి బంధువులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకొని శ్రీనివాసరావు, నాగలక్ష్మిని వినుకొండ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. వైఎస్సార్‌సీపీ వినుకొండ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఆస్పత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. పోలీసుల తీరుపై విచారణ చేపట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment