విద్యుత్ స్తంభంపై షాక్‌కు గురైన మహిపాల్
కొడంగల్ రూరల్: గ్రామంలో విద్యుత్ సమస్యలతో సతమతమవుతున్నామని తెలిపినా సరఫరాను పునరుద్ధరించడంలో విద్యుత్ శాఖాధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఓ వ్యక్తికి షాక్ తగిలి జిల్లా ఆస్పత్రికి తరలించిన సంఘటన శుక్రవారం చోటుచేసుకొంది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు..
మండల పరిధిలోని రుద్రారం అనుబంధ గ్రామం పాటిమీదిపల్లిలో గురువారం ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో శుక్రవారం సంబంధిత లైన్‌మెన్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. నాకు రావడం కుదరదు.. నేను ఎల్‌సీ ఇస్తాను, నీవు సరిచేయాలని లైన్‌మెన్ చెప్పాడు.
గ్రామానికి చెందిన మహిపాల్ విద్యుత్ స్తంభం ఎక్కి సరిచేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో మహిపాల్ స్తంభంపైనే విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనిస్తున్న స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరాను తొలగించి మహిపాల్‌ను విద్యుత్ స్తంభం పైనుండి చాలా శ్రమపడుతూ కిందకు దించారు.
తీవ్రగాయాలైన మహిపాల్‌ను 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు కారణమైన విద్యుత్ శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment