
భగపత్ (యూపీ) : తమ రాష్ట్రంలోని నేరాలను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసులకు సర్వహక్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నేరాన్ని నివారించడం కోసం వారు ఎలాంటి మార్గాన్నైనా అనుసరించవచ్చని, అంతిమంగా ఫలితం మాత్రం కనిపించాలంటూ ఆయన ఆదేశాలు చేసినట్లు తాజాగా జరుగుతున్న సంఘటనల ఆధారంగా తెలుస్తోంది. పలువురు నేరస్తులను పట్టుకునే క్రమంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటి వరకు గత మార్చి 2017 నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,142 ఎన్ కౌంటర్లు నిర్వహించగా అందులో 34మంది చనిపోయారని, దాదాపు 260మందికిపైగా నేరగాళ్లు గాయపడ్డారని రికార్డులు చెబుతున్నాయి. అయితే, నేరగాళ్లు చేతికి దొరికినా, తప్పులు అంగీకరించినా కూడా వారిని ఎన్‌కౌంటర్ పేరుతో చంపేస్తున్నారని నేరస్తులుగా పేరున్న వారి కుటుంబాల సభ్యులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్ 3న భగపత్‌లో సుమిత్ గుర్జార్ అనే నేరస్తుడు పోలీసుల చేతుల్లో హతమయ్యాడు.
అతడు తుపాకి ఫైరింగ్ చేయడంతోనే తాము కాల్చామంటూ పోలీసులు చెబుతున్నారు. అయితే, అతడి సోదరుడు ప్రవీణ్ సింగ్ మాత్రం పోలీసులు ఇంటికి వచ్చి తన సోదరుడిని పట్టుకెళ్లారని, దారుణంగా చిత్రవద చేసి చంపారని ఆరోపించాడు. అతడి పక్కటెముకలు విరిచేశారని, ఛాతీని చిద్రం చేశారని, చేతులు కాళ్లు కూడా విరిచి ఎన్‌కౌంటర్ చేశారంటూ వాపోతూ మానవ హక్కుల కమిషన్‌కు వెళ్లారు. అయితే, తమపై దర్యాప్తు ఆపించకపోతే అందరినీ జైలులో వేస్తామంటూ పోలీసులు వారిపై ఎనిమిది కేసులు పెట్టి స్టేషన్‌కు పిలిచి బెదిరిస్తున్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థ కూడా ఆయా స్టేషన్ల చుట్టూ తిరిగి అక్కడి ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. దాదాపు అన్ని స్టేషన్‌లలో కూడా 'కట్ కాపీ పేస్ట్' అన్నట్లుగా రికార్డులు ఉన్నాయని తెలిసింది. అన్ని రికార్డుల్లో కూడా 'నేరస్తుడు తన సహచరుడితో కలిసి బైక్‌పై వెళుతూ మాపై కాల్పులు జరిపాడు. దీంతో తాము ఆత్మ రక్షణ కోసం తిరిగి ఫైరింగ్ చేశాం' అనే వాక్యాలే దాదాపు అన్ని చోట్ల ఉండటంతో మీడియా ప్రతినిధులు కూడా అవాక్కయ్యారు. మొత్తానికి నేరాలను తగ్గించేందుకు యోగి పోలీసులతో చేయిస్తున్న పనులు కాస్తంత కఠినంగానే ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment