మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్
కడప కోటిరెడ్డి సర్కిల్: తాము ఫలానా విభాగానికి చెందిన అధికారులమంటూ పలువురికి ఫోన్ చేసి మాయమాటలతో బురిడీ కొట్టించి వారి బ్యాంకు ఖాతాలోని సొమ్మును డ్రా చేసుకునే సైబర్ నేరగాళ్లను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ హెచ్చరించారు. బుధవారం కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఇటీవల మైదుకూరు పట్టణానికి చెందిన గిద్దలూరు ఉమాదేవికి అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను ఎల్‌ఐసీ అధికారినని మీకు ఎల్‌ఐసీ నుంచి బోనస్‌గా కొంతమేర డబ్బులు వచ్చాయని, వాటిని చెక్ రూపంలో పంపించామని, మీరు ఇంటి వద్ద లేకపోవడంతో తమ ఆఫీసుకు తిరిగి వచ్చిందని చెప్పాడు. మీరు ఒప్పుకుంటే మీ ఖాతాకు డబ్బు పంపుతామని నమ్మబలికాడు. ఈ మేరకు సదరు మహిళకు చెందిన ఏటీఎం నంబరు వివరాలు చెబితే వెంటనే డబ్బులు జమ చేస్తామని అతను చెప్పాడు. దీంతో ఆమె అందుకు అంగీకరించి ఏటీఎం నంబరు చెప్పింది. ఆ వెంటనే ఆమె ఫోన్‌కు వచ్చిన ఓటీపీని కూడా అపరిచిత వ్యక్తికి చెప్పేసింది. దీంతో క్షణాల్లో ఆమె ఖాతా నుంచి రూ.10వేలు డ్రా చేసినట్లు ఆమె మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. ఆమె వెంటనే వివరాలు అడిగిన వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తప్పని పరిస్థితుల్లో బాధితురాలు గత నెల 31వ తేదీన మైదుకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడు చేసిన ఫోన్ నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుడు మైదుకూరుకు చెందిన వీరనాగయ్యగా కడప సైబర్ క్రైమ్ స్టేషన్‌వారు గుర్తించారు.
తీగ లాగితే..
వీరనాగయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా 2017లో మైదుకూరు పాతపాలెంకు చెందిన శివ అనే వ్యక్తి పరిచయమై ఢిల్లీలో కాల్ సెంటర్ ఉద్యోగం ఇప్పిస్తామని నెలకు రూ.13000 జీతంతోపాటు ఉచిత నివాసం, భోజన సదుపాయం ఉంటుందని చెప్పి వీరనాగయ్యతో పాటు వనిపెంటకు చెందిన మురళి యాదవ్, ఆళ్లగడ్డకు చెందిన రవి, గిద్దలూరుకు చెందిన రమణలను ఢిల్లీకి తీసుకెళ్లాడు. ధనలక్ష్మీ యంత్రం, కాలేయ సమస్యల నివారణకు ఆయుర్వేద మందులను ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మొబైల్ వినియోగదారుల సమాచారాన్ని సేకరించి ఢిల్లీకి చెందిన సుమిత బన్సాలి, శివరా త్రి కార్తీక్, నరాల కార్తీక్‌లకు ఇచ్చే వారు. మైదుకూరు కేంద్రంగా సైబర్ నేరగాళ్లు ఢిల్లీకి సమాచారం పంపుతూ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ఎల్‌ఐసీ పాలసీదారులు, రైతులను మోసగిస్తూ సులభంగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న నలుగురు నిందితులను ముందే అరెస్టు చేసిన పోలీసులు ఢిల్లీకి వెళ్లి సుమిత బన్సాలి, శివరాత్రి కార్తీక్, నరాల కార్తీక్ అనే నేరగాళ్లను అరెస్టు చేసి కడపకు తీసుకువచ్చారు. నిందితుల మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, లాప్‌టాప్‌లు సీజ్ చేశామని ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో మైదుకూరు, కడప సైబర్ స్టేషన్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment