సాక్షి, సిటీబ్యూరో : ఎస్సెమ్మెస్, ఈ– మెయిల్, ఫోన్‌కాల్... ఇలా ఏదో ఒక రకంగాఎర వేసి అందినకాడికి దండుకున్న సైబర్ నేరగాళ్లు నగరంలోనానాటికీ రెచ్చిపోతున్నారు. వీటికి తోడు ఈ– కామర్స్ సైట్స్ వేదికగానూ బరి తెగిస్తున్నారు. గడచిన వారం రోజుల్లో వివిధ రకాలైన నేరాల్లో మోసపోయిన ఆరుగురు బాధితులు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. వీటిపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుల్ని కొలిక్కి తేవడానికి ప్రయత్నిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితులు వాడిన ఫోన్ నంబర్లు, బాధితులు డబ్బు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగాముందుకు వెళ్తున్నారు.
ఉద్యోగం పేరుతో రూ.2.24 లక్షలు..
గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ అమీర్ ఖాన్‌కు ఈ ఏడాది ఏప్రిల్ 24న మోర్గాన్ అనే వ్యక్తి నుంచి ఈ– మెయిల్ వచ్చింది. లండన్‌లోని ఫెలియో సూపర్‌మార్కెట్ కంపెనీలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ అందులో ఉంది. ఆసక్తి ఉండే బయోడేటాతో పాటు దరఖాస్తు పత్రాన్నీ పంపాలని కోరడంతో అమీర్ అలాగే చేశాడు. ఇదే నెల 30 మరో ఈ–మెయిల్ పంపిన మోర్గాన్.. ఉద్యోగానికి ఎంపికైనట్లు, వీసా ప్రాసెసింగ్ ప్రారంభించాలని స్పష్టం చేశాడు. కెల్విన్ లారెన్స్ ఆ వ్యవహారాలు పర్యవేక్షిస్తాడంటూ అతడి ఫోన్‌నంబర్ అందించాడు. దీంతో అమీర్ కెల్విన్‌ను సంప్రదించగా ప్రాసెసింగ్ ఫీజుగా రూ.2.24 లక్షల్ని బ్యాంకు ఖాతాల్లో వేయమని చెప్పి డిపాజిట్ చేయించుకున్నాడు. మరో ఖాతాలో ఇంకో రూ.40 వేలు డిపాజిట్ చేయించుకున్నాడు. ఆపై వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.
కెమెరా ఎర చూపించి రూ.22 వేలు...
అంబర్‌పేట వాసి యు.దీపక్ కార్పెంటర్. ఓఎల్‌ఎక్స్‌లో వచ్చిన ఓ ప్రకటనను ఇతడి ఆకర్షితుడయ్యాడు. ఓ హైఎండ్ డిజిటల్ కెమెరాను రూ.80 వేలకే అమ్ముతున్నట్లు అందులో ఉంది. దీనికి ఆకర్షితుడైన దీపక్ ప్రకటనలో ఉన్న నంబర్‌ను సంప్రదించాడు. ఎన్‌పీ బాలాజీ పేరుతో మాట్లాడిన అవతలి వ్యక్తి అడ్వాన్స్‌గా రూ.22 వేలు చెన్నైకి చెందిన ఐడీబీఐ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయించుకున్నాడు. మిగిలిన మొత్తం కెమెరా డెలివరీ అయ్యాక ఇవ్వచ్చని చెప్పాడు. డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత కొన్నాళ్లు ఎదురు చూసినా కెమెరా రాకపోవడంతో మోసపోయానని గుర్తించిన దీపక్ ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బహుమతిపేరుతో రూ.96 వేలు హాంఫట్..
నాంపల్లికి చెందిన బి.రూపేష్‌కుమార్ ప్రైవేట్ ఉద్యోగి. ఇతడికి కొన్నా క్రితం రోహిత్ కుమార్ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. క్రాఫ్ట్ అవార్డ్స్ సంస్థ తరఫున రూ.12.8 లక్షల విలువైన కారు బహుమతిగా వచ్చిందంటూ చెప్పారు. కేవలం రూ.7,840 చెల్లిస్తే కారు వచ్చేస్తుందంటూ చెప్పి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నాడు. ఆపై రకరకాల పేర్లు చెప్పి వివిధ దఫాల్లో మొత్తం రూ.95,940 స్వాహా చేశారు. మళ్లీ కాల్ చేసిన కేటుగాళ్లు మరో రూ.62 వేలు డిమాండ్ చేయడంతో రూపేష్‌కు అనుమానం వచ్చింది. ఆయన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది.
కేబీసీ పేరిటమహిళ నుంచి..
చాంద్రాయణగుట్టకు చెందిన జుబేదా గృహిణి. ఈ నెల 1న ఆమెకు ‘+92’తో ప్రారంభమయ్యే నంబర్ నుంచి ఓ ఎస్సెమ్మెస్ వచ్చింది. ఆపై ఫోన్ చేసిన వ్యక్తి కేబీసీ సంస్థ నుంచి మాట్లాడుతున్నానంటూ విజయ్‌కుమార్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆపై తమ సంస్థ నిర్వహించిన లాటరీలో రూ.25 లక్షల బహుమతి వచ్చిందని చెప్పాడు. ఈ మాటలు జుబేదా నమ్మడంతో అసలు కథ ప్రారంభించాడు. రకరకాల పన్నుల పేర్లు చెప్పి రూ.9 వేలతో ప్రారంభించి భారీ మొత్తం గుంజాడు. మరో రూ.50 వేలు డిమాండ్ చేయడంతో బాధితురాలు మోసపోయానని గుర్తించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
నేవీ ఉద్యోగినుంచి రూ.96.5 వేలు...
కంచన్‌బాగ్‌కు చెందిన సంతోష్ కుమార్ నేవీలో సెయిలర్‌గా పని చేస్తున్నారు. ఓఎల్‌ఎక్స్‌లో ఓ కారు విక్రయానికి సంబంధించిన యాడ్‌కు ఈయన ఆకర్షితులయ్యారు. అందులో పేర్కొన్న నంబర్‌ను సంప్రదించగా.. రూ.1.85 లక్షల ధరగా చెప్పి కవిత శర్మ అనే మహిళను కాంటాక్ట్ చేయాలంటూ నంబర్ ఇచ్చారు. సంతోష్ ఆమెతో మాట్లాడగా... తాను ఢిల్లీకి.. అక్కడ నుంచి ఆస్ట్రేలియా వచ్చేసినట్లు చెప్పారు. కారు మాత్రం విమానాశ్రయ పార్కింగ్‌లో ఉందని నమ్మబలికారు. వివిధ దఫాలుగా రూ.96,500 కాజేశారు. విమానాశ్రయానికి వెళ్లి చెక్ చేసిన సంతోష్ తాను మోసపోయానని గుర్తించి సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
ఓపీటీ ఫ్రాడ్‌లో రూ.75 వేలు..
హసన్‌నగర్‌కు చెందిన జహీరుద్దీన్ వృత్తి రీత్యా టైలర్. ఈ నెల 17న ఇతడికి కాల్ చేసిన వ్యక్తి బ్యాంకు అధికారిగా పరిచయం చేసుకున్నాడు. క్రెడిట్‌కార్డ్ వివరాలు సరిచూస్తున్నామంటూ చెప్పాడు. జహీరుద్దీన్ నుంచి బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు సంగ్రహించాడు. వీటిని వినియోగించి ఆన్‌లైన్ లావాదేవీలు చేసిన నేరగాడు అతడి ద్వారానే మూడుసార్లు ‘వన్ టైమ్ పాస్‌వర్డ్స్’ (ఓటీపీ) అడిగి తెలుసుకున్నాడు. వీటిని వినియోగించి బాధితుడి ఖాతాలో ఉన్న రూ.75 వేలు మూడు దఫాల్లో కాజేశాడు. మొత్తానికి మోసపోయానని గుర్తించిన బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
అపరిచితులతో లావాదేవీలు వద్దు..
ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బహుమతి వచ్చిందంటేనో, కారు, సెల్‌ఫోన్ తక్కువ ధరకు విక్రయిస్తామంటేనో నమ్మకూడదు. ప్రత్యక్షంగా చూడనిదే ఏదీ నిర్ధారించుకోకూడదు. అపరిచితులతో ఎలాంటి లావాదేవీలు వద్దు. ఇవి కేవలం ఆర్థిక నష్టాన్నే కాదు ఒక్కోసారి కొత్త సమస్యల్నీ తెచ్చిపెడతాయి. బ్యాంకు అధికారుల పేరు చెప్పి ఎవరైనా కాల్ చేసి ఓటీపీ అడిగితే నమ్మవద్దు. బ్యాంకులు అసలు అలా చేయనే చేయవు. సైబర్ నేరాలపై అవగాహనకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే 25 లక్షల కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు షార్ట్ ఫిల్మŠస్ కూడా అందుబాటులోకి తెచ్చాం. – కేసీఎస్ రఘువీర్, అదనపు డీసీపీ, సైబర్ క్రైమ్
Comments
Please login to add a commentAdd a comment