మెయిల్స్‌ సృష్టించి.. అమెరికన్లకు టోకరా! | Cyber Criminals Cheat to Amercans in Hyderabad | Sakshi
Sakshi News home page

ముంబై కేంద్రంగా అమెరికన్లకు టోకరా!

Published Wed, Jul 10 2019 9:38 AM | Last Updated on Wed, Jul 10 2019 9:49 AM

Cyber Criminals Cheat to Amercans in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముంబై ముఠా అమెరికావాసుల్ని లక్ష్యంగా చేసుకుంది... ఆ దేశంతోపాటు ఇక్కడి అనేక నగరాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది... ముఠాసభ్యులు ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌(ఐఆర్‌ఎస్‌) అధికారుల అవతారం ఎత్తారు... పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయంటూ వాయిస్‌ మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌తో అమెరికన్లను బెదిరించారు... కొన్ని గిఫ్ట్‌కార్డ్స్‌ కొనాలంటూ వారి డెబిట్‌ కార్డుల వివరాలు తెలుసుకుని నిండా ముంచారు... ఈ పంథాలో రూ.కోట్లలో టోకరా వేసిన ఈ ఘరానా ముఠాను గతవారం ముంబై పోలీసులు పట్టుకున్నారు. వీరికి ఆ డేటా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌తోపాటు హైదరాబాద్‌ నుంచీ అందిందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు దర్యాప్తుతోపాటు నగరంలో ఉన్న ఏజెంట్లను పట్టుకోవడానికి ముంబై నుంచి ప్రత్యేక బృందం సిటీకి రానుంది.

అప్పులపాలై తప్పుదారి...
ముంబైకి చెందిన ఈ గ్యాంగ్‌ సూత్రధారి యోగేశ్‌ శర్మ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పాడు. ఆరు నెలల క్రితం అక్కడి వెస్ట్‌ గోరేగావ్‌లో ఉన్న ఛావ్ల్‌ ప్రాంతంలోని భవనంలో కొంతభాగాన్ని అద్దెకు తీసుకున్నాడు. అందులో బీపీవో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి నష్టాలు చవి చూశాడు. తర్వాత మరొకరితో కలసి అందులోనే ఆయుర్వేద ఉత్పత్తుల్ని విదేశీయులకు విక్రయించడానికి ఓ కాల్‌ సెంటర్‌ ప్రారంభించాడు. ఇదీ ఆశించిన స్థాయిలో సఫలం కాలేదు. ఫలితంగా నష్టాలపాలై అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి మోసాల బాటపట్టాడు. ముంబైలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభిషేక్‌ సాలియన్, నయీమ్‌ ఖాన్, ఆసిఫ్, ప్రదీప్‌కుమార్‌లతో కలసి ముఠా ఏర్పాటు చేశాడు. యోగేష్‌ అమెరికాతోపాటు దేశంలోని ఇతర నగరాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. అహ్మదాబాద్, హైదరాబాద్‌లో ఉన్న వ్యక్తుల నుంచి అమెరికా జాతీయులకు చెందిన సోషల్‌ సెక్యూరిటీ నంబర్ల (ఎస్‌ఎస్‌ఎన్‌) డేటాను సంగ్రహించాడు. దీని ఆధారంగా ఈ ముఠా సభ్యులు అమెరికాకు చెందిన ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారుల అవతారమెత్తారు.

వాయిస్‌ మెయిల్స్‌ సృష్టించి...
ఆ డేటా ఆధారంగా ఒక్కో నిందితుడు వాయిస్‌ మెయిల్స్‌ సృష్టించి వెయ్యిమందికి పంపేవారు. ఐఆర్‌ఎస్‌ అధికారులమంటూ పరిచయం చేసుకుని పన్ను చెల్లింపులో కొన్ని అవకతవకలు జరిగాయని, దానికి సంబంధించి జరిమానాలు చెల్లించాల్సి ఉందని బెదిరించేవారు. అమెరికా ఐఆర్‌ఎస్‌ విభాగం కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకుందని, దీని ప్రకారం జరిమానా మొత్తం నుంచి 25 శాతం వెచ్చించి ఆయా సంస్థల గిఫ్ట్‌కార్డ్స్‌ కొనాల్సి ఉంటుందని వారి డెబిట్‌కార్డుల డేటా సంగ్రహించేవారు. ఇతర రహస్య వివరాలు అమెరికన్ల నుంచి తెలుసుకుని వారి ఖాతాల్లోని డబ్బును వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్ల ఖాతాల్లోకి మళ్లించి మోసం చేసేవారు. ఆపై ఫోన్‌ నంబర్లు మార్చేసి అందుబాటులో లేకుండాపోయేవారు. గడిచిన 45 రోజులుగా ఈ పంథాలో అనేకమంది అమెరికన్ల నుంచి రూ.కోట్లు కాజేశారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టి గురువారం ఈ ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. విచారణలో హైదరాబాద్‌ లింకులు బయటకురాడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసు దర్యాప్తుతోపాటు డేటా అందించిన ఏజెంట్లను పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపారు. ముంబై ముఠాకు సహకరించిన హైదరాబాదీలు ఎవరనే విషయంపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement